వైరా దోపిడీ దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2021-03-01T05:21:00+05:30 IST

వైరా దోపిడీ దొంగల అరెస్టు

వైరా దోపిడీ దొంగల అరెస్టు
వైరా, నందిగామ సీఐలతో కలిసి వివరాలు వెల్లడిస్తున్న నందిగామ డీఎస్పీ నాగిరెడ్డి

రూ.35.61 లక్షల నగదు, రూ.5.17లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన నందిగామ డీఎస్పీ

మధిర కోర్టులో నిందితుల రిమాండ్‌

చోరీ సొత్తు వైరా పోలీసులకు అందజేత

వైరా, ఫిబ్రవరి 28: ఖమ్మం జిల్లా వైరాలోని ద్వారకానగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన దోపిడీకి సంబంధించిన నిందితులను ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దులోని జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద రాజస్థాన్‌ రాష్ట్రంలోని నిబరేమస్‌ జిల్లా ఆసాద గ్రామానికి చెందిన దినేష్‌సింగ్‌, ఇన్సాఫ్‌ అహ్మద్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.40.79లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.35,61,650 నగదు, రూ.5,17,350 విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వివరాలను నందిగామ డీఎస్పీ నాగిరెడ్డి ఆదివారం వైరా, నందిగామ పోలీసు అధికారులతో కలిసి వెల్లడించారు. 26వ తేదీ రాత్రి వైరాలోని ద్వారకానగర్‌లో డుంగారామ్‌ అనే వ్యక్తి ఇంట్లోకి దినేష్‌సింగ్‌, ఇన్సాఫ్‌ అహ్మద్‌ అనేవారు ప్రవేశించి ఆయనపై దాడిచేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. వెంటనే వైరా సీఐ జె.వసంతకుమార్‌ నందిగామ సీఐ కనకారావుకు, ఎస్‌ఐకు వైరాలోని ద్వారకానగర్‌లో జరిగిన దోపిడీ సమాచారం అందించారు. సరిహద్దు చెక్‌పోస్టుల్లో సహకరించాలని వైరా సీఐ కోరారు. దాంతో ఆదివారం వైరా సీఐ వసంతకుమార్‌, ఎస్‌ఐ వి.సురేష్‌, నందిగామ సీఐ కనకారావు, ఎస్‌ఐ హరిప్రసాద్‌ పోలీసు సిబ్బందితో జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా దినేష్‌సింగ్‌, ఇన్సాఫ్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా నగదు, బంగారు ఆభరణాలు లభించాయి. వెంటనే ఆ ఇద్దరిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డుంగారామ్‌కు చెందిన ఎలక్ర్టికల్‌ షాపులో పనిచేస్తున్న రాజస్థాన్‌ రాష్ట్రంలోని నిబరేమస్‌ జిల్లా ఆసాద గ్రామానికి చెందిన దయాలాల్‌, దుర్గారావు అనే వారి సహకారం, ప్రోత్సాహంతో దినేష్‌సింగ్‌, ఇన్సాఫ్‌అహ్మద్‌ ఈ దోపిడీకి పాల్పడ్డారు. 

డుంగారామ్‌ కుటుంబసభ్యులు ఊరెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. నిందితుల్లో ఒకరైన దినేష్‌సింగ్‌ వైరా వచ్చి అడపాదడపా వస్త్ర వ్యాపారం చేసేవాడు. ఆ సమయంలోనే దయాలాల్‌తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని వాడుకున్న దయాలాల్‌ రాజస్థాన్‌లో ఉన్న దినేష్‌సింగ్‌కు వైరాలోని డుంగారామ్‌ ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాల గురించి సమాచారం ఇచ్చాడు. ఇంట్లో మహిళలు లేరని, కేవలం కుమారులు, డుంగారామ్‌ మాత్రమే ఉన్నారని సమాచారమిచ్చాడు. దోచుకున్న సొత్తును సమానంగా పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దాంతో దినేష్‌సింగ్‌ ఇన్సాఫ్‌ అహ్మద్‌తో కలిసి వైరా వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న డుంగారామ్‌పై దాడిచేసి సొత్తు తీసుకొని పారిపోతూ జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డారు. దయాలాల్‌, దుర్గారావులను పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. అరెస్టు చేసిన దినేష్‌సింగ్‌, ఇన్సాఫ్‌ అహ్మద్‌ను వైరా సీఐ వసంతకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వి.సురేష్‌, పోలీసు సిబ్బంది మధిర కోర్టులో రిమాండ్‌ చేశారు. నందిగామ పోలీసుల నుంచి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకొని వైరాకు తీసుకొచ్చారు. దోపిడీ సొత్తు గుర్తిపులో కీలకంగా వ్యవహరించిన  నందిగామ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాజప్పడకు నందిగామ డీఎస్పీ నగదు రివార్డు అందించారు. సమావేశంలో వైరా, నందిగామ సీఐలు వసంతకుమాన్‌, కనకారావు, ఎస్‌ఐలు సురేష్‌, హరిప్రసాద్‌, తాతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:21:00+05:30 IST