యాదాద్రీశుడికి ఘనంగా నిత్యోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-29T05:52:47+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం నిత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే సుప్రభాతంతో ప్రారంభమైన నిత్యోత్సవాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి.

యాదాద్రీశుడికి ఘనంగా నిత్యోత్సవాలు
సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో పాల్గొన్న భక్తులు

యాదాద్రి టౌన్‌, నవంబరు 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం నిత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే సుప్రభాతంతో ప్రారంభమైన నిత్యోత్సవాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ నిత్యతిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. స్వామికి శనివారం భక్తుల నుంచి రూ.9,88,830 ఆదాయం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు. యాదాద్రీశుడి సన్నిధిలో శనివారం రెండోరోజు తిరుమంగైయాళ్వార్‌ తిరునక్షత్ర వేడుకలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. అదేవిధంగా యాదాద్రీశుడిని హైదరాబాద్‌కు చెందిన బంగారు బాబు (శ్రవణ్‌కుమార్‌) దర్శించుకున్నారు. బంగారు బాబును చూసిన భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. 

స్వామివారి సేవలో ప్రముఖులు 

యాదాద్రీశుడిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రీశుడిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరాంరెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి వేర్వేరుగా దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అర్చకులు వీరికి బాలాలయంలో కవచమూర్తుల పూజల అనంతర స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు.  

Updated Date - 2020-11-29T05:52:47+05:30 IST