
కరోనా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఈ ఏడాదే పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు భాషల్లో చాలా చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందగా.. చాలా వరకు డిజాస్టర్స్‌గా మిగిలాయి. ముఖ్యంగా బాలీవుడ్లో పలు చిత్రాలు విడుదలై ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఉన్నంతలో ఓ మాదిరి కలెక్షన్లు సాధించాయి. అయితే.. కొన్ని చిత్రాలు మరీ దారుణంగా థియేటర్లలో జనాలే లేక వరస్ట్ మూవీస్‌గా నిలిచాయి. కాగా.. బాలీవుడ్లో ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన చెత్త సినిమాల లిస్ట్ ఇదీ..
గెహ్రైయాన్ (Gehraiyaan)
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన ‘గెహ్రైయాన్’ బాలీవుడ్‌లోని చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విచిత్రమైన బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఫ్లాట్ ప్రేక్షకులని ఎంతో నిరాశ పరిచింది. దీంతో ఈ చిత్రాన్ని ఆడియన్స్ తిరస్కరించి ఫ్లాప్‌గా తేల్చారు. కలెక్షన్లు సైతం చాలా ఘోరంగా వచ్చాయి.
ధాకడ్ (Dhaakad)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా వచ్చిన ‘తలైవి’తో సూపర్ హిట్ కొట్టిన నటి కంగనా రనౌత్. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియా స్థాయిలో కంగనకి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆ బ్యూటీ చేసిన చిత్రం ‘ధాకడ్’. కంగన ఏజెంట్ అగ్నిగా నటించిన ఈ యాక్షన్ మూవీ ట్రైలర్ చూసి అందరూ ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఈ భామకి మరో హిట్ వస్తుందని ఊహించారు. అయితే విడుదల తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. చెత్త కథ, పేలవమైన దర్శకత్వం ఈ సినిమాని ముంచేశాయి. కంగన నటన సైతం ఈ మూవీని రక్షించలేకపోయింది. అలాగే.. కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 2తో క్లాష్ ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది.
నికమ్మ (Nikamma)
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించిన చిత్రం ‘నికమ్మ’. ఇందులో ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ వంటి మంచి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన అభిమన్యు దాసని ముఖ్యపాత్రలో నటించాడు. ట్రైలర్ విడుదల నుంచే ఈ మూవీపై ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపలేదు. విడుదలైన తర్వాత సైతం అనుకున్నట్లుగానే డిజాస్టర్‌గా మిగిలింది.