Dubai Moon Resort: దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం.. ఈసారి ఏకంగా 'చందమామ'నే నేలకు దించుతోంది బాస్..!

ABN , First Publish Date - 2022-09-17T15:15:05+05:30 IST

ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, వాటికి ఎన్నో హంగులు, సకాల సౌకర్యాలతో ఎడారిలో వెలిసిన భూతలస్వర్గంలా ఉంటుంది దుబాయ్ నగరం (Dubai). చాలా తక్కువ వ్యవధిలో ఎంతో వేగంగా పురోగతి సాధించిన దుబాయ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాలకు అభివృద్ధి పరంగా గట్టిపోటీనిస్తోంది.

Dubai Moon Resort: దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం.. ఈసారి ఏకంగా 'చందమామ'నే నేలకు దించుతోంది బాస్..!

దుబాయ్: ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, వాటికి ఎన్నో హంగులు, సకాల సౌకర్యాలతో ఎడారిలో వెలిసిన భూతలస్వర్గంలా ఉంటుంది దుబాయ్ నగరం (Dubai). చాలా తక్కువ వ్యవధిలో ఎంతో వేగంగా పురోగతి సాధించిన దుబాయ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాలకు అభివృద్ధి పరంగా గట్టిపోటీనిస్తోంది. ఒకప్పుడు ఎడారి దిబ్బగా ఉన్న దుబాయ్ నగరం ఇప్పుడు అన్ని రంగాలలో జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోంది. ఇక దుబాయ్ పర్యాటకం (Dubai Tourism) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతియేటా దుబాయ్‌కు భారీ సంఖ్యలో సందర్శకులు క్యూకడుతుంటారు. అందుకే దుబాయ్‌కు ముఖ్య ఆదాయ రంగం పర్యాటకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో దుబాయ్‌ను అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అక్కడి పాలకులు నడుంబిగించారు. 


దీనిలో భాగంగానే అక్కడి మీనా ప్రాంతంలో మూన్ దుబాయ్ (Moon Dubai) పేరిట సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇది అచ్చం చంద్రుడినే తలపిస్తుంది. మనం చంద్రుని ఉపరితలంపై ఉన్న అనుభూతినే కలిగిస్తుంది. పర్యాటకులే కాకుండా అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. కెనడియన్ ఆర్కిటెక్చరల్ కంపెనీ, మూన్ వరల్డ్ రిసార్ట్స్ (Moon World Resorts) ఈ అతిపెద్ద మూన్ ప్రాజెక్ట్‌ను 5బిలియన్ డాలర్ల (రూ. 3,96,85,85,00,000)తో నిర్మించేందుకు దుబాయ్ ప్రభుత్వం ముందు ప్రపొజల్ పెట్టింది. ఇక మూన్ వరల్డ్ రిసార్ట్స్ (Moon World Resorts) నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్కిటెక్చరల్ కంపెనీ సాండ్రా జీ మాథ్యూస్ అండ్ మైఖేల్ ఆర్ హెండర్సన్ (Sandra G Matthews and Michael R Henderson) ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ భారీ నిర్మాణాన్ని 224 మీటర్ల ఎత్తుతో నిర్మించనుంది. 


అంతేగాక మూన్ దుబాయ్ అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఆధునిక కాలపు టూరిజం ప్రాజెక్టు అవుతుందని వెల్లడించింది. ఈ మూన్ ప్రాజెక్టు వార్షికంగా సుమారు 2.5 మిలియన్ల మంది పర్యాటకులను ఆకార్షించే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ బయటి నుంచి చూస్తే అచ్చుగుద్దినట్టుగా చందమామ ఉపరితలాన్ని పోలి ఉంటుందని తెలిపింది. ఇక ఈ మూన్ రిసార్ట్‌ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. స్పేస్ టూరిజంపై ఆసక్తి ఉన్నవారికి, వ్యయాన్ని భరించగలిగిన వారికి ఇక్కడి లూనార్ పేరిట నిర్మించే ప్రైవేట్ కాలనీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందట. చంద్రుడిపై ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తామని, 300 ప్రైవేట్ నివాస గృహాలు కూడా ఉంటాయని నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. వీటిని బయటి వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ యజమానులు రిసార్ట్ యొక్క ప్రత్యేకమైన ప్రైవేట్ క్లబ్‌లో సభ్యులుగా ఉంటారు. 


కాగా, కొద్దిపాటి స్థలంలోనే అధిక సంఖ్యలో గృహాల నిర్మాణం కోసం స్కై విల్లాస్ (Sky Villas) పేరిట డిస్క్ ఆకారంలో భవనం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మూన్ రిసార్ట్‌లో స్పా సెక్షన్, హెల్త్  క్లబ్, నైట్ క్లబ్, ఈవెంట్ సెంటర్, ఇంటర్నెషనల్ మీటింగ్ రూమ్, సూట్, ఇండోర్ మూన్ షటిల్ వంటి ప్రత్యేక నిర్మాణాలు కూడా ఉంటాయి. ఇక ఈ ప్రాజెక్ట్ LEED (లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్) గోల్డ్ సర్టిఫికేషన్ కింద పనిచేయనుంది. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా వంటి భారీ నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేక స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. 

Updated Date - 2022-09-17T15:15:05+05:30 IST