Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2022-08-14T02:27:15+05:30 IST

స్వయంభు పాంచనారసింహక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) సన్నిధిలో శనివారం భక్తుల (Devotees) పూజల కోలాహలం నెలకొంది.

Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట: స్వయంభు పాంచనారసింహక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) సన్నిధిలో శనివారం భక్తుల (Devotees) పూజల కోలాహలం నెలకొంది. పవిత్ర శ్రావణ మాసం, వారాంతపు సెలవు రోజు కావడంతో క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. కొండకింద కల్యాణకట్టలో మొక్కుతలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దేవదేవుడి దర్శనాల కోసం ఆర్టీసీ బస్సులు, తమతమ వాహనాల్లో కొండపైకి చేరుకున్నారు. ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, మొదటి ప్రాకారంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో యాత్రీకులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్వామికి నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా అష్టభుజి ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ కోటికుంకుమార్చన పూజలు వైభవంగా కొనసాగాయి. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ,23,37,923 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-14T02:27:15+05:30 IST