మానని గాయం..

ABN , First Publish Date - 2021-01-09T06:08:43+05:30 IST

కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై యర్రగుంట్ల విమల పాఠశాల వద్ద గత నెల 15వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది.

మానని గాయం..
కర్నూలులో చికిత్స పొందుతున్న చిన్నారి మైథిలి

  1. మెరుగవ్వని మైథిలి ఆరోగ్యం
  2. స్పందనకు మానసిక సమస్యలు
  3. మంచానికి పరిమితమైన మద్దిలేటమ్మ
  4. విషాదం నింపిన యర్రగుంట్ల ప్రమాదం


శిరివెళ్ల, జనవరి 8: కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై యర్రగుంట్ల విమల పాఠశాల వద్ద గత నెల 15వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. క్రిస్మస్‌ క్యారెల్స్‌ ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తున్న బృందంపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరు కోలుకున్నారు. మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. తలకు దెబ్బలు, కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలతో భరించలేని బాధను అనుభవిస్తున్నారు. రోజంతా శ్రమిస్తేగానీ నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే కష్టజీవులు మంచానికే పరిమితమై దీనంగా కాలం గడుపుతున్నారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్షతగాత్రులకు ప్రభుత్వం రూ.50 వేల ప్రకారం ఆర్థిక సాయం అందించింది. కానీ చికిత్సకు అదనంగా ఖర్చు అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా కోలుకునేంత వరకు ఆపన్నహస్తం అందించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


పాపం.. పసివారు

ముద్దుముద్దు మాటలు, సరదా ఆటలతో గడపాల్సిన ఓ పసి ప్రాయం ఆసుపత్రిలో కదలలేని స్థితిలో ఉంది. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన మరో చిన్నారి జీవచ్ఛవంలా మారింది. యర్రగుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన సైగాళ్ల బాలుగ్రం, గోవిందమ్మ దంపతుల కుమారుడు వంశీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కూతురు మైథిలి ఇంకా కర్నూలులో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాల నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎడమ కాలు తొడ భాగం నుంచి కింది వరకు తెగడంతో కోలుకునేందుకు చాలా రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఖర్చు చేశామని, ఇంకా ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో, ఎంత బిల్లు చెల్లించాలోనని మైథిలి తండ్రి బాలుగ్రం కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదే కాలనీకి చెందిన దేవ కుమార్‌, చెన్నమ్మ దంపతుల కూతురు స్పందన తలకు తీవ్ర గాయమైంది. తలకు రెండు వైపులా చాలా కుట్లు వేశారు. దీంతో చిన్నారి స్పందన మునుపటిలా కాకుండా మందబుద్ధిలాగా వ్యవహరిస్తోందని ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు.


ప్రమాదం శాపమై..

మేఘల లింగమయ్య, మద్దిలేటమ్మ యర్రగుంట్ల గ్రామ పంచాయతీలో ఒప్పంద ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మద్దిలేటమ్మ తీవ్రంగా గాయపడింది. ఎడమ కాలు, కుడి చేయి విరిగిపోయాయి. దీంతో వైద్యులు రాడ్లను అమర్చారు. భర్త లింగమయ్య ఆమెను కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. దీంతో వారి కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఇదే ప్రమాదంలో సుంకేసుల చెన్నమ్మకు కుడి కాలు విరిగింది. నోరు, దవడ భాగం దెబ్బతినింది. కుటుంబపోషణ కోసం సౌదీ అరేబియా వెళ్లి, లాక్‌డౌన్‌ కారణంగా నెల  రోజుల క్రితం తిరిగి వచ్చింది. ఇంతలోనే ప్రమాదానికి గురై మంచానికే పరిమితమమైంది. వీరి కుటుంబం గడవటం కష్టంగా మారింది. చెన్నమ్మ తన కుమారుడితో కలిసి యర్రగుంట్లలోని తల్లి వద్ద కాలం వెళ్లదీస్తోంది. 




Updated Date - 2021-01-09T06:08:43+05:30 IST