వర్రీ సాగు

ABN , First Publish Date - 2021-10-29T05:51:07+05:30 IST

వ్యవసాయం భారమైంది. వేలల్లో పెట్టుబడులు పెట్టడమే కానీ ఆశించిన స్థాయిలో దిగుబడులు, ధరలు ఉండటం లేదు. దీంతో సాగుకు రైతులు వెనకాడుతున్నారు. ఇందుకు కొమ్మమూరు ఆయకట్టు రైతులే నిదర్శనం. ఏటా నికరంగా లక్ష ఎకరాల్లో వరిసాగు చేపట్టే రైతులు ఇప్పుడు నాల్గోవంతు దూరమయ్యారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కూలీ ఖర్చులు పెరిగాయి. అదునులో పదును(నీరు) కావాలి. దుక్కులు సిద్ధం చేయాలి. సకాలంలో నారుమళ్లు పోయాలి. నిర్ణీత కాలవ్యవధిలో నాట్లు వేయాలి. సాగునీరు సక్రమంగా అందాలి. చీడపీడలు సోకకుండా సస్యరక్షణ జరగాలి. నాట్లు, కోతల సమయంలో కూలీల కొరత లేకుండా ఉండాలి.

వర్రీ సాగు
చీరాల, స్వర్ణ మధ్య పొలాల్లో వరినాట్లు వేస్తున్న కూలీలు

 కొమ్మమూరు ఆయకట్టులో కొంత విరామమే

 వెంటాడుతున్న ప్రతికూల పరిస్థితులు

మరికొంత సాగు... మిగతాది బీడు 

పెట్టుబడులు పెరగడమూ ఓ కారణం

మెట్ట పంటల వైపు  రైతుల మొగ్గు

 వరి సాగుకు కౌలురైతుల వెనకడుగు 

చీరాల, అక్టోబరు 28:


- 16 ఎకరాల ఆసామిని.. మాగాణిలో పనిచేయటం.. చేయించటం... ఇంటినిండా పాడి... గాదెనిండా ధాన్యంతో లోగిలి కళకళలాడేది. ఇంటికి ఎవరన్నా వస్తే పాలు, మజ్జిగలు ఉచితంగా ఇచ్చేవాళ్లం. కూలీలకు పండగలకు, పబ్బాలకు గాదెలు, పురుల్లో ఉన్న ధాన్యం కొంత వారికి ఇచ్చేవాళ్లం. అది ఆనందంగా ఉండేది. నాకు 30ఏళ్లు వచ్చేవరకు ఆ పరిస్థితి. ఇప్పుడు మంచినీరును కూడా కొనాల్సి వస్తోంది. ధాన్యం ఇద్దామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఏటికేటికి పెరుగుతున్న పెట్టుబడులు, దిగజారుతున్న దిగుబడులు, ధరలు అందుకు కారణం. ఇదీ కారంచేడుకు చెందిన ఆరుపదుల వయస్సున్న రైతు మనోవేదన. 

 కొమ్మమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా పేరు. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకుభిన్నంగా ఉంది. ఆయకట్టుపరిధిలో అధికారికంగా, అనధికారికంగా సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగవుతోంది. అయితే గతేడాది ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగలేదు. అలాగే అననుకూల వాతావరణం, పెరిగిన సాగు ఖర్చులు, సాగునీరు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి లేకపోవటం తదితర కారణాలతో మొత్తం విస్తీర్ణంలో మూడొంతులు మాత్రమే సాగుచేస్తున్నారు. ఒక వంతులో కొంతమెట్ట పెర్లు, కొంత బీడుగా వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వ్యవసాయం భారమైంది. వేలల్లో పెట్టుబడులు పెట్టడమే కానీ ఆశించిన స్థాయిలో దిగుబడులు, ధరలు ఉండటం లేదు. దీంతో సాగుకు రైతులు వెనకాడుతున్నారు. ఇందుకు కొమ్మమూరు ఆయకట్టు రైతులే నిదర్శనం. ఏటా నికరంగా లక్ష ఎకరాల్లో వరిసాగు చేపట్టే రైతులు ఇప్పుడు నాల్గోవంతు దూరమయ్యారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కూలీ ఖర్చులు పెరిగాయి. అదునులో పదును(నీరు) కావాలి. దుక్కులు సిద్ధం చేయాలి. సకాలంలో నారుమళ్లు పోయాలి. నిర్ణీత కాలవ్యవధిలో నాట్లు వేయాలి. సాగునీరు సక్రమంగా అందాలి. చీడపీడలు సోకకుండా సస్యరక్షణ జరగాలి. నాట్లు, కోతల సమయంలో కూలీల కొరత లేకుండా ఉండాలి. అన్నీ సక్రమంగా ఉండి పంటచేతికి అందితే దానికి కనీసం గిట్టుబాటు ధర అటుంచి, మద్దతు ధర కూడా ఉండటం లేదు. గతేడాది ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో జరగకపోవటంతోపాటు కొన్న ఽధాన్యానికి నెలల తరబడి డబ్బు చెల్లించలేదు. ఇన్ని సమస్యల మధ్య రైతులు విసిగిపోయి పదేపదే నష్టాలతో మాగాణి సాగును కొనసాగించలేక కాడి కిందపడేస్తున్నారు. ముఖ్యంగా కౌలురైతులు ఈసారి ఎక్కువగా సాగుకు దూరమయ్యారు.

డీజిల్‌ మోత.. పెరిగిన పెట్టుబడులు..

