‘కొండ’ంత దిగులు

ABN , First Publish Date - 2021-07-28T05:05:19+05:30 IST

గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలపై కన్నేయడం.. తవ్వకాలకు మార్గం సుగమం చేసుకోవడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది.. అధికారులు, నేతలను ప్రసన్నం చేసుకుని దోపిడీకి తెగబడుతున్నారు. ఆ కొండలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగుల్చుతున్నారు.

‘కొండ’ంత దిగులు
బడిదేవర కొండ ప్రాంతంలో సర్వే చేస్తున్న ప్రత్యేక బృందం, వెంట అటవీ సిబ్బంది(ఫైల్‌)

  • బడిదేవర కొండ వద్ద మళ్లీ సర్వే
  • ప్రజల్లో మొదలైన ఆందోళన
  • అప్పట్లో హైకోర్టు తీర్పుతో ఆగిన గ్రానైట్‌ తవ్వకాలు
  • వ్యాపారి సొంత ఖర్చులతో నేడు రీ సర్వే
  • మౌనం వహిస్తున్న అటవీశాఖ 

  • గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలపై కన్నేయడం.. తవ్వకాలకు మార్గం సుగమం చేసుకోవడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది.. అధికారులు, నేతలను ప్రసన్నం చేసుకుని దోపిడీకి తెగబడుతున్నారు. ఆ కొండలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగుల్చుతున్నారు. తాజాగా వ్యాపారుల కన్ను బడిదేవర కొండపై పడింది. ఇక్కడ తవ్వకాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు చెప్పింది. కానీ మళ్లీ నేడు గుట్టుగా సర్వే చేశారు. వ్యాపారి సొంత ఖర్చులతో సర్వే చేయించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కొండ చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు. 

  • (పార్వతీపురం)
  • నిన్నటికి నిన్న బోడికొండపై బాంబులు పేల్చిన వ్యాపారులు... నేడు బడిదేవర కొండపై పడ్డారు. ఈ కొండను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కొండవాగు ద్వారా వచ్చే జారుడు నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. వ్యవసాయానికి ఆధారంగా నిలిచిన ఆ కొండలపైనే వ్యాపారులు తవ్వకాలకు దిగుతున్నారు. పార్వతీపురం మండలంలో లక్ష్మీనారాయణపురం రెవెన్యూ పరిధిలోని బోడికొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు సంపాదించడం, తవ్వకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు 600 ఎకరాలకు నీరు ప్రశ్నార్థకం కానుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే మండలం కోరీ రెవెన్యూ పరిధి సర్వేనెంబరు 1లోని బడిదేవర కొండపై మరోసారి తవ్వకాలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ తవ్వకాలు చేపట్టవద్దని గతంలో కోర్టు ఆదేశించింది. అప్పట్లో అటవీ శాఖ అధికారులు కూడా అడ్డుకున్నారు. రాష్ట్రస్థాయిలో అటవీ, గనులు, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేశారు. హైకోర్టు ఆదేశాలతో సర్వే నివేదికను న్యాయస్థానానికి అందించడం... కోర్టు ఆదేశంతో గనుల శాఖ 2019 జనవరి 2న రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయించడంలో అటవీ శాఖ పాత్రను ఈ ప్రాంత ప్రజలు అభినందించారు. మళ్లీ ఏమైందో కాని సర్వే ఆఫ్‌ ఇండియా బృందం బడిదేవరమ్మ కొండ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతులు రద్దయినప్పటికీ గ్రానైట్‌ తవ్వకాలకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ప్రజలు సందే హం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. 

  • అటవీ శాఖ మౌనం ఎందుకో...
  • రిజర్వు ఫారెస్టులో గ్రానైట్‌ తవ్వకాలను వ్యతిరేకించడమే కాదు. న్యాయస్థానంలో కూడా పోరాడిన అటవీ శాఖకు అనుకూలంగా తీర్పురావడంతో అప్పట్లో అటవీ అధికారుల చొరవను ఇక్కడి గిరిజనులంతా అభినందించారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో సర్వే ఆఫ్‌ ఇండియా బృందం సర్వే నిర్వహించినా అటవీశాఖ ఎందుకో మౌనంగా ఉంది. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • నాకేం తెలియదు
  • బడిదేవర కొండ వద్ద సర్వే ఆఫ్‌ ఇండియా బృందం రీసర్వే నిర్వహించినట్లు తెలియదు. నాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. గతంలో సబ్‌ డీఎఫ్‌వో వైఎస్‌ నాయుడు ఉన్నప్పుడు సర్వే జరిగింది. నేడు సర్వే ఆఫ్‌ ఇండియా బృందం చేపట్టిన సర్వేలో మా సిబ్బంది పాల్గొన్నట్లు నాకు తెలియదు.
  • - బి.రాజారావు, సబ్‌ డీఎఫ్‌వో, పార్వతీపురం

  • సర్వే చేశాం.. సంతకం చేయలేదు
  • సర్వే ఆఫ్‌ ఇండియా బృందం వస్తున్నట్లు డీఎఫ్‌వో కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం వచ్చింది. నేను హాజరయ్యాను. సర్వే బృందానికి పూర్తిగా రిజర్వు ఫారెస్టు గురించి వివరించాం. గతంలో ఇక్కడ 200 ఎకరాలను రెవెన్యూశాఖకు ఇచ్చాం. తాన్నవలస ప్రాంతంలో రెవెన్యూశాఖకు కేటాయించిన 200 ఎకరాలు కూడా కోరీ సర్వే నెంబరు ఒకటిలోనే ఉంది. అయితే వ్యాపారి సుప్రీంకోర్టుకు వెళ్లి సర్వే ఆఫ్‌ ఇండియా బృందంతో సర్వే చేయాలని కోరడం... ఆ సర్వే ఖర్చులు అతనే భరిస్తానని చెప్పడంతో సర్వే నిర్వహించాం. సర్వే బృందం నన్ను సంతకం చేయాలని కోరింది. కానీ నేను చేయలేదు.
  • - పాపారావు, ఫారెస్టర్‌, పార్వతీపురం రేంజర్‌




Updated Date - 2021-07-28T05:05:19+05:30 IST