నాసిరకంగా ఎనహెచ-67 పనులు

ABN , First Publish Date - 2021-12-02T06:32:04+05:30 IST

అది జాతీయ రహదారి. నల్లరేగడి నేలల్లో భద్రంగా ఉండాలని ఫోర్‌లేన సిమెంటు రోడ్డునే వేస్తున్నారు.

నాసిరకంగా ఎనహెచ-67 పనులు
జాయింటు వద్ద విడిపోయిన జాతీయ రహదారి

అధ్వానం..

ప్రారంభంకాకనే పగుళ్లిచ్చిన ఫోర్‌లేన రోడ్డు

పట్టించుకోనిపర్యవేక్షణాధికారులు

నెర్రెలిచ్చి ప్రమాదకరంగా మారిన హైవే

నిర్మాణ జాగుతో ప్రతి సంవత్సరంసమస్యే


అది జాతీయ రహదారి. నల్లరేగడి నేలల్లో భద్రంగా ఉండాలని ఫోర్‌లేన సిమెంటు రోడ్డునే వేస్తున్నారు. పనులు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నాయి. ఇంకా.. రోడ్డు పనులు పూర్తయి, ప్రారంభించకనే.. ఎక్కడికక్కడ నెర్రెలిస్తోంది. రోడ్డు పగుళ్లు వస్తూ.. ధ్వంసమౌతోంది. ప్రమాదకరంగా మారుతోంది. వాటిని చూసి వాహనదారులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మాణంలో నాసిరకంపై అవాక్కవుతున్నారు. రోడ్డు ప్రారంభమయ్యే దాకానైనా.. నిలుస్తుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


గుంతకల్లు, డిసెంబరు 1: నెల్లూరు-అంకోలా మధ్య నిర్మితమౌతున్న 67వ జాతీయ రహదారి పనుల్లో నాణ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నాలుగు వరుసల రోడ్డు ప్రారంభం కాకమునుపే పగుళ్లిచ్చి క్వాలిటీ డొల్లతనాన్ని చాటుతోంది. జిల్లాలో గుంతకల్లు-డోనేకల్లు మధ్య ఈ రహదారి పనులు ఓవైపు సాగుతుండగానే, పూర్తయిన చోట్ల రోడ్డు నెర్రులిచ్చి నిర్మాణంలో జరుగుతున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నాలుగేళ్లునా నత్తనడకన సాగుతున్న ఈ రహదారి పనులు ఎంత వేగంగా చేపట్టినా పూర్తికావడానికి ఇంకా సంవత్సరమైనా పట్టేలా ఉంది. పనులు పూర్తి కాకమునుపే ఈ సిమెంటు రోడ్డు పలుచోట్ల చీలిపోయింది. ఓవైపు నిర్మాణ పనులు చేస్తూనే ఇంకోవైపు మరమ్మతులు చేయాల్సిన దుర్గతి ఈ రహదారికి పట్టింది. ఆర్‌అండ్‌బీ జేఈఈ, డీఈఈల పర్యవేక్షణాలోపం కారణంగా పాతికేళ్లు పదిలంగా నిలవాల్సిన ఈ సీసీ రహదారి పట్టుమని పది రోజులు నిలిచే పరిస్థితులు లేకుండాపోయాయి. కనీసం ప్రారంభం వరకైనా రహదారి మరింత ధ్వంసం కాకుండా ఉంటుందా? అనేది సందేహాస్పదంగా మారింది. ‘ప్రగతికీ నయీ గతి’ అనే కార్యక్రమం కింద ఎన్డీయే-2014 ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి (ఫాస్ట్‌ ట్రాకింగ్‌ నేషనల్‌ హైవే డెవల్‌పమెంట్‌ ఇన ఏపీ) కార్యక్రమాన్ని చేపట్టంది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జాతీయ రహదారుల నిర్మాణ భారీ ప్రాజెక్టులు ప్రారంభించారు. జిల్లాలో ఐదు హైవే పనులను చేపట్టగా నెల్లూరు-అంకోలా 67 జాతీయ రహదారి పనులు 2016లో ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో 374 కి.మీ., ఏపీలో 395.89 కి.మీ. నాలుగు వరుసల రోడ్డు పనులను చేపట్టి పూర్తిచేయాల్సి ఉంది. ఇందులో భాగంగా బళ్లారి మార్గంలో ఏపీ సరిహద్దు అయిన డొనేకల్లు నుంచి గుత్తి వరకూ రూ.669 కోట్లతో ఎస్‌ఆర్‌కే కనస్ట్రక్షన్స అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డాట్‌ (డీఓటీ) కంపెనీల జాయింట్‌ వెంచర్‌లో 57 కి.మీ. ఫోర్‌వే నిర్మాణ పనులను చేపట్టారు. థర్డ్‌ పార్టీల ద్వారా పనులు జరగ్గా వారికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యమవడంతో రహదారి నిర్మాణ కార్యక్రమం నత్తనడకన సాగింది. పనులు ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయి ఐదో సంవత్సరం నడుస్తోంది. ఆగిపోయిన పనులు గత సంవత్సరాంతంలో పునఃప్రారంభమయ్యాయి.


