చెరకు రైతులకు చింతేనా?

ABN , First Publish Date - 2020-11-10T05:03:25+05:30 IST

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ పరిధిలోని రైతులకు చింత తప్పడం లేదు. రేయింబవళ్లూ కష్టపడి సాగు చేసిన పంటను ఎంతో ఆశతో కర్మాగానికి అందిస్తే చేతికి డబ్బులు అందేసరికి నెలలు.. సంవత్సరాలు పడుతోంది. అదీ చెల్లింపుల కోసం ఉద్యమం చేస్తేనే దక్కుతోంది.

చెరకు రైతులకు చింతేనా?
ఎన్‌సీఎస్‌ సుగర్స్‌

ఏళ్లుగా బకాయిలు

సహకరించని ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ యాజమాన్యం

తగ్గుతున్న పంట విస్తీర్ణం

భూములు అమ్మితేనే చెల్లింపులు

మరో 15 ఎకరాలు విక్రయానికి సిద్ధం


ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ పరిధిలోని రైతులకు చింత తప్పడం లేదు. రేయింబవళ్లూ కష్టపడి సాగు చేసిన పంటను ఎంతో ఆశతో కర్మాగానికి అందిస్తే చేతికి డబ్బులు అందేసరికి నెలలు.. సంవత్సరాలు పడుతోంది. అదీ చెల్లింపుల కోసం ఉద్యమం చేస్తేనే దక్కుతోంది. మరోవైపు భూములు అమ్మితే కాని చెల్లింపులు చేయలేని పరిస్థితిలో సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉండడం అందరినీ నిరాశ పరుస్తోంది. ఇటీవల చాలా మంది రైతులకు ఇదే విధంగా బకాయిలు చెల్లించారు. మరో 15 ఎకరాలను విక్రయించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఇక్కడున్న ప్రతికూల పరిస్థితుల వల్ల సుగర్స్‌ పరిధిలో చెరకు విస్తీర్ణం ఏటా అధికంగా తగ్గిపోతోంది. 


(పార్వతీపురం)

లచ్చయ్యపేట చక్కెర కర్మాగార యాజమాన్యం(ఎన్‌సీఎస్‌) రైతులకు ఎప్పుడూ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు.   చెరకు సాగుకు సలహాలు ఇస్తూ.. పంటను తీసుకున్నప్పుడు సకాలంలో చెల్లింపులు చేస్తామని చెబుతుంటుంది. కానీ సేకరించిన తర్వాత మళ్లీ పూర్వ పరిస్థితే. అందుకే ఏ రైతును కదిపినా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ. 9.67 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు బకాయిలు చెల్లించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తే భూములు విక్రయించి అప్పు తీర్చుతామని చెబుతోంది తప్ప కర్మాగారం ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లించడం లేదు. చక్కెర విక్రయం ద్వారా సమకూరే డబ్బులు ఎటు వెళ్లిపోతున్నాయని రైతులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ కాలంలో అధికారులకు తెలియకుండానే యాజమాన్యం మొలాసిస్‌ విక్రయించిందని సమాచారం. ఆ డబ్బులు ఏమయ్యాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంచదార విక్రయించగా వచ్చిన సొమ్ము కాని, కర్మాగారానికి చెందిన భూములు విక్రయించడం ద్వారా సమకూరిన డబ్బులు కాని జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో చక్కెరను విక్రయించగా వచ్చిన సొమ్మును వేరే అవసరాలకు వినియోగించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.


పడిపోయిన సాగు విస్తీర్ణం

గతంలో ఎన్‌సీఎస్‌  కర్మాగారం పరిధిలో 17 మండలాల్లోని 286 గ్రామాలకు చెందిన రైతులు సుమారు ఏడు వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. ప్రస్తుతం విస్తీర్ణం వందల ఎకరాలకు పడిపోయింది. యాజమాన్యం సకాలంలో రైతులకు చెల్లింపులు చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 


అమ్మకానికి మరో 15 ఎకరాలు

రైతులకు బకాయిలు చెల్లించేందుకు కర్మాగారానికి చెందిన మరో 15 ఎకరాలను విక్రయించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందులో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు తెలిసింది. కర్మాగారానికి చెందిన భూమిని విక్రయిస్తే సుమారు రూ. 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. రైతులకు 2019-20 ఏడాదికి సంబంధించి రూ. 9.67 కోట్ల బకాయిలు ఉన్నాయి.


భూముల అమ్మకాలపై సందేహాలు

యాజమాన్యానికి చెందిన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పారిశ్రామికంగా నమోదైన ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాధ్యమేనా? లేదా దీనికోసం నిబంధనలు మారుస్తారా అన్న విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని ఏ అధికారి వద్ద ప్రస్తావించినా స్పష్టత ఇవ్వడం లేదు. 


భీమసింగి నుంచి చెరకు

 రైతులకు బకాయిలు చెల్లించకుండా భీమసింగి ప్రాంతం నుంచి చెరకు తెచ్చుకుని క్రషింగ్‌ చేయాలన్న ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. భీమసింగిలో ఈ ఏడాది క్రషింగ్‌ నిలిపేయడంతో అక్కడి చెరకుతో  ఎన్‌సీఎస్‌ యాజమాన్యం సరిపెట్టాలనుకుంటున్నట్లు రైతులు సందేహిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ ఏడాది క్రషింగ్‌ ఎలా చేస్తారో చూడాలి. 


Updated Date - 2020-11-10T05:03:25+05:30 IST