కార్మికుల పొట్టకొడితే నాశనమే

ABN , First Publish Date - 2022-09-21T05:26:34+05:30 IST

కార్మికుల పొట్టకొడితే నాశనం తప్పదని వైసీపీ ప్రభుత్వానికి కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

కార్మికుల పొట్టకొడితే నాశనమే
మెడకు చిప్పలు, ఉరితాళ్లు వేసుకొని ర్యాలీగా వెళుతున్న కార్మికులు

సీఐటీయూ నాయకుల హెచ్చరిక

కనీస వేతనం కోసం కలెక్టరేట్‌ వద్ద ధర్నా

అనంతపురం టౌన, సెప్టెంబరు 20: కార్మికుల పొట్టకొడితే నాశనం తప్పదని వైసీపీ ప్రభుత్వానికి కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం ఆందోళనకు దిగారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు మెడకు కొబ్బరి చిప్పలు, ఉరితాళ్లు వేలాడదీసుకుని నిరసన తెలిపారు. రైతు బజార్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఓబులు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇంకా కార్మికులు, ఉద్యోగులు వెట్టిచాకిరీ చేయాల్సిరావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల జీవితాలలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కార్మికులు మూడు పూటలా కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి ఉందని అన్నారు. ఐదేళ్లు పనిచేసినందుకే ప్రజా ప్రతినిధులకు లక్షల వేతనాలు, పెన్షన సదుపాయం కల్పిస్తున్నారని, నిత్యం శ్రమించే కార్మికులకు మాత్రం చట్టం ప్రకారం జీతాలు, భద్రత కల్పించడం లేదని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నీరు గారుస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన సైతం కార్మికులకు అండగా ఉండకుండా మోదీ వద్ద మోకరిల్లడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆయన ఇంటి ముట్టడికి వెనకాడబోమని హెచ్చరించారు. ధర్నాలో పలువురు నాయకులు ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌, సీపీఎం నాయకుడు నాగేంద్ర, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, ఎస్‌ఎ్‌ఫఐ నాయకుడు పరమేష్‌, సీఐటీయూ నాయకులు ఆర్‌వీ నాయుడు, ఉమాగౌడ్‌, వెంకటనారాయణ, రమాదేవి, యమున, నాగభూషణ, ఎనహెచఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-21T05:26:34+05:30 IST