రుద్రవరం మండలంలోని బి.నాగిరెడ్డిపల్లె- పడకండ్ల రహదారి దుస్థితి
అవస్థల్లో ప్రయాణికులు
వర్షాకాలం మరిన్ని ఇబ్బందులు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
పాలకులు అభివృద్ధి గురించి మాట్లాడని రోజు ఉండదు. ఇందులో వైసీపీ ప్రభుత్వం నాలుగు ఆకులు ఎక్కువ. రాష్ర్టాన్ని స్వర్గతుల్యం చేస్తున్నామని జగన్ పార్టీ చెప్పుకుంటోంది. కానీ రోడ్లు కనీసంగా బాగలేవు. జిల్లాలోని పట్టణాల్లో, గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. వైసీపీ ప్రజా ప్రతినిధులు నిత్యం ఈ దారుల మీదే తిరుగుతుంటారు. కానీ వాటిని బాగు చేయిద్దామని అనుకోవడం లేదు. టెండర్లను పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పని చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వదని కాంట్రాక్టర్లు అనుమానిస్తున్నారు. వెరసి జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.
నంద్యాల, అంధ్రజ్యోతి: జిల్లాలో రాష్ట్ర ప్రధాన రహదారుల 627 కి.మీ ఉండగా, జిల్లా ప్రధాన రహదారులు 1,248 కి.మీ ఉన్నాయి. నిర్వహణ సరిగా లేక, వాహనాల రాకపోకల వల్ల చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు ఆర్ అండ్‌బీ గతంలో పలుమార్లు టెండర్లు పిలిచింది. ఇతర పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రోడ్డు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చాలా రోజులు రోడ్ల మరమ్మతు పనులు మొదలు కాలేదు. కొన్ని బ్యాంకుల నుంచి నేరుగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. జూన్ చివరిలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పనులు మొదలు పెట్టి ఆరు నుంచి తొమ్మిది నెలలు కావొస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే వర్షాకాలం మొదలు కావడంతో మిగిలిన పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని సంబంధిత అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన ఈ రోడ్లపైన ఇలాగే మరికొన్ని రోజులు ప్రయాణించాలా? అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సగానికి పైగా పెండింగ్..
జిల్లాలోని 17 రాష్ట్ర ప్రధాన రహదారుల పనులు, 34 జిల్లా మేజర్ రోడ్ల పనులను ఆర్అండ్బీ శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించింది. జిల్లా మొత్తం మీద ఉన్న రాష్ట్ర రహదారులకు సంబంధించి 97.15 కిమీ మేర పనులు చేసేందుకు రూ.49.97 కోట్లను కేటాయించింది. అలాగే 227.91 మేజర్ రోడ్ల మరమ్మతుల కోసం రూ.49.98 కోట్లు కేటాయించింది. వీటిలో రాష్ట్ర ప్రధాన రహదావరుల పనులు 10 పూర్తి కాగా, 3 పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 4 పనులు అసలు ఇంకా మొదలే కాలేదు. ముఖ్యంగా పాణ్యం నుంచి బనగానపల్లె రోడ్డు, వెలుగోడు, గడివేముల వంటి చోట్ల చేపట్టాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మేజర్ రోడ్లకు సంబంధించి 34 పనులకు గాను 19 పూర్తి కాగా, 3 పనులు పురోగతిలో ఉన్నాయి. దాదాపు 12 పనులు ఇంకా మొదలే కాలేదు. ప్రధానంగా ఆత్మకూరు-ముష్టిపల్లి స్పెషల్ రిపేరు పనులు, ఆత్మకూరు నుంచి వడ్లరామాపురం స్పెషల్ రిపేరు పనులు, అవుకు-తాడిపత్రి స్పెషల్ రిపేరు పనులు, దొర్నిపాడు-యాలూరు స్పెషల్ రిపేరు పనుల వంటివి ఇంకా చేపట్టలేదు. ఇలా జిల్లాలో రోడ్ల మరమ్మతుల పనులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. మొదలైన పనులు పూర్తయ్యేదెన్నడో, కొన్ని పనులు మొదలయ్యేదెన్నడో, గతుకుల రోడ్ల నుంచి ఉపశమనం లభించేదెన్నడో! అంటూ ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వర్కు చార్జుడు ఉద్యోగులు లేక..
ఆర్అండ్బీ శాఖలో వర్కు చార్జుడు ఉద్యోగులు ఉండేవారు. వారితో పాటు ఎన్ఎంఆర్, కాంట్రాక్టు పద్ధతిలో మరికొంత మంది సిబ్బందిని నియమించేవారు. ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే ఈ ఉద్యోగులు ఎప్పటికప్పుడు సరిచేసేవారు. దీంతో చిన్న గుంతలు పెద్దగా మారకుండా ఉండేవి. ప్రస్తుతం వర్కు చార్జుడు ఉద్యోగుల వ్యవస్థ లేకపోవడం, కొత్త ఉద్యోగుల నియామకం చేపట్టడం లేదు. దీంతో రోడ్ల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదు. ఒకసారి రోడ్డు వేశాక మళ్లీ ఆ రోడ్డు పునఃనిర్మాణం జరిగే వరకు పాడైపోయిన రోడ్లను పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా భారీగా గోతుల పడి, ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే అప్పుడు రోడ్లను సరిచేసేందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారు. వారు చేసే పనిలో నాణ్యత లేకపోవడంతో వేసిన కొన్నాళ్లకే మళ్లీ గుంతలు పడుతున్నాయి. దీంత సమస్య మళ్లీ మొదటికి వస్తోంది.
