ఈ-శ్రమ్‌ నమోదు..నత్తనడక

ABN , First Publish Date - 2021-10-24T04:52:19+05:30 IST

అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల రిజిస్ట్రేషన్‌ నత్తనడకన కొనసాగుతోంది.

ఈ-శ్రమ్‌ నమోదు..నత్తనడక

జిల్లాల్లో 15 లక్షల పైగా అసంఘటిత రంగ కార్మికులు

ఇప్పటికి కేవలం  54,033 మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ 

అవగాహన లేమి కారణం


గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల రిజిస్ట్రేషన్‌ నత్తనడకన కొనసాగుతోంది. కార్మిక శాఖ సర్వే ప్రకారం జిల్లాలో సుమారుగా 15 లక్షల పైచిలుకు అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని అంచనా. వీరిలో ఇప్పటివరకు 54,033 మంది మాత్రమే రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో 35,339 మంది కామన్‌ సర్వీసు సెంటర్స్‌, 18,694 మంది సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.  ఈ-శ్రమ్‌ గురించి కార్మికులకు తగిన సమాచారం, అవగాహన లేకపోవడంతో వారు తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీని వలన ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మాన్‌-దాన్‌, షాప్‌కీపర్లు, ట్రేడర్లు, స్వయం ఉపాధి పొందే వారి కోసం నిర్దేశించిన నేషనల్‌ పెన్షన్‌ స్కీం, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగాం, ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, చేనేతలకు హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌, సఫాయి కర్మచారీలకు ఆర్థిక సహకారం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందలేరు.


ఎవరెవరు అర్హులు..

దేశవ్యాప్తంగా కార్మికుల డేటాబేస్‌ ఏర్పాటుతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి, ఆర్థికసాయం, ఉపాధి కల్పనకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్యన ఉన్న కార్మికులంతా ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తాపీ, సెంట్రింగ్‌, రాడ్‌బెండింగ్‌, ప్లంబింగ్‌, కార్పెంట్‌, పెయింటింగ్‌, వెల్డింగ్‌, శానిటరీ వర్కర్స్‌, పూడికతీసేవారు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, తోపుడుబండి వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, చేతివృత్తుల వారు, కొరియర్‌ బాయ్స్‌, ఇతర సంస్థల్లో పనిచేస్తూ ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సభ్యత్వం లేనివారు అసంఘటిత కార్మికుల జాబితాలోకి వస్తారు. వీరు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.


ఎలా నమోదు చేసుకోవాలి..

ఆయా రంగాల కార్మికులు తమకు సమీపంలోని కామన్‌ సర్వీసు సెంటర్లు, పోస్టాఫీసు, కార్మిక శాఖ కార్యాలయాల్లోని కౌంటర్లకు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ-కేవైసీ కలిగి ఉన్న ఆధార్‌కార్డు, ఆ ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలతో కామన్‌ సర్వీసు సెంటర్‌కు వెళ్లాలి. విజయవంతంగా నమోదు అయిన వారికి 12 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు లభిస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కూడా వర్తిస్తుంది. కాగా కామన్‌ సర్వీసు సెంటర్లకు వెళ్లలేని వారు ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌లో సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 


 కార్మిక శాఖ, కామన్‌ సర్వీసు సెంటర్లు చొరవ చూపి జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులందరిని ఈశ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్టర్‌ అయ్యేలా చూడాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కార్మికులు పని చేసే ప్రదేశాలకే అధికారులు వెళ్లి స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తే తప్ప రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు. 


 

Updated Date - 2021-10-24T04:52:19+05:30 IST