Xiaomi: ఈడీ దెబ్బకు పాక్ పారిపోతున్నట్టు వార్తలు.. షావోమీ స్పందన ఏంటంటే?

ABN , First Publish Date - 2022-10-08T03:02:33+05:30 IST

చైనీస్ మొబైల్ మేరకు షావోమీ భారత‌లో తమ కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి పాకిస్థాన్ తరలిపోతోందా? ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులతో ఉక్కిరిబిక్కిరి

Xiaomi: ఈడీ దెబ్బకు పాక్ పారిపోతున్నట్టు వార్తలు.. షావోమీ స్పందన ఏంటంటే?

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేరకు షావోమీ (Xiaomi) భారత్‌లో తమ కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి పాకిస్థాన్ తరలిపోతోందా? ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షావోమీ(Xiaomi) ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. షావోమీ (xiaomi)కి చెందిన దాదాపు రూ.5,551.27 కోట్లను ఈడీ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. ఈ కారణంగా షావోమీ భారత్‌ను విడిచిపెట్టి పాకిస్థాన్ వెళ్లిపోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై స్పందించిన షావోమీ.. అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. సంచలనం కోసమే ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది. 


2014లో భారత్‌లోకి ప్రవేశించిన షావోమీ ఆ తర్వాతి ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా 99 శాతం స్మార్ట్‌ఫోన్లు, టీవీలను భారత్‌లోనే తయారుచేస్తున్నట్టు చైనీస్ మేకర్ స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, దీనిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొంది.


ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇప్పటికే షావోమీ(Xiaomi)పై కేసు నమోదు చేసిన ఈడీ(ED) ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5,551.27 కోట్లను సీజ్ చేసింది. ఈ సీజింగ్ ఆర్డర్‌ను గత నెలలో కాంపిటెంట్ అథారిటీ ధ్రువీకరించింది. దేశంలో ఇప్పటికి వరకు సీజ్ చేసిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం.  రాయల్టీ చెల్లింపు అనేది భారత్ నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేసే సాధనం తప్ప మరోటి కాదని, అదే సమయంలో ఫెమా నిబంధనలను షావోమీ దారుణంగా ఉల్లంఘించినట్టు కాంపెటెంట్ అథారిటీ పేర్కొంది.


విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 1999 (Foreign Exchange Management Act,1999) కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అధికారులు షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌(Xiaomi Technology India Private Limited)కు చెందిన రూ. 5,551.27 కోట్లను సీజ్ చేశారు. 2014లో షావోమీ((Xiaomi)) స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించగా, 2015 నుంచి డబ్బులు పంపడం ప్రారంభించింది. ఈ సొమ్మును షావోమీ గ్రూప్(Xiaomi Group) సహా మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ పేమెంట్స్ కింద చెల్లించింది. షావోమీ(Xiaomi) పేరెంట్ గ్రూప్ సంస్థల సూచనలతోనే రాయల్టీ పేరుతో ఇంతటి భారీ మొత్తాలను పంపించారు. అంతేకాదు, షావోమీ గ్రూప్ సంస్థల ప్రయోజనం కోసం అమెరికాకు చెందిన సంబంధం లేని రెండు సంస్థలకు కూడా డబ్బు పంపినట్టు ఈడీ గుర్తించింది. 

Updated Date - 2022-10-08T03:02:33+05:30 IST