నత్తనడకన నిర్మాణం

గడేకల్లు, డొనేకల్లు, నక్కనదొడ్డి, రజాపురం, ఎన తిమ్మాపురం గ్రామాల వద్ద రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. పనులు పునః ప్రారంభమైనా అత్యంత నిదానంగా సాగుతున్నాయి. గుంతకల్లు సమీపంలో కొనకొండ్ల వద్ద రైల్వే లైను కింద నిర్మించాల్సిన ఆర్‌యూబీ పనులు ముందుకు సాగడంలేదు. కొనకొండ్ల గ్రామం వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై నుంచి వెళ్లాల్సిన ఫ్లైఓవర్‌ నిర్మాణం కూడా పలుమార్లు ప్రారంభమై నిలిచిపోయింది. కొన్నిచోట్ల సింగిల్‌వే పనులు పూర్తయి, రెండోవైపు పనులు ముందుకు సాగడంలేదు. గడేకల్లు గ్రామం వద్ద హైవే, గ్రామానికి అవసరమైన సమాంతర రహదారి పనులు అత్యంత నిదానంగా జరుగుతున్నాయి. ఈ రహదారిపై డొనేకల్లు వద్ద వంకపై వంతెనను నిర్మించడంలో తాత్సారం కారణంగా ఏటా వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోది. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు ఈ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహించడంతో రెండు రోజులపాటు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరుకు రవాణా స్తంభించింది. గుంతకల్లుకు రావడానికి విడపనకల్లు-ఉరవకొండ-వజ్రకరూరు మార్గంలో చుట్టూ తిరిగి ప్రయాణించారు.


నెర్రెలిచ్చిన రహదారి

గుత్తి-డొనేకల్లు మధ్య ఎనహెచ-67 పనులు కొనసాగుతున్నాయి. ఇందులో గుంతకల్లు-గడేకల్లు రహదారి నాణ్యతారాహిత్యం కారణంగా ఎన్నోచోట్ల రోడ్డు నెర్రెలిచ్చి ధ్వంసమవుతోంది. కొన్నిచోట్ల రహదారి మధ్యలో నిలువుగా చీలిపోయింది. మరికొన్ని చోట్ల రోడ్డు అతుకులు ఉన్న చోట్ల విడిపోయి ప్రమాదకరంగా మారుతోంది. రహదారిలో చీలికలను అరికట్టడానికి వేసిన అతుకులను దాటి ఈ రహదారి మీటర్ల దూరం చీలిపోయి నిర్మాణ లోపాలను చాటుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తికాకనే రోడ్డు ధ్వంసం అవుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంత వేగంగా చేసినా.. పనులు పూర్తికావడానికి ఇంకా సంవత్సరం పట్టేట్టు ఉంది. ఈ రోడ్డు ప్రారంభించేలోపే మరమ్మతులు చేపట్టాల్సిన దుస్థితికి చేరుకుంది. గుంతకల్లు-పెంచలపాడు మధ్య పలుచోట్ల ఈ చీలికలు కనిపిస్తున్నాయి. రోడ్డు జాయింట్లు వేరైపోయి చీలికల్లో సైకిల్‌ చక్రం దూరేంత స్థాయిలో సందులు ఏర్పడ్డాయి. ఈ పరిణామం ప్రమాదాలకు దారితీసేలా ఉందని పెంచలపాడు, గుంతకల్లు, గడేకల్లు, చాబాల తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



మొద్దు నిద్రలో ఇంజనీరింగ్‌ అధికారులు

సాధారణంగా హైవేలను తారుతో నిర్మిస్తారు. కర్ణాటకలో అధిక భాగం నల్లరేగడి నేలలు ఉండటంతో ఎనహెచ-67ను సిమెంటు రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు పనులు చేపట్టారు. గుంతకల్లు శివారు నుంచి వెళ్లే ఈ బైపాస్‌ హైవే పనుల్లో బెడ్డింగ్‌ లేయర్లు సక్రమంగా వేయకపోవడంతో దిగువ నుంచి చీలికలు పైకిపాకి సిమెంటు రహదారిని ధ్వంసమయ్యేలా చేశాయి. రోడ్డు బెడ్డింగ్‌ కాంప్యాక్షన పనులు సక్రమంగా చేయకపోవడం, సిమెంటు కాంక్రీటు నాసిరకంగా వాడటం మూలాన ఈ సీసీ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రహదారి పనులను జేఈఈ, ఆ తర్వాత డీఈఈ, ఏఈఈలు పర్యవేక్షించాల్సి ఉంది. వీరు ధ్రువీకరించిన మీదట బిల్లు పెట్టిన కేవలం నెలకే డబ్బు చెల్లింపు జరిగిపోతుంది. తారురోడ్డు వేసిన 15 సంవత్సరాలదాకా నిలుస్తుందనీ, సిమెంటు రహదారి అధమపక్షం పాతికేళ్ల దాకా ఉంటుందని అంచనా. నల్లరేగడి నేలల్లో తారురోడ్డు నిలవదన్న కారణంగా ఈ హైవేను సిమెంటు రహదారిగా నిర్మిస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా కాకుండా ఈ రహదారి అనతికాలంలోనే ధ్వంసమౌతోంది. దెబ్బతిన్న చోట్ల పునర్నిర్మించడమో, చీలికలను పూడ్చడానికి మరమ్మతులో వెంటనే వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది.








Updated Date - 2021-12-02T06:32:04+05:30 IST