వావ్‌...వెజ్‌ కబాబ్స్‌!

ABN , First Publish Date - 2021-02-20T06:04:14+05:30 IST

కబాబ్స్‌ అనగానే నాన్‌వెజ్‌ ఘుమఘుమలు గుర్తొస్తాయి. కానీ వెజ్‌ కబాబ్‌లను ఒకసారి తింటే వాటి రుచికి ఫిదా అవకుండా ఉండలేరు. గ్రీన్‌పీస్‌ కబాబ్‌, దహీ కబాబ్‌, సాబుదానా కబాబ్‌, పనీర్‌ కబాబ్‌... ఆ కోవకు చెందినవే. ఈసారి వెజ్‌ కబాబ్స్‌తో రుచుల

వావ్‌...వెజ్‌ కబాబ్స్‌!

కబాబ్స్‌ అనగానే నాన్‌వెజ్‌ ఘుమఘుమలు గుర్తొస్తాయి. కానీ వెజ్‌ కబాబ్‌లను ఒకసారి తింటే వాటి రుచికి ఫిదా అవకుండా ఉండలేరు.  గ్రీన్‌పీస్‌ కబాబ్‌, దహీ కబాబ్‌, సాబుదానా కబాబ్‌, పనీర్‌ కబాబ్‌... ఆ కోవకు చెందినవే. ఈసారి వెజ్‌ కబాబ్స్‌తో రుచుల వేడుక చేసుకోండి మరి.


పనీర్‌ అనరద్న కబాబ్‌


కావలసినవి

పనీర్‌ - 500గ్రాములు, క్యాప్సికం - రెండు, టొమాటో - రెండు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, హంగ్‌ యోగర్ట్‌ - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, గరంమసాలా - అర టీస్పూన్‌, అనరద్న పౌడర్‌ - రెండు టీస్పూన్లు, క్రీమ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

  • పనీర్‌ను అంగుళం ఉండేలా క్యూబ్స్‌గా కట్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో హంగ్‌ యోగర్ట్‌, అల్లం వెల్లుల్లి పేస్టు, కశ్మీరీ కారం, పసుపు, అనరద్న పొడి, గరంమసాలా, క్రీమ్‌, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి పావుగంట పాటు పక్కన పెట్టాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి పనీర్‌ క్యూబ్స్‌ గోధుమ రంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి.
  • తరువాత అదే పాన్‌లో క్యాప్సికం, టొమాటో ముక్కలను వేగించుకోవాలి. 
  • చువ్వలకు పనీర్‌ ముక్కలు, మధ్యలో క్యాప్పికం, టొమాటో ముక్కలు గుచ్చాలి. 
  • ఈ కబాబ్స్‌ను చాట్‌ మసాలా చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.

భేన్‌ కి కబాబ్‌ 


కావలసినవి

తామర కాడలు - రెండు పెద్దవి, సెనగపప్పు - ఒక కప్పు, యాలకులు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయలు - కొద్దిగా (గార్నిష్‌ కోసం)


తయారీ విధానం

  • ఒక పాత్రలో తామర కాడలు, సెనగపప్పు, యాలకులు, అల్లం, వెల్లులి రెబ్బలు వేసి, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. 
  • మిశ్రమం బాగా ఉడికిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి.
  • తరువాత అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి వడల మాదిరిగా ఒత్తుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్స్‌ వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
  • ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసి, గ్రీన్‌ చట్నీతో వడ్డించాలి.

సాబుదానా కబాబ్‌


కావలసినవి

బంగాళదుంపలు - నాలుగు, సాబుదానా - ఒక కప్పు, పల్లీల పొడి - ఐదు టేబుల్‌స్పూన్లు, పెరుగు - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - నాలుగైదు, ఉప్పు - తగినంత, నెయ్యి - సరిపడా, కొత్తిమీర - కొద్దిగా, రాజ్గిరా పిండి - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  • సాబుదానా నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి, మెత్తటి గుజ్జుగా చేసుకోవాలి. పల్లీలను వేగించి పొడి చేసుకోవాలి.
  • ఒక పాత్రలో ఉడికించిన బంగాళదుంపలు, నానబెట్టిన సాబుదాన వేసి కలపాలి. తరువాత అందులో పల్లీల పొడి, పెరుగు, దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర, రాజ్గిరా పిండి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని చువ్వలకు గుచ్చి గ్రిల్‌పై కాల్చాలి. కొద్దికొద్దిగా నెయ్యి అద్దుకుంటూ గోధుమ రంగులోకి మారే వరకు కాల్చాలి. చట్నీతో తింటే సాబుదానా కబాబ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి.

గ్రీన్‌ పీస్‌ కబాబ్‌


కావలసినవి

పచ్చి బఠాణీ - ఒక కప్పు, ఉల్లిపాయలు - పావు కప్పు(తరిగినవి), పచ్చిమిర్చి - ఐదు, వెల్లుల్లి రెబ్బలు -రెండు, అల్లం ముక్క - కొద్దిగా, జీడిపప్పు - ఐదారు పలుకులు(పొడి చేసుకోవాలి), కొత్తిమీర - ఒక కట్ట, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు, సెనగపిండి - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, కార్న్‌ఫ్లేక్స్‌ - పావుకప్పు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

  • పచ్చిబఠాణీని శుభ్రంగా కడిగి నీళ్లను వంపేయాలి. 
  • ఒక పాత్రలో జీడిపప్పు పొడి తీసుకోవాలి.
  • పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. 
  • ఇప్పుడు పచ్చిబఠాణీ మిక్సీలో వేసి పట్టుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి కలపాలి.
  • తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, బియ్యప్పిండి, సెనగపిండి, నిమ్మరసం, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి.
  • మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా ఒత్తుకోవాలి. 
  • తరువాత వీటిని కార్న్‌ఫ్లేక్స్‌ పొడిలో అద్దుకుంటూ నూనెలో వేగించాలి. 

దహీ కబాబ్‌


కావలిసినవి

హంగ్‌ యోగర్ట్‌ - ఒకటిన్నర కప్పు, సెనగపిండి - పావు కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌(జీలకర్ర వేగించి పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా.


తయారీ విధానం

  • ఒక పాత్రలో నూనె కాకుండా మిగతా పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్‌లో ఒక గంటపాటు పెట్టాలి.
  • తరువాత మిశ్రమాన్ని చేతిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ టిక్కీల మాదిరిగా ఒత్తుకుంటూ పాన్‌పై వేగించాలి.
  • నూనె వేసుకుంటూ గోధుమరంగులోకి మారే వరకు రెండు వైపులా వేగించాలి.
  • గ్రీన్‌ చట్నీతో వేడి వేడిగా దహీ కబాబ్స్‌ను అందించాలి.

Read more