అధ్వానంగా కేసీ పంట కాలువలు

ABN , First Publish Date - 2021-10-31T05:44:46+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని కేసీ పంట కాలువలు అధ్వానంగా తయారయ్యాయి.

అధ్వానంగా కేసీ పంట కాలువలు
ముళ్లకంపలతో నిండిపోయిన కేసీ పంట కాలువను చూపుతున్న రైతు

  1. చివరి ఆయకట్టుకు అందని సాగు నీరు 
  2. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, అక్టోబరు 30: చాగలమర్రి గ్రామంలోని కేసీ పంట కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. కేసీ ప్రధాన కాలువ నుంచి చివరి ఆయకట్టుకు నీరందించే పంట కాలువలు దెబ్బతిన్నాయి. నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల్లో ముళ్ల కంపలు, పూడిక పెరిగి నీరు ప్రవహించడం లేదు. చివరి ఆయకట్టు రైతులకు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది నామమాత్రంగా లక్షలు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉండగా 300 ఎకరాలు కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువలు ఇలాగైతే సాగునీరు పారేదెలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా నీరు సక్రమంగా అందక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నీరందక పోవడంతో ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అధికారులు స్పందించి పంట కాలువ మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 


నీరందడం లేదు

ముళ్ల కంపలు, పూడిక వల్ల కేసీ పంట కాలువల్లో నీరు ప్రవహించడం లేదు. చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. మరమ్మతులు చేపట్టి నీరందేలా చూడాలి.

- మాబాషా, రైతు, చాగలమర్రి 


ప్రతిపాదనలు పంపించాం

కేసీ పంట కాలువలు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాం. రూ.15 లక్షలతో అంచనా వేశాం. వేసవి కాలంలో మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందిస్తాం. 

- మురళీకృష్ణ, ఏఈ, కేసీకెనాల్‌



Updated Date - 2021-10-31T05:44:46+05:30 IST