కివీస్‌ కొట్టేసింది

ABN , First Publish Date - 2021-06-24T08:27:28+05:30 IST

అంచనాలకు మించి రాణించిన న్యూజిలాండ్‌.. ఆరంభ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది.

కివీస్‌ కొట్టేసింది

విలియమ్సన్‌ సేనదే ‘వరల్డ్‌ టెస్ట్‌’ టైటిల్‌

న్యూజిలాండ్‌ ఖాతాలో తొలి ఐసీసీ ట్రోఫీ

కేన్‌ కెప్టెన్‌  ఇన్నింగ్స్‌

ఫైనల్లో టీమిండియా చిత్తు


రెండేళ్లపాటు సాగిన ప్రయాణం.. అద్భుత విజయాలు.. అసమాన పోరాటంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై దారుణంగా బోల్తా పడింది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో.. చేజేతులా టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ గదను న్యూజిలాండ్‌కు అప్పగించింది. బంతితో టీమిండియాను కూల్చిన విలియమ్సన్‌ సేన.. బ్యాట్‌తోనూ రాణించి అసలైన చాంపియన్లు అనిపించుకుంది. తొలిసారి ఐసీసీ ట్రోఫీతో మెరిసింది. భారత ఓటమికి వరుణుడైనా అడ్డుపడతాడని ఆకాశంవైపు ఆశగా చూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది


సౌతాంప్టన్‌: అంచనాలకు మించి రాణించిన న్యూజిలాండ్‌.. ఆరంభ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. అర్ధ శతకంతో అదరగొట్టిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్‌).. రాస్‌ టేలర్‌ (47 నాటౌట్‌)తో కలసి మూడో వికెట్‌కు అభేద్యంగా 96 పరుగులు జోడించడంతో కివీస్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వర్షం అడ్డంకులు సృష్టించడంతో రిజర్వు డే అయిన ఆరో రోజు మ్యాచ్‌ను కొసాగించడం ఫలితాన్నిచ్చింది.


భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 45.5 ఓవర్లలో 140/2 పరుగులతో నెగ్గింది. అశ్విన్‌ (2/17) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆటకు రిజర్వు డే అయిన బుధవారం 64/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 73 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. రిషభ్‌ పంత్‌ (41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ చేతులెత్తేశారు. సౌథీ (4/48) నాలుగు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌ (3/39), మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జేమిసన్‌ (2/30) మంచి సహకారం అందించారు. 


ఆరంభం నుంచే టప..టపా:

కివీస్‌ బౌలింగ్‌ త్రయం దెబ్బకు.. కోహ్లీ సేన క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. పంత్‌ ఎక్కువ సేపు క్రీజులో ఉన్నా.. సహజ దూకుడును కనబర్చలేక పోయాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌  కోహ్లీ (13), పుజార (15)ను  జేమిసన్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చి టీమిండియా పతనానికి నాంది పలికాడు. అయితే, రహానె (15), పంత్‌ నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, బౌల్ట్‌ బౌలింగ్‌లో బంతికి ఫ్లిక్‌ చేసే క్రమంలో రహానె క్యాచ్‌ అవుటయ్యాడు. అనంతరం జడేజా (16), పంత్‌ కొంత వేగంగా ఆడడంతో లంచ్‌ సమయానికి భారత్‌ 130/5తో నిలిచింది. ఇక రెండో సెషన్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం పోరాడలేక పోయారు. భారీ ఆశలు పెట్టుకున్న జడేజాను వాగ్నర్‌ అవుట్‌ చేయడంతో.. ఆరో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నిర్లక్ష్యపు షాట్‌తో పంత్‌.. తన వికెట్‌ను బౌల్ట్‌కు సమర్పించుకున్నాడు. అదే ఓవర్‌లో అశ్విన్‌ (7)ను కూడా పెవిలియన్‌ చేర్చాడు. ఆఖర్లో షమి (13), బుమ్రా (0)ను అవుట్‌ చేసిన సౌథీ.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 


కేన్‌-టేలర్‌ జోడీ అదుర్స్‌:

స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు లాథమ్‌ (9), కాన్వే (19) శుభారంభం అందించారు. అయితే, వీరిద్దరినీ 10 పరుగుల తేడాతో పెవిలియన్‌ చేర్చిన అశ్విన్‌.. భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ జోడీ నిలవడంతో మ్యాచ్‌ కివీ్‌సవైపు మొగ్గింది. ఒక దశలో టీమిండియా బౌలర్లు ఒత్తిడి పెంచినా.. వీరిద్దరూ సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. బుమ్రా బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పుజార నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టేలర్‌.. వడివడిగా పరుగులు సాధిస్తూ టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటించాడు. మరోవైపు విలియమ్సన్‌ కూడా కూల్‌గా ఆడుతూ అర్ధ శతకంతో లక్ష్యాన్ని కరిగించాడు. టేలర్‌ విన్నింగ్‌ ఫోర్‌తో కివీస్‌ సంబరాలు చేసుకొంది. 


ఐసీసీ మెగా ఈవెంట్లలో కోహ్లీ విఫలమవడం ఇది మూడోసారి. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో, 2019 వరల్డ్‌క్‌పలోనూ విరాట్‌ రాణించలేక పోయాడు. ఈ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ను 250 కంటే తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కెప్టెన్‌గా విలియమ్సన్‌.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217; 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 249;


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (ఎల్బీ) సౌథీ 30, శుభ్‌మన్‌ గిల్‌ (ఎల్బీ) సౌథీ 8, పుజార (సి) టేలర్‌ (బి) జేమిసన్‌ 15, విరాట్‌ కోహ్లీ (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 13, అజింక్యా రహానె (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 15, రిషభ్‌ పంత్‌ (సి) నికోల్స్‌ (బి) బౌల్ట్‌ 41, జడేజా (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 16, అశ్విన్‌ (సి) టేలర్‌ (బి) బౌల్ట్‌ 7, షమి (సి) లాథమ్‌ (బి) సౌథీ 13, ఇషాంత్‌ (నాటౌట్‌) 1, బుమ్రా (సి) లాథమ్‌ (బి) సౌథీ 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 73 ఓవర్లలో 170 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-72, 5-109, 6-142, 7-156, 8-156, 9-170; బౌలింగ్‌: సౌథీ 19-4-48-4, బౌల్ట్‌ 15-2-39-3, జేమిసన్‌ 24-10-30-2, వాగ్నర్‌ 15-2-44-1. 


స్కోరు బోర్డు

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 9, కాన్వే (ఎల్బీ) అశ్విన్‌ 19, విలియమ్సన్‌ (నాటౌట్‌) 52, రాస్‌ టేలర్‌ (నాటౌట్‌) 47; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 45.5 ఓవర్లలో 140/2; వికెట్ల పతనం: 1-33, 2-44; బౌలింగ్‌: ఇషాంత్‌ 6.2-2-21-0, షమి 10.5-3-31-0, బుమ్రా 10.4-2-35-0, అశ్విన్‌ 10-5-17-2, జడేజా 8-1-25-0. 

Updated Date - 2021-06-24T08:27:28+05:30 IST