గతేడాది డీజిల్‌ లీటరు రూ.70 ఉంటే, ప్రస్తుతం రూ.106లు దాటింది. గత ఏడాది దమ్ము చేస్తే ఎకరాకు రూ.800 వసూలు చేసేవారు. ఈ ఏడాది అదే ఎకరాకు రూ.1,400 తీసుకుంటున్నారు. ఎరువులు ఎకరాకు 5 నుంచి 6 బస్తాలు వేయాలి. నిరుటితో పోలిస్తే ఈసారి ప్రతి బస్తాకు సరాసరిన రూ.100పైనే ధర పెరిగింది. డీఏపీ, యూరియాల ధరలను భారీగా పెంచారు. నిత్యావసర సరుకుల ధరల పెంపు ప్రభావం కూలీలపై పడింది. దీంతో ఈ ఏడాది మగవారికి అదనంగా రూ.100, ఆడవారికి రూ.50 చెల్లించాల్సి వస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో నీటితడులు, ఎరువులు చల్లటం తదితర పనులకు వచ్చిన మగవారిలో అలవాటు ఉన్నవారికి కూలిడబ్బులతో మద్యం కూడా ఇవ్వాలి. ఈ ఖర్చు గతంలో రూ.80 ఉండేది. ప్రస్తుతం రూ.180 అవుతుంది. మొబైల్‌ బెల్ట్‌షాప్‌ల్లో కొనుగోలు చేస్తే ఇంకా రూ.20 అదనం.

దిగుబడులు, కొనుగోళ్లు, ధరలు అంతంతమాత్రం...

అంతకు ముందు ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చేది. గతేడాది 25 నుంచి 30 బస్తాలు మాత్రమే వచ్చింది. ఎకరాకు దుక్కి, దమ్ము(సుమారు రూ.4వేలు) నారుపీకుడు, నాట్లు వేయటం(రూ.4వేలు), ఎరువులు(రూ.5వేలు), సస్యరక్షణ (రూ.2వేలు), కలుపు(రూ.2వేలు) ఎలుకలు బెడద నివారణ(ఒక్కో ఎలుక పట్టినందుకు రూ.40 చొప్పున) ఎకరాకు(రూ.1200 నుంచి 1500 వరకు), కోత, నూర్పిడి మిషన్‌ లేదా కూలీలతో(రూ.3,500), పెట్టుబడికి వడ్డీ, సొంతంగా చేసే పనికి కూలి లెక్కకడితే(రూ.3వేలు) ఇలా ఎకరాకు రూ.25వేలుపైనే పెట్టుబడి అవుతుంది. ఇక కౌలు కూడా కలిపితే అది రూ.40వేలు దాటుతుంది.

కౌలు పరిస్థితి మరీ దారుణం...

గతంలో ఎకరాకు 14 నుంచి 16 బస్తాలు కౌలు ఉండేది. గతేడాది అది 12 బస్తాలకు దిగజారింది. ఈ ఏడాది ముందస్తుగా కౌలు తేల్చుకుని సాగు చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. దిగుబడులు సక్రమంగా లేకపోవటం, సాగునీరు ఎప్పటివరకు అందిస్తారనేది స్పష్టత లేకపోవటం, డిసెంబరు మాసాంతం వరకు మాత్రమే గ్యారెంటీ. ఆ తర్వాత పరిస్థితి తాము చెప్పలేమని చెప్తున్న నీటిపారుదలశాఖ అధికారుల మాటలు. తదితరాలతో కొన్ని పొలాలు కౌలుకు కూడా తీసుకునేవారు లేక సొంతంగా చేయలేక బీడుగా వదిలేస్తున్నారు.

పాలకులు, అధికారులు ఏం చేయాలి...

గతేడాది పండించిన పంటను కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేకపోయారు. అసైన్డ్‌, పోరంబోకు భూముల్లో సాగుచేసిన పంటకు సంబంధించి కొందరు, ఈక్రాప్‌ నమోదు చేసుకోక కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించు కోలేకపోయారు. ఇదిలా ఉంటే విక్రయించిన వారికి నెలల తరబడి కూడా డబ్బు చెల్లింపులు జరగలేదు. వెరసి మాగాణి సాగుపై కొంత విముఖత ఏర్పటంతో నెలకొన్న పరిస్థితులను పాలకులు, అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి.

 


వరి సాగు చేయాలంటేనే భయంగా ఉంది 


వరి సాగు భారంగా మారింది. ఓ పక్క కొండెక్కిన ధరలు, మరోపక్క పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, పండించిన పంటను నిల్వ చేసుకుందామన్నా గోడౌన్లు అందుబాటులో లేని పరిస్థితి. గతంలో ప్రైవేట్‌ వ్యాపారులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తేవటంతో కొనే నాఽథుడే కరువయ్యారు. ప్రభుత్వం ద్వారా కొన్నా సకాలంలో నగదు కూడా అందే పరిస్థితి లేదు.

- కూరాకుల మోషే, చెరుకూరు, పర్చూరు మండలం


వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు


ఎరువుల ధరలు, కూలీల రేట్లు, ఇతర ఖర్చులు పెరగడంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి పంటను సాగు చేయటం వలన దిగుబడి తక్కువగా ఉండి నష్టపోతున్నాం. ప్రభుత్వమే ధ్యానం కొనుగోలు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా వారి బ్యాంకు ఖాతాలలో వెంటనే డబ్బులు జమ అయ్యేలా చూడాలి. 

- అనంత శ్రీనివాసరావు, రైతు, కడవకుదురు



Updated Date - 2021-10-29T05:51:07+05:30 IST