యాదాద్రీశుడికి శాస్త్రోక్తంగా పూజలు

ABN , First Publish Date - 2021-05-07T06:07:07+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో గురువారం నిత్యపూజలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి.

యాదాద్రీశుడికి శాస్త్రోక్తంగా పూజలు
స్వామివారి నిత్యకల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, మే 6: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో గురువారం నిత్యపూజలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. ప్రధానాలయం స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసిదళాలతో అర్చించారు. విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. సాయం త్రం బాలాలయంలో అలంకార వెండి జోడు సేవలు సహస్ర నామార్చనలు కొనసాగాయి. చరమూర్తులకు నిత్య పూజలు కొండకింద తులసికాటేజ్‌లో వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతారాధనలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.2,84,153 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

కరోనా కట్టడికి చర్యలు 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా దర్శన క్యూలైన్లను, బాలాలయాన్ని మూడు పూటలా హైప్లోక్లోరైడ్‌ ద్రావణంతో పిచికారీ చేస్తున్నారు. స్వామి దర్శనాలకు వచ్చిన భక్తులకు దర్శన క్యూలైన్ల చెంత హ్యాండ్‌ శానిటైజర్‌తో శానిటైజ్‌ చేస్తున్నారు.

డ్రిప్‌తో ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్ల పరిరక్షణకు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయ ఉత్తర దిశలో కొండచుట్టూ ఆహ్లాదకర వాతావరణం కనిపించేందుకు ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్లు ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో సైతం గార్డెన్లు పచ్చగా కళకళలాడేందుకు వైటీడీఏ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గండి చెరువు నీటితో ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్లకు నీరందిస్తున్నారు. కొండపైన, కొండకు దక్షిణ దిశలోని గార్డెన్లను డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. అదేవిధంగా స్ర్పింక్లర్లు ఏర్పాటు చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ యాదాద్రిని పర్యటించే అవకాశం ఉండడంతో ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్ల పరిరక్షణ, అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులు దృష్టిసారించారు.

Updated Date - 2021-05-07T06:07:07+05:30 IST