పుస్తకం.. ఆపాదమస్తకం!

ABN , First Publish Date - 2021-04-23T05:04:20+05:30 IST

ప్రతి మనిషీ ఒక పుస్తకమే. ప్రతి జీవితం ఒక నిండైన గ్రంథమే. ఎన్నో కన్నీటి అక్షరాలు, చిరునవ్వు పదాలు, ఆలోచింపజేసే వాక్యాలు, అనుభవాల పేజీలు.. కలిస్తే చక్కని పుస్తకం. గ్రంథాలు విజ్ఞాన గుళికలు, మంచి మార్గాన్ని చూపే మిత్రులు. అశలను, ఆశయాలను స్వప్నించిన ప్రతి మనిషీ మహా కావ్యమేనంటారు ఓ ప్రముఖ కవి. అదేవిధంగా చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని వీరేశలింగం పంతులు అన్న మాటలు పుస్తకం విలువను తెలియజేస్తుంది.

పుస్తకం..  ఆపాదమస్తకం!
స్వంత గ్రంథాలయంలో మధు అనే పుస్తక అభిమాని.

ప్రతి మనిషీ మహా కావ్యం

సాహితీ ప్రచురణలో సింహపురి కీర్తి

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రతి మనిషీ ఒక పుస్తకమే. ప్రతి జీవితం ఒక నిండైన గ్రంథమే. ఎన్నో కన్నీటి అక్షరాలు, చిరునవ్వు పదాలు, ఆలోచింపజేసే వాక్యాలు, అనుభవాల పేజీలు.. కలిస్తే చక్కని పుస్తకం. గ్రంథాలు విజ్ఞాన గుళికలు, మంచి మార్గాన్ని చూపే మిత్రులు. అశలను, ఆశయాలను స్వప్నించిన ప్రతి మనిషీ మహా కావ్యమేనంటారు ఓ ప్రముఖ కవి. అదేవిధంగా చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని వీరేశలింగం పంతులు అన్న మాటలు పుస్తకం విలువను తెలియజేస్తుంది. 

సింహపురి సీమ కూడా సాహితీ సేద్యంలో, పుస్తకాల ప్రచురణలో తొలినాళ్ల నుంచి ఎనదగిన పాత్రను పోషించింది. తరతరాలుగా ఎంతో మంది అనుసరిస్తున్న పెద్ద బాలశిక్ష వంటి ప్రయోగాత్మకమైన పుస్తకాన్ని వెలువరించింది నెల్లూరీయుడు వఝ్జల సీతారామ శాస్త్రి. తొలి కళాప్రపూర్ణ, సాహితీస్రష్ఠ వేదం వేంకటరాయ శాస్త్రి, ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్త వెన్నెలకంటి సుబ్బారావు, తొలి యాత్రా కథకుడు ఏనుగుల వీరస్వామి, తొలి గిరిజన కథకుడు గూడూరు రాజేంద్రరావు, వెయ్యేళ్ల సాహిత్యానికి అచ్చు రూపాన్ని అందించిన వావిళ్ల రామస్వామి, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రులు, తొలి కథకుడు తాతాచారి...  వీరంతా నెల్లూరువారే. తాతాచారి 1855వ సంవత్సరంలో సీపీ బ్రౌను కొలువులో ఉండగా ఆయన కథలను బ్రౌన్‌ దొరే అచ్చు వేయించారు. ఇక, తొలి యక్షగాన కవి కొండూరు సీతారామ కవి, కందుకూరి రుద్రకవి వంటి ఎందరో మహామహులు వెలువరించిన పుస్తక సంపద తెలుగునాట నేటికీ సింహపురి సాహితీ సుగంధాలను వెదజల్లుతోంది. ఆనాటి వైభవం ఇంకనూ కథ, కవిత, నాటక, చరిత్ర, సినిమా, జానపద, కళా సాహిత్య ప్రక్రియలలో కొనసాగుతూనే ఉంది. వర్ధమాన సమాజం, సరస్వతీ సమాజంలాంటి గ్రంథాలయాలే కాదు, ఎందరో సాహితీవేత్తలు, పుస్తక ప్రేమికులకు నెల్లూరు నిలయం. స్వంత గ్రంథాలయాల్లో పుస్తక సంపదను కాపాడుతున్న వారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. శుక్రవారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వారందరి స్ఫూర్తితో మరెంతో మంది పుస్తక ప్రేమికులుగా మారాలని, వాటితో స్నేహం ద్వారా మరింత ఉత్తమ సమాజానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.

- నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి)

Updated Date - 2021-04-23T05:04:20+05:30 IST