బెంగళూరు నాగరత్నమ్మ ఈ తరానికీ నచ్చే సినిమా

ABN , First Publish Date - 2021-02-28T08:43:02+05:30 IST

‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’, ‘మహానటి’ వంటి బయోపిక్స్‌కు రచన చేసిన బుర్రా సాయిమాధవ్‌ మరో బయోపిక్‌కు రచన చేస్తున్నారు. ఆ సినిమా గురించి, తన ఇతర సినిమాల గురించి ‘నవ్య’తో ముచ్చటించారు.

బెంగళూరు నాగరత్నమ్మ ఈ తరానికీ నచ్చే సినిమా

‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’, ‘మహానటి’ వంటి బయోపిక్స్‌కు రచన చేసిన 

బుర్రా సాయిమాధవ్‌ మరో బయోపిక్‌కు రచన చేస్తున్నారు. ఆ  సినిమా గురించి, 

తన ఇతర సినిమాల గురించి ‘నవ్య’తో ముచ్చటించారు.


మరో బయోపిక్‌కు రచన చేస్తున్నట్లున్నారు..

అవునండి. బెంగుళూరు నాగరత్నమ్మగారి జీవితకథను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీవారు సినిమాగా తీస్తున్నారు. ఈ తరం వారికి ఆవిడ గురించి తెలియకపోవచ్చు.  కానీ పాత తరం వాళ్లకు బాగా తెలుసు. ఆవిడ మొదట దేవదాసి.  ఆ తర్వాత త్యాగరాజస్వామి భక్తురాలై.. యోగినిగా మారి.. ఆయనకు గుడి కట్టించింది. పురుష అహంకారంపై ఆ రోజుల్లోనే పోరాటం చేసిన ఽసాహసి. ఈ సినిమా కోసం నాగరత్నమ్మ గురించి చాలా అధ్యయనం చేశా. ఆవిడకు, వేమనకు దగ్గర పోలికలు ఉన్నాయని నాకు అనిపించింది. వేమన కూడా మొదట భోగి. ఆ తర్వాత యోగిగా మారాడు. మన సమాజంలో ఉన్న దురాచారాలను ఎత్తి చూపించాడు. నాగరత్నమ్మ కూడా అంతే!  తను సంపాదించినదంతా త్యాగరాజస్వామి గుడికి ఖర్చు పెట్టేసింది. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఇక్కడ చెప్పాలి. మన దేశంలో తొలి మహిళా ఇన్‌కంటాక్స్‌ పేయర్‌      నాగరత్నమ్మే!  ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ తరం వారికి కూడా ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావుగారు దర్శకుడు కావడం నాకు ఎదురైన  మరో అదృష్టం.


సింగీతంతో ఇంతకుముందు ఓ సినిమా చేశారు కదూ

నేను ‘పుత్తడిబొమ్మ’ సీరియల్‌కు రచన చేస్తున్న తరుణంలోనే సింగీతం శ్రీనివాసరావుగారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్‌ అయింది. అప్పుడు ఆయన పవన్‌కల్యాణ్‌గారితో ఓ సినిమా చేస్తూ మంచి రచయిత ఉంటే చెప్పమని దర్శకుడు క్రిష్‌గారిని అడిగారు. ఆయన నా పేరు చెప్పి, నన్ను పంపించారు. సింగీతం శ్రీనివాసరావుగారిని కలవడం అదే ప్రథమం నాకు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆయన చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. 


బెంగళూరు నాగరత్నమ్మ  పాత్రను ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరు పోషిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?

చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. ఎంతోమందితో మాట్లాడుతున్నారు. అయితే నాకు మాత్రం సమంత ఆ పాత్ర చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. చూడాలి.. ఎవరిని ఆ పాత్ర వరిస్తుందో! హీరోయిన్‌ దొరకగానే ఆ చిత్రం ప్రారంభమవుతుంది. 


ఇద్దరు మాస్‌ హీరోలు కలసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రచన చేస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుంది?

నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. దాని మీద ఎంత భారీ అంచనాలు పెట్టుకున్నా దాన్ని మించి సినిమా ఉంటుంది. ప్రతి సీన్‌ థ్రిల్‌ కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమా ఓ అద్భుతం. అంతే!


వారిద్దరి పాత్రలను బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా ఉంటుందా? 

