తప్పని ‘కడుపు’ కోత

ABN , First Publish Date - 2021-04-21T06:17:40+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలకు వైద్యులు తిలోదకాలిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో శస్త్ర చికిత్స ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

తప్పని ‘కడుపు’ కోత

- ఆసుపత్రుల్లో తగ్గిన సహజ ప్రసవాలు

- ఎడాపెడా సిజేరియన్‌లు

జగిత్యాల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలకు వైద్యులు తిలోదకాలిస్తున్నారు.  జగిత్యాల జిల్లాలో శస్త్ర చికిత్స ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా శస్త్ర చికిత్స జరుగుతున్నాయి. కాన్పు కోసమని ఆసుపత్రికి వెళ్తే సిజేరియన్‌లతో జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 151 సబ్‌ సెంటర్లు, తొమ్మిది 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు, ఒకటి ఏరియా ఆసుపత్రిలో, రెండు సీహెచ్‌సీలు పనిచేస్తున్నాయి. ప్రసవాలు చేసేందుకు జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌, ఏరియా ఆసుపత్రి, పీహెచ్‌సీలలో గైనకాలజిస్టులు, ఇతర వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడితే జిల్లా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పలు పీహెచ్‌సీలలో మాత్రమే చేస్తున్నారు. 

శస్త్ర చికిత్సలే అగ్రభాగం

ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలే ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో 2019-20 సంవత్సరంలో 7,992 ప్రసవాలు జరగగా ఇందులో 2,631 సాధారణ, 5,361 శస్త్రచికిత్స ప్రసవాలు జరిగాయి. ఇందులో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 3,529 ప్రసవాలు జరగగా 1,424 సాధారణ, 2105 శస్త్ర చికిత్స ప్రసవాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌లలో 3,348 ప్రసవాలు జరగగా 951 సాధారణ, 2,397 శస్త్ర చికిత్స ప్రసవాలు, పీహెచ్‌సీల్లో 1,115 ప్రసవాలు జరగగా 256 సాదారణ, 859 శస్త్ర చికిత్స ప్రసవాలు జరిగాయి. అదే విధంగా 2020-21 సంవత్సరంలో ఫిబ్రవరి మాసాంతం వరకు 6,125 ప్రసవాలు జరగగా ఇందులో 1,825 సాధారణ, 4,300 శస్త్రచికిత్స ప్రసవాలు జరిగాయి. ఇందులో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 2,764 ప్రసవాలు జరగగా 914 సాధారణ, 1,850 శస్త్ర చికిత్స ప్రసవాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌లలో 2,923 ప్రసవాలు జరగగా 781 సాధారణ, 2,142 శస్త్ర చికిత్స ప్రసవాలు, పీహెచ్‌సీల్లో 438 ప్రసవాలు జరగగా 130 సాదారణ, 308 శస్త్ర చికిత్స ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం అత్యధికంగా శస్త్ర చికిత్స ప్రసవాలు జరుగుతున్నాయి.

 ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు  

ప్రసవాలకు ఆసుపత్రులకు వస్తున్న గర్భిణిలకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండడంతో శారీరకంగా, ఆర్థికంగా అవస్థల పాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్‌కు రూ.25 వేల నుంచి రూ. 40 వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఫీజులు మరింత ఎక్కువగా ఉన్నాయి. శస్త్ర చికిత్స సమయంలో మహిళలకు ఇస్తున్న మత్తు వల్ల తర్వాతి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. తొలిసారి కాన్పులో శస్త్రచికిత్స జరిగితే మలి కాన్పులో సైతం శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. 

Updated Date - 2021-04-21T06:17:40+05:30 IST