వైకల్యం ఓడింది

ABN , First Publish Date - 2021-12-01T05:21:42+05:30 IST

ఫిజికల్లీ ఛాలెంజెడ్‌ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం వెల్లివిరిశాయి. ఆత్మస్థైర్యం ముందు వైకల్యం ఓడింది అనడానికి అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవా రం జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌లో దివ్యాంగ క్రీడాకారుల ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.

వైకల్యం ఓడింది
ట్రైసైకిల్‌ క్రీడలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మిశ్రా

ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు

ఏలూరు స్పోర్ట్స్‌, నవంబరు 30 : ఫిజికల్లీ ఛాలెంజెడ్‌ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం వెల్లివిరిశాయి. ఆత్మస్థైర్యం ముందు వైకల్యం ఓడింది అనడానికి అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవా రం జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌లో దివ్యాంగ క్రీడాకారుల ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ తాము ఎవరికీ తీసిపోమనే రీతిలో ఎన్నో పతకాలు సాధించిన వికలాంగుల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని అన్నారు. దివ్యాంగులు పలు క్రీడల్లో ఉత్సాహంగా తమ సత్తా చాటారు. అంధుల మని, మానసిక వికలాంగులమనే ఆలోచనే వారి మదిలో మెదలకుండా షాట్‌పుట్‌ విసిరి పరుగులు పెట్టారు. త్రిచక్ర వాహనాలపై పోటీకి దిగారు. జిల్లా నలుమూలల నుంచి అంధులు, రన్నింగ్‌, చెస్‌, క్యారంబోర్డు, ట్రైసైకిల్‌, జావెలింగ్‌త్రో, షాట్‌పుట్‌, క్రికెట్‌, వాలీబాల్‌, పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులకు డిసెంబరు 3న జరిగే కార్యక్రమంలో పతకాలు అందజేస్తారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పద్మావతి(ఆసరా), డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ ఎం.ఝాన్సీరాణి, పలు ఎన్జీవో సంస్థలు, పీఈటీలు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-01T05:21:42+05:30 IST