రసపట్టులో..

ABN , First Publish Date - 2021-06-23T09:38:58+05:30 IST

ఎట్టకేలకు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో తొలిసారి పూర్తి స్థాయి ఆట జరిగింది. అలాగే మ్యాచ్‌ కూడా ఆరో రోజుకు చేరింది.

రసపట్టులో..

ఆరో రోజుకు డబ్ల్యూటీసీ ఫైనల్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 249

షమికి నాలుగు వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 64/2


సౌతాంప్టన్‌: ఎట్టకేలకు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో తొలిసారి పూర్తి స్థాయి ఆట జరిగింది. అలాగే మ్యాచ్‌ కూడా ఆరో రోజుకు చేరింది. ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు బుధవారం తొలి సెషన్‌ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు భారత పేసర్లు షమి (4/76), ఇషాంత్‌ (3/48) విజృంభించి కివీ్‌సను కట్టడి చేశారు. అయితే కేన్‌ విలియమ్సన్‌(177 బంతుల్లో 6ఫోర్లతో 49) కీలక ఆటతీరుతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 249 పరుగులు చేసింది. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. కివీ్‌సకు 32 రన్స్‌ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ మంగళవారం ఐదో రోజు ఆట ముగిసేసరికి 30ఓవర్లలో 2వికెట్లకు 64 పరుగులు చేసింది. క్రీజులో పుజార (12), కోహ్లీ (8) ఉన్నారు.  


షమి సూపర్‌:

ఐదో రోజున కూడా చిరు జల్లుల కారణంగా అర్ధగంట ఆలస్యంగా తొలి సెషన్‌ ఆరంభమైంది. కానీ 23 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్‌లో పేసర్‌ షమి విజృంభించాడు. నేరుగా వికెట్ల పైకి వచ్చిన అతడి బంతులను ఆడేందుకు తెగ కష్టపడ్డారు. దీంతో కివీస్‌ 34 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోగా భారత్‌ పోటీలో కొచ్చింది. అయితే ఆరంభంలో బుమ్రా బంతులను కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ సులువుగానే ఎదుర్కొన్నారు. దీంతో కెప్టెన్‌ కోహ్లీ.. షమిని రంగంలోకి దించాడు. ఇది అద్భుతంగా పనిచేసింది. ముందుగా అతడు టేలర్‌ను ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీతో పడగొట్టాడు. ఆ బంతిని టేలర్‌ డ్రైవ్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. షార్ట్‌ కవర్‌లో ఉన్న గిల్‌ సూపర్‌ డైవింగ్‌తో క్యాచ్‌ పట్టేశాడు. కాసేపట్లోనే ఇషాంత్‌ ఓవర్‌లో నికోల్స్‌ (7) ఆట ముగిసింది. మరుసటి ఓవర్‌లోనే షమి స్ర్టెయిట్‌ డెలివరీతో వాట్లింగ్‌ (1)ను క్లీన్‌బౌల్డ్‌ చేసి కివీ్‌సకు షాకిచ్చాడు. దీంతో 117/2తో పటిష్టంగా కనిపించిన కివీస్‌ సెషన్‌ ముగిసేసరికి 135/5తో కష్టాల్లో పడింది. అటు కెప్టెన్‌ విలియమ్సన్‌ మాత్రం మరో పుజారను తలపించాడు. ఈ సెషన్‌లో అతడి బ్యాట్‌ నుంచి ఏడు పరుగులే వచ్చాయి.


వికెట్లు పడినా ఆధిక్యంలోకి..:

బ్రేక్‌ తర్వాత తొలి బంతికే గ్రాండ్‌హోమ్‌ను మరో లెంగ్త్‌ బంతితో షమి ఎల్బీ చేశాడు. కానీ పరిస్థితికి తగ్గట్టుగా గేరు మార్చుకుంటూ కివీస్‌ చివరి ఐదు వికెట్లకు 114 పరుగులతో కీలక ఆధిక్యం సాధించింది. చివర్లో సౌథీ (30) చెలరేగాడు. 85వ ఓవర్‌లో విలిమయ్సన్‌ ఎల్బీ కోసం భారత్‌ రివ్యూకెళ్లినా అంపైర్‌ కాల్‌తో షమికి నిరాశే ఎదురైంది. అయితే తన తర్వాతి ఓవర్‌లోనే సిక్సర్‌తో జోష్‌ మీదున్న జేమిసన్‌ను అవుట్‌ చేసి జట్టుకు ఊరటనిచ్చాడు. ఏడో వికెట్‌కు వీరి మధ్య 30 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. మరోవైపు కివీస్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్‌ ఫోర్‌తో భారత్‌ స్కోరును కివీస్‌ దాటేసింది.  కానీ అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు 94వ ఓవర్‌లో ఇషాంత్‌ ముగింపు పలికాడు. ఆ వెంటనే వాగ్నర్‌ (0)ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. మరోవైపు సౌథీ చకచకా బౌండరీలు బాదేస్తూ స్కోరుబోర్డును పెంచాడు. జడేజా ఓవర్‌లోనూ సిక్సర్‌ బాదినా తర్వాతి బంతికే బౌల్డ్‌ కావడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


ఓపెనర్లు అవుట్‌:

చివరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను ఎప్పటిలాగే కివీస్‌ పేసర్లు స్వింగ్‌తో ఇబ్బందిపెట్టాలని ప్రయత్నించారు. తొలి 10 ఓవర్లు  ఓపెనర్లు రోహిత్‌ (30), గిల్‌ (8) జాగ్రత్తగానే ఆడారు. కానీ సౌథీ వైవిధ్యమైన బంతులకు స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఎల్బీగా వెనుదిరిగారు. ఆ తర్వాత పుజార, కోహ్లీ  వికెట్‌ పడకుండా ఐదో రోజును ముగించారు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 30; కాన్వే (సి) షమి (బి) ఇషాంత్‌ 54; విలియమ్సన్‌ (సి) కోహ్లీ (బి) ఇషాంత్‌ 49; టేలర్‌ (సి) గిల్‌ (బి) షమి 11; నికోల్స్‌ (సి) రోహిత్‌ (బి) ఇషాంత్‌ 7; వాట్లింగ్‌ (బి) షమి 1; గ్రాండ్‌హోమ్‌ (ఎల్బీ) షమి 13; జేమిసన్‌ (సి) బుమ్రా (బి) షమి 21; సౌథీ (బి) జడేజా 30; వాగ్నర్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 0; బౌల్ట్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 99.2 ఓవర్లలో 249 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-70, 2-101, 3-117, 4-134, 5-135, 6-162, 7-192, 8-221, 9-234, 10-249. బౌలింగ్‌: ఇషాంత్‌ 25-9-48-3; బుమ్రా 26-9-57-0; షమి 26-8-76-4; అశ్విన్‌ 15-5-28-2; జడేజా 7.2-2-20-1.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) సౌథీ 30; గిల్‌ (ఎల్బీ) సౌథీ 8; పుజార (బ్యాటింగ్‌) 12; కోహ్లీ (బ్యాటింగ్‌) 8; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 30 ఓవర్లలో 64/2. వికెట్ల పతనం: 1-24, 2-51. బౌలింగ్‌: సౌథీ 9-3-17-2; బౌల్ట్‌ 8-1-20-0; జేమిసన్‌ 10-4-15-0; వాగ్నర్‌ 3-0-8-0.



Updated Date - 2021-06-23T09:38:58+05:30 IST