భారత్‌లో పేదరికం తగ్గింది : ప్రపంచ బ్యాంకు

ABN , First Publish Date - 2022-04-17T20:40:20+05:30 IST

భారత దేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు

భారత్‌లో పేదరికం తగ్గింది : ప్రపంచ బ్యాంకు

న్యూఢిల్లీ : భారత దేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. 2011లో 22.5 శాతం మంది పేదరికంలో ఉండేవారని, 2019 నాటికి ఇది 10.2 శాతానికి తగ్గిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం బాగా తగ్గినట్లు పేర్కొంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఇదే విధంగా చెప్పిన సంగతి తెలిసిందే.


భారత దేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు  40 ఏళ్ళలో కనిష్ట స్థాయికి తగ్గిపోయినట్లు తెలిపింది. 


ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హ రాయ్, రాయ్ వాన్ డెర్ వెయిడే రూపొందించిన ప్రపంచ బ్యాంకు వర్కింగ్ పేపర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, భారత దేశంలో పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండేది, ఇది 2019లో 11.6 శాతానికి తగ్గింది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 2011లో 14.2 శాతం పేదరికం ఉండేది, ఇది 2019లో 6.3 శాతానికి తగ్గింది. గత దశాబ్దంలో పేదరికం తగ్గినప్పటికీ, అనుకున్న స్థాయిలో తగ్గలేదని ఈ నివేదిక తెలిపింది. 


అభివృద్ధిపై ఆలోచనలను పంచుకోవడాన్ని ప్రోత్సహించడం, జరుగుతున్న పరిశోధనలలో తెలుసుకున్న విషయాలను వ్యాపింపజేయడం లక్ష్యంగా ఈ పేపర్లను రూపొందిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంగల భూమిగలవారి ఆదాయం ఎక్కువగా వృద్ధి చెందినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2013, 2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం చొప్పున వీరి ఆదాయం పెరిగినట్లు తెలిసింది. ఎక్కువ విస్తీర్ణంగల భూమి ఉన్నవారి ఆదాయం ఏటా 2 శాతం మాత్రమే పెరిగినట్లు వెల్లడైంది. 


Updated Date - 2022-04-17T20:40:20+05:30 IST