కథలోనే ఆ బ్యాలెన్స్‌ ఉంది. ఆటోమాటిక్‌గా డైలాగులు కూడా ఆ స్థాయిలోనే . నాకు తెలిసినంతవరకూ ఈ మధ్యకాలంలో వస్తున్న నిజమైన మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. ఒకే స్థాయి కలిగిన ఇద్దరు హీరోలు కలసి పనిచేయడమన్నది ఈ మధ్యకాలంలో లేదు. ఒకప్పుడు నిజమైన మల్టీస్టారర్‌ చిత్రాలు రామారావుగారు-నాగేశ్వరరావు, కృష్ణగారు-శోభన్‌బాబుగారు-కృష్ణంరాజుగార్ల కాంబినేషన్‌లో వచ్చేవి. ఆ తర్వాత కరెక్ట్‌ మల్టీస్టారర్‌ అనేది రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అంతకుమించి ఆ సినిమా గురించి నేను మాట్లాడడం భావ్యం కాదు. అలాగే రాజమౌళిగారితో పనిచేయాలని అందరూ అనుకుంటారు. ఆ లక్ష్యం నెరవేరినప్పుడు అంతకుమించిన ఆనందం ఏముంటుంది! రాజమౌళిగారితో నేను వర్క్‌ చేస్తున్నానని తెలియగానే చాలా మంది ‘ఆయన పిండేస్తాడు’ అని భయపెట్టారు. కానీ ఆయనతో పనిచేయడం హాయిగా ఉంది.  తనకు ఏం కావాలో, ప్రేక్షకులకు తను ఏం చూపించాలనుకుంటున్నాడో ఆయనకు కచ్చితంగా తెలుసు. అలా  నూటికి నూరు శాతం క్లారిటీ ఉన్న దర్శకుడితో ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. 


ఈ మధ్య విడుదల చేసిన ఎన్టీఆర్‌ లుక్‌ వివాదస్పదమైంది. కొమరం భీమ్‌ను ముస్లిం గెట్‌పలో చూపించడం ఏమిటని విమర్శలు వచ్చాయి. దాని గురించి చెప్పండి.

సినిమా చూడకుండా ఆ గెటప్‌ ఎందుకు అలా ఉందన్నది చర్చించడం కరెక్ట్‌ కాదు. సినిమా చూసిన తర్వాత  అందరికీ అర్ధమవుతుంది. ‘కొమరం భీమ్‌ ముస్లిముల మీద ఫైట్‌ చేశాడు. ఆయనకు అటువంటి గెటప్‌ వేయడం ఏమిటి?’ అని చాలా మంది ప్రశ్నించారు. కొమరం భీమ్‌ ముస్లిముల మీద ఫైట్‌ చేయలేదు, రజాకార్ల వ్యవస్థ మీద యుద్ధం చేశాడు. మతం మీద ఆయనకు కోపం ఎందుకు ఉంటుంది? కొమరం భీమ్‌ అంటే అభిమానం ఉన్న వారెవరైనా ఆయనకు మతపిచ్చి అంటకట్టకూడదు. ఆయన మహానుభావుడు. ఓ వ్యవస్థ. అప్పుడు జరిగే అరాచకాల మీద ఫైట్‌ చేశాడు తప్ప మతం మీద కాదు. ఆయనకు ఒక మతాన్ని అంటగట్టి, ఇంకో మతానికి ద్వేషిగా చూడకూడదు. 


గుణశేఖర్‌ ‘శాకుంతలమ్‌’ ఎలా ఉంటుంది?

నాకు దొరికిన మరో అద్భుతమైన అవకాశం అది. చాలా గొప్ప  సినిమా అవుతుంది. ప్రస్తుతం ఆ సినిమా పని మీదే ఉన్నా. గుణశేఖర్‌గారితో ఇంతకుముందు రెండు సినిమాలు మిస్‌ అయ్యా. అందుకే ఆయనతో సినిమా అనగానే మొదట ఎగిరి గంతేసినా, ఆ తర్వాత శకుంతల సినిమా అనగానే నిరుత్సాహం కలిగింది. ఇప్పటి జనరేషన్‌కు నచ్చే కమర్షియల్‌ ఏమి ఉంటాయి అనుకున్నాను. రకరకాల అనుమానాలతో ఆ కథ విన్నాను. కానీ గుణశేఖర్‌గారు కథ చెప్పిన తర్వాత నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. అద్భుతంగా ట్రీట్‌ చేశారు. చాలా గొప్ప స్ర్కీన్‌ప్లే తయారు చేశారు. నాకు తెలిసిన శకుంతలనే కొత్తగా చూపించారు. ఇప్పుడు సీన్లు రాస్తూ చెబుతున్నా...  ప్రతిదీ కొత్తగా ఉంటుంది. శకుంతల కథలో ఎన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయో రేపు ఈ సినిమా చూశాక తెలుస్తుంది. 





గతంలో పోలిస్తే రచయితల పారితోషికాలు ఇప్పుడు సంతృప్తికరంగా ఉన్నాయా?

మిగతా రచయితలు ఎంత తీసుకుంటున్నారో తెలీదు కానీ నా వరకూ సంతృప్తిగానే ఉన్నాను. ఒకప్పడు రచయుతలకు పారితోషికాలు తక్కువగా ఉన్న మాట వాస్తవం. కానీ  పరుచూరి బ్రదర్స్‌ వచ్చిన తర్వాత ఆ సమస్య లేదు. రైటర్‌ను స్టార్‌ చేసింది వాళ్లే! త్రివిక్రమ్‌గారు రచయితను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. ఆ స్థాయిని కాపాడుకుంటే చాలు.


పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి చెప్పండి. అది చారిత్రాత్మకమా?

