పండు నిగనిగ లాడుతోందని.. పొరపాటున నోటితో కొరికారో ప్రాణాలే పోతాయి.. ప్రపంచంలోనే అత్యంత విషపు చెట్టు గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2021-11-04T14:57:54+05:30 IST

మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు కీలక..

పండు నిగనిగ లాడుతోందని.. పొరపాటున నోటితో కొరికారో ప్రాణాలే పోతాయి.. ప్రపంచంలోనే అత్యంత విషపు చెట్టు గురించి మీకు తెలుసా?

మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. చెట్ల నుంచి లభించే రుచికరమైన పండ్లలో మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ చెట్టు పేరు మన్షినీల్. ఈ చెట్లు ఫ్లోరిడా, కరేబియన్ సముద్ర తీరాలలో కనిపిస్తుంటాయి. ఈ చెట్టు చాలా విషపూరితమైనది. ఎవరైనా ఈ చెట్టును తాకితే వారి శరీరంపై బొబ్బలు వస్తాయి. ఈ చెట్టు పండు అత్యంత విషపూరితమైనది. ఈ పండులోని చిన్నముక్కను తిన్నాకూడా చనిపోతారని శాస్త్రవేత్తలు తెలిపారు. 


ఈ పండు చిన్న యాపిల్ పరిమాణంలో ఉంటుంది. క్రిస్టోఫర్ కొలంబస్.. మన్షినీల్ పండును లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్ అని పేర్కొన్నారు. అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఎవరైనా చెట్టు కింద నిలబడతారు. అయితే పొరపాటున ఈ చెట్టు కింద నిలబడితే వెంటనే అనారోగ్యం పాలవుతారు. అందుకే ఈ చెట్టు సమీపంలోకి ఎవరూ రాకుండా, దాని పండ్లు తినకుండా ఉండేందుకు, ఈ చెట్ల చుట్టూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ చెట్టును విషపూరితమని, దూరంగా ఉందాలని ఆ బోర్డులపై రాశారు. నికోలా హెచ్ స్ట్రిక్‌ల్యాండ్ అనే శాస్త్రవేత్త తెలిపిన వివరాల ప్రకారం.. ఒకసారి అతను, అతని స్నేహితులు కొందరు కరేబియన్ దీవి టొబాగో బీచ్‌కి వెళ్లారు.


అక్కడ అతను ఈ పండు తిన్నాడు. దాని రుచి చాలా చేదుగా ఉంది. ఆ పండు తిన్న కొద్దిసేపటికే శరీరంలో మంటలు, వాపులు మొదలయ్యాయి. అయితే, వెంటనే చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మన్షినీల్ చెట్టు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీని ఆకులు మెరిస్తూ, అండాకారంలో ఉంటాయి. అయితే ఈ చెట్టు నేల కోతను నివారించడంలో సహాయపడుతుంది. కరేబియన్ ప్రాంతానికి చెందిన వడ్రంగిపనివారు ఈ చెట్టు కలపను ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే చెట్టును నరికేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్నిచర్ తయారు చేయడానికి ముందు కలపను చాలా సేపు ఎండలో ఆరబెడతారు, తద్వారా ఆ కలపలోని విషరసం తొలగిపోతుంది. 

Updated Date - 2021-11-04T14:57:54+05:30 IST