ltrScrptTheme3

మళ్లీ భయాలు

Oct 23 2021 @ 00:44AM

చైనాలో రేగిన కరోనా కలవరం మిగతా ప్రపంచాన్ని కూడా భయపెడుతోంది. కరోనా నిరోధం విషయంలో అతికఠినంగా వ్యవహరించే చైనా హఠాత్తుగా కొందరు పర్యాటకులు తెచ్చిపెట్టిన ఈ కొత్త విపత్తుకు వొణికిపోతున్నది. షాంఘైనుంచి అనేక ప్రావిన్సులు తిరిగిన ఓ పర్యాటక బృందం మార్గమధ్యంలో ఎంతోమందికి వైరస్‌ అంటించివుండవచ్చునని అధికారుల అనుమానం. ఆ వ్యాప్తి ఏ స్థాయిలో ఎంతవరకూ విస్తరించిందో నిర్థారించే నిమిత్తం మొత్తం దేశాన్నే జల్లెడపట్టే భారీ కార్యక్రమం కొనసాగుతున్నది. విహార స్థలాలు, పర్యాటక ప్రాంతాలు మూతబడ్డాయి, రైళ్ళు విమాన సర్వీసులు రద్దయ్యాయి, కొన్ని నగరాల్లో ఏకంగా జనాన్ని బయటకు రానివ్వడం లేదు. 


మహమ్మారి దెబ్బకు ఆర్థికంగా కుదేలైన దేశాలు ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్నాయని సంతోషించేలోగా, చాలా దేశాల్లో కరోనా తిరిగి బుసకొడుతున్నది. చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాల్లో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్‌లో ఒక్కసారిగా కేసులు పదిహేనుశాతం, రష్యాలో పదహారుశాతం హెచ్చాయి. బ్రిటన్‌లో గత ఏడునెలల్లో ఎన్నడూ లేనిస్థాయిలో రోజుకు యాభైవేల కేసులవరకూ నమోదవుతున్నాయి. డెల్టావేరియంట్‌ ఆ దేశాన్ని అత్యధికంగా దెబ్బతీస్తున్న తరుణంలో ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌ తన పంజా బలంగా విసురుతున్నది.


శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దీని విస్తరణ అనూహ్యవేగంతో ఉండవచ్చునని బ్రిటన్‌ భయపడుతోంది. ఇక రష్యాలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రతిరోజూ నలభైవేలవరకూ కేసులు నమోదవుతుంటే, మరణాల సంఖ్య ఏ రోజుకారోజు మరింత పెరుగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో కేసులే కాదు, మరణాలు కూడా గత రికార్డులను చెరిపివేశాయి. ఇప్పటివరకూ రష్యా కనీవినీ ఎరుగని స్థాయిలో రాబోయే వారంలో విధ్వంసాన్ని చూడబోతున్నదని అధికారులు అంటున్నారు. పుతిన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు అక్టోబరు ముప్పైనుంచి నవంబరు ఏడువరకూ వేతనంతో కూడిన సెలవు ఇచ్చి ఇల్లుదాటవద్దని ముందే చెప్పింది. ఆహారం, ఆరోగ్యం ఇత్యాది మౌలిక వ్యవస్థలు వినా మిగతావన్నీ రాబోయే రోజుల్లో మూసివేసేందుకు వీలుగా రష్యన్‌ ప్రభుత్వం  ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఉక్రెయిన్‌, జార్జియా ఇత్యాది చోట్ల కేసులు మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సింగపూర్‌లోనూ ఆక్సిజన్‌ అవసరపడేవారిసంఖ్య ఒక్కసారిగా హెచ్చిందని అధికారులు అంటున్నారు.


ఆంక్షలు సడలించడం వల్లనే కరోనా తిరిగి విజృంభిస్తున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ విమర్శిస్తున్నది. ఆర్థికం కోసం ఆంక్షలు సడలించక తప్పదు కానీ, కరోనా అనే ఓ ప్రమాదకర అంటువ్యాధి మనమధ్యన ఉన్నదన్న విచక్షణే లేకుండా చాలా దేశాలు ప్రజలను స్వేచ్ఛగా వదిలేసినమాట నిజం. ఇప్పటికే చాలా దేశాల్లో ఐసీయూలు కిటకిటలాడుతూ ఆరోగ్యవ్యవస్థ భారంతో కుంటుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సరికొత్త రూపాలతో విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్‌ చేయాలంటే సామాజిక దూరాలు, మాస్కులతో పాటు వాక్సిన్‌ అత్యంత ముఖ్యం. కనీసం ఒక్కడోసు తీసుకున్నా చాలు, శరీరంమీద వైరస్‌ ప్రభావాన్ని నిరోధించి ప్రాణానికి ప్రమాదం రాకుండా ఆపవచ్చునని రుజువైంది. ఈ క్రిమి భూగోళం మీద ఏ మూలన దాగివున్నా తమకు ఎప్పటికైనా ప్రమాదమేననీ, వాక్సిన్‌ సహకారం ముఖ్యమని ధనికదేశాలు ఎందుకో గుర్తించడం లేదు. అన్ని దేశాలూ వాక్సిన్‌ తయారుచేసుకోగలిగి, ఇచ్చిపుచ్చుకున్ననాడు వైరస్‌కు భయపడాల్సిన పని ఉండదు. తయారైన వాక్సిన్లను గంపగుత్తగా కొనేసి దాచుకున్న అగ్రరాజ్యాలు ఇప్పటికైనా పేదదేశాలకు టీకా సరఫరాచేయాల్సిన బాధ్యతను గుర్తించాలి. 


వాక్సిన్లపై తాత్కాలికంగా మేథోసంపత్తి హక్కులను ఎత్తివేయాలని ఏడాది క్రితం భారత్‌, దక్షిణాఫ్రికాలు ప్రపంచవాణిజ్య సంస్థముందు ప్రతిపాదన పెట్టాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాక్సిన్‌ను స్వయంగా ఉత్పత్తిచేసుకోగలిగే ఈ ఆలోచనను వందదేశాలు సమర్థిస్తే, యూరోపియన్‌ యూనియన్‌ సహా కొన్ని దేశాలు కాదన్నాయి. ఈ ప్రతిపాదనను గతంలో వ్యతిరేకించిన అమెరికా మొన్న మే నెలలో మనసు మార్చుకున్నప్పటికీ, ఆలోచన ఇంకా ఆచరణలోకి రావలసి ఉన్నది. కరోనాపై పోరు పలు పరిశోధనలూ ఆవిష్కరణలతో వేగంగా సంఘటితంగా సాగకపోతే ఆ మహమ్మారిని జయించడం సమీపకాలంలో సాధ్యపడదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.