చరిత్రలో ఉన్న ఒక పాత్రను తీసుకొని, అల్లిన ఓ జానపద కథ. ఆ పాత్ర ఏమిటి, దాని కథ ఏమిటన్నది సినిమా చూశాక అర్ధమవుతుంది. ‘గోపాల గోపాల’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాల తర్వాత పవన్‌కల్యాణ్‌గారితో చేస్తున్న మూడో సినిమా ఇది. రచయితగా ‘గోపాల గోపాల’ నా రెండో సినిమా. షూటింగ్‌లో మానిటర్‌ ముందు కూర్చుని పవన్‌కల్యాణ్‌గారు డైలాగులు ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూసేవాడిని. ఆయన తన మొదట డైలాగ్‌ చెప్పగానే- ఎక్సైట్‌మెంట్‌ ఆపుకోలేక- ‘నేను స్టార్‌ రైటర్‌ అయిపోయా’ అని గట్టిగా అరిచా. ఆ తర్వాత ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాలో ఆయనతో చాలా క్లోజ్‌గా జర్నీ చేశా. ఆ సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే కల్యాణ్‌గారే. 24 శాఖల మీద కమాండింగ్‌ ఉన్న వ్యక్తి ఆయన. కల్యాణ్‌గారి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. 


కథ నచ్చితే  పారితోషికం గురించి ఆలోచించను. బాగా రాసే అవకాశం ఉన్న కథను పారితోషికం కోసం ఏ రచయితా వదిలిపెట్టడు. నేనూ అంతే! ఆ సినిమాకు రాస్తే నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే నేను పారితోషికం గురించి ఆలోచించను.  పారితోషికాన్ని డిమాండ్‌ చేసిన సందర్బాలూ లేవు. నేను పారితోషికం ఎంత తీసుకుంటున్నానో నా నిర్మాతలను అడిగితే తెలుస్తుంది. నాతో పని చేయని వాళ్లు వంద రకాలుగా మాట్లాడుకోవచ్చు. వాళ్లు నాతో చేస్తే అప్పుడు నిజం తెలుస్తుంది.


వినాయకరావు 

ఫొటోలు: లవకుమార్‌


మీరు స్ర్కిప్ట్‌ రాస్తున్నప్పుడు ఈ పాత్ర నేను వేస్తే బాగుంటుంది అనిపించిన సందర్భాలు ఉన్నాయా?

ఇప్పటిదాకా అలా అనిపించలేదు. అలా అనిపిస్తే మాత్రం దర్శకుడిని బతిమాలి ఆ వేషం వేస్తా. నేను రాసే ప్రతి చిత్రంలోనూ గొప్పగొప్ప పాత్రలు చాలా ఉంటాయి. కానీ నా ఫిజిక్‌ను దృష్టిలో పెట్టుకొని వేసే సాహసం చెయ్యను. నేను చేస్తే ఆ పాత్ర చెడిపోతుంది అనిపించి, చాలా పాత్రలకు దూరంగా ఉంటా. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో ‘కథానాయకుడు’ చిత్రంలో పీతాంబరంగారి పాత్ర బాగా నచ్చింది. అది కూడా నేనే వెయ్యాలనుకోలేదు. ఎవరూ దొరకకపోతే దర్శకుడు క్రిష్‌ ఆపాత్ర నన్నే వెయ్యమన్నారు. అలాగే సినీ రచనా సామాజ్ర్యానికి చక్రవర్తి అయిన పింగళి నాగేంద్రరావుగారి పాత్రను ‘మహానటి’లో పోషించాను. ఒక రచయితగా ఆ పాత్రలో నటించటం నాకు దక్కిన గౌరవమనే చెప్పాలి. 


మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాటకాలే కదా! ఆ రంగం అభివృద్ది కోసం ఏమన్నా చేస్తున్నారా?

మా అమ్మ రంగస్థల నటి. మా నాన్నగారు కూడా రంగస్థల కళాకారుడే. నాకు జీవితాన్ని ఇచ్చిన రంగస్థలానికి ఎంతోకొంత చేయాలనే ఉద్దేశంతో మా ఊరు తెనాలిలో  మిత్రులు, శ్రేయోభిలాషులతో కలసి ‘కళల కాణాచి’ పేరుతో సాంస్కృతిక సంస్థను నెలకొల్పాను.  సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేద కళాకారులకు  చేతనైనంత సేవ చేస్తున్నాం.  మా నాన్న బుర్రా సుబ్రహ్మణ్యశాస్ర్తి  పేరు మీద రంగస్థల జాతీయ పురస్కారాన్ని  ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ  నాటకరంగంలో లెజెండ్‌కు ఇస్తున్నాం.  వచ్చే  ఏప్రిల్‌ 3, 4, 5, 6 తేదీల్లో పద్య నాటక పరిషత్‌ నిర్వహిస్తున్నాం. ఏడున నాన్నగారి అవార్డు అందచేస్తాం. ఈ ఏడాది ఆ అవార్డును  జీఎ్‌సఎన్‌ శాస్త్రిగారికి ఇస్తున్నాం.

Updated Date - 2021-02-28T08:43:02+05:30 IST