కాస్త కదలిక..

ABN , First Publish Date - 2021-10-10T06:44:39+05:30 IST

గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్‌ భూసేకరణ సర్వే చేపట్టేందుకు రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు ఎట్టకేలకు సమాయత్తమవుతున్నారు.

కాస్త కదలిక..
వైనతేయ నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం..

 రైల్వేలైన్‌ భూసేకరణకు రంగం సిద్ధం

 509 ఎకరాలు భూ సేకరణ లక్ష్యం

 భూ సేకరణ సర్వేకు ప్రత్యేక బృందాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్‌ భూసేకరణ సర్వే చేపట్టేందుకు రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు ఎట్టకేలకు సమాయత్తమవుతున్నారు. సుమారు 509 ఎకరాల భూమిని రైల్వే ప్రాజెక్టు కోసం సేకరించాల్సి ఉంది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మా ణానికి అవసరమైన భూసేకరణ పనులను సత్వరం చేప ట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో కదలిక వచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్టు స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శితో సమీక్షించారు. దీంతోపాటు రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో దక్షిణమధ్య రైల్వే జీఎం సమావేశమై పెం డింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఇచ్చిన ఆదేశాలతో కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అంశంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ వివిధశాఖల అధికారులతో రెండు రోజుల కిందట సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే విభాగం, రైల్వేశాఖ అధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణానికి మొత్తం 807 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు సిదఽ్ధం చేశారు. ఇప్పటికే 290 ఎకరాల భూమిని సేకరణ పూర్తయింది. ఇంకా 509 ఎకరాల భూమిని సేకరించాలని అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు జేసీకి వివరించారు. రెవెన్యూ, సర్వే, రైల్వేశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే తనిఖీ నిర్వహించాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భూసేకరణ సర్వే పూర్తిచేయాలని, అనంతరం భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పా టుచేసి ప్రాథమిక సర్వే పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై ప్రత్యే క దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు చేస్తే ఇప్పటికే వశిష్ఠ, వైన తేయ, గౌతమి నదులపై వివిధ దశల్లో ఉన్న వారధుల నిర్మాణం పూర్తి కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు జోక్యం చేసుకుని రైల్వేలైన్‌ భూసే కరణతో పాటు ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ కలలను సాకారం చేసే కోనసీమ రైల్వే లైన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని కోనసీమ వాసులు కోరుతున్నారు. 




Updated Date - 2021-10-10T06:44:39+05:30 IST