మా పార్టీకి బలం కార్యకర్తలే

ABN , First Publish Date - 2022-05-07T14:40:30+05:30 IST

తమ పార్టీకి కార్యకర్తలే బలమని, వారి అండదండల వల్లే పార్టీ విజయపథంలో దూసుకెళుతోందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎండీఎంకే 29వ

మా పార్టీకి బలం కార్యకర్తలే

                       - ఎండీఎంకే ఆవిర్భావ వేడుకల్లో వైగో


పెరంబూర్‌(చెన్నై): తమ పార్టీకి కార్యకర్తలే బలమని, వారి అండదండల వల్లే పార్టీ విజయపథంలో దూసుకెళుతోందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎండీఎంకే 29వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎగ్మూరులోని ఎండీఎంకే ప్రధాన కార్యాలయం ‘తాయగమ్‌’లో పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా వైగో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పెరియార్‌, అన్నాదురై విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ప్రముఖులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కార్యకర్తలతోనే తమ పార్టీ ఏర్పాటైందని, తమ పార్టీ గోపురాలపైన కలశం లాంటింది కాదని, గోపురం పునాది లాంటిదన్నారు. ప్రస్తుతం డీఎంకేతో పొత్తుపెట్టుకుని పార్టీ అభివృద్ధి చెందుతోందని, రెండు పార్టీల మధ్య ఏర్పడిన ఈ బంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రసంగం పూర్తయ్యాక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ.. ధరమపురం ఆధీనం పల్లకీసేవపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంచి నిర్ణయం ప్రకటిస్తారని, ఈ విషయంలో స్టాలిన్‌ మాటే తన మాట అని అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు మల్లై సత్యా, దురై వైగో, శాసనసభ్యులు పుదూరు భూమినాథన్‌, తిరుమలైకుమార్‌, రఘురామన్‌ పాల్గొన్నారు.


ఏడాది పాలనలో ఎన్నో పథకాలు

డీఎంకే అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో ఎండీఎంకే నేత వైగో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభినందించారు. ఆ ప్రకటనలో పదేళ్లుగా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తెచ్చిన ఘనత డీఎంకే ప్రభుత్వానికి దక్కుతుందని, తమిళభాషాభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారని, తమిళులకే ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, పోటీ పరీక్షల్లో తమిళభాషకు ప్రాధాన్యం, ప్రవాస తమిళులకు పథకాలు, శ్రీలంక తమిళులకు పునరావాస కేంద్రాలకు రూ.317 కోట్లతో పథకాలు అంటూ.. స్టాలిన్‌ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిపాటు ద్రావిడ తరహా పాలన ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చేసి చూపించారని, అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకుంటున్నారని వైగో కొనియాడారు.

Read more