పల్లె దారులను పట్టించుకోవడం లేదు
ఆళ్లగడ్డ, జూన్ 19: పల్లెల గురించి మన పాలకులు పెద్ద పెద్ద సందేశాలు ఇస్తారు. కానీ గ్రామీణ రహదారుల పట్ల కనీసమైన పట్టింపు ఉండదు. గ్రామాలకు కల్పించే సౌకర్యాల్లో రోడ్లు ప్రధానం. వాటినే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన రహదారులు ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రధానంగా గ్రామాల మధ్య రహదారులు సరిగా లేకపోవడంతో రైతులు పొలాలకు ఎరువులు చేర్చాలన్నా, పొలాల నుంచి పంట దిగుబడులను ఊళ్లోకి తీసుకరావాలన్నా ఇబ్బందిగా ఉంది.
మండలంలో ఇలా..
ఆళ్లగడ్డ మండలంలో కోటకందుకూరు- చింతకొమ్మదిన్నె, పేరాయిపల్లె-కొండాపురం, యాదవాడ-మర్రిపల్లె, జి.జంబులదిన్నె- బాచ్చాపురం, చిన్నకందుకూరు- చింతకొమ్మదిన్నె గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఈ రహదారులు నేటికి మట్టి రోడ్లకే పరిమితమయ్యాయి. మండలంలోని గ్రామాల మద్య అనుసంధాన రహదారులు మొత్తం 10 కిమీ వరకు మట్టిరోడ్లు ఉన్నాయి. ఈ రహదారుల అభివృద్ధికి గంపెడు మట్టి పోయలేదు. ఈ రహదారుల మీద వర్షా కాలంలో నడవడం కష్టం. మిగతా కాలాల్లో గులకరాళ్లు తేలి వాహన చోదకులు ఇబ్బందిపడుతున్నారు.
రుద్రవరం మండలంలో. .
మండలంలోని బి.నాగిరెడ్డిపల్లె- పడకండ్ల గ్రామాల మద్య రహదారి పూర్తి అధ్వాన స్థితిలో ఉంది. ఈ రహదారిని 16 ఏళ్లకిందట నిర్మించారు. ఇంత వరకు అభివృద్ధికి నోచుకోలేదు. మండలంలోని అనుసంధాన రహదారులన్నీ ఇలాగే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే పాలకులకు లేనట్లుంది.
ఉయ్యాలవాడ మండలంలో...
మండంలోని ఆర్.పాపంపల్లె- రామచంద్రాపురం రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రహదారిలో రైతులకు వందల ఎకరాలున్నాయి. వీటికి ఎరువులు తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
దొర్నిపాడు మండలంలో. . .
మండలంలోని చాకరాజువేముల- డబ్ల్యు.కొత్తపల్లె రహదారి గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొండాపురం- అమ్మిరెడ్డినగర్ మట్టి రోడ్డు మీద రాకపోకలు కష్టంగా ఉంది.
చాగలమర్రి మండలంలో. . .
మండలంలోని గ్రామీణ గ్రామాలు అధ్వానంగా మారాయి. కురిసిన కొద్దిపాటి వర్షానికే రహదారులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. చాగలమర్రి నుంచి మహదేవపురం వరకు పనులు పూర్తి కాకపోవడంతో శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు గ్రామాల మద్య రహదారి దెబ్బతిని గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఈ రహదారుల నిర్మాణానికి రూ.32కోట్లు మంజూరైనా పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గోడిగనూరు- డి.వనిపెంట, వనిపెంట-ముత్యాలపాడు, చాగలమర్రి- మల్లెవేముల, గోడిగనూరు-కొత్తపల్లె, నేలంపాడు- గొట్లూరు గ్రామాల మధ్య రహదారులు అధ్వానంగా మారాయి.
శిరివెళ్ల మండలంలో...
మండలంలోని ఎర్రగుంట్ల-వెంకటేశ్వరపురం గ్రామాల మధ్య రహదారి కంకర తేలి అధ్వానంగా ఉంది. ఈ రహదారిపై ప్రజలు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు.
డోన్-కంబాలపాడు గుంతల రోడ్డు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. డోన్-కంబలపాడు రహదారి. ఈ ఆర్అండ్బీ రహదారి గుంతలమయం అయింది. దాదాపు డోన్ నుంచి వెంకటాపురం వరకు రహదారి పూర్తి అధ్వానంగా ఉంది. ఆర్ అండ్ బీ అధికారులు కనీస మరమ్మతులు కూడా చేయడం లేదు.