వైభవంగా చక్రతీర్థ స్నానం

ABN , First Publish Date - 2021-02-28T05:39:33+05:30 IST

యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థస్నానం, రాత్రి డోలారోహణం, పుష్పయాగం పర్వాలను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. కల్యాణ లక్ష్మీనృసింహులను దివ్యమనోహరముగా అలంకరించి, సుదర్శన చక్రాలను ప్రత్యేక పల్లకిలో తీర్చిదిద్దారు. చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలను ప్రధానాలయంలో నిర్వహించారు.

వైభవంగా చక్రతీర్థ స్నానం
దేవతోద్వాసన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

పాతగుట్ట నృసింహ ఆలయంలో మహాపూర్ణాహుతి

నేత్రపర్వంగా డోలారోహణం, పుష్పయాగం

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 27: యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థస్నానం, రాత్రి డోలారోహణం, పుష్పయాగం పర్వాలను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. కల్యాణ లక్ష్మీనృసింహులను దివ్యమనోహరముగా అలంకరించి, సుదర్శన చక్రాలను ప్రత్యేక పల్లకిలో తీర్చిదిద్దారు. చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలను ప్రధానాలయంలో నిర్వహించారు. తొలుత పుణ్యహవాచన పూజలు అనంతరం వసంతకేళి, చక్రతీర్థ స్నానం, ప్రధానాలయంలోని యాగశాలలో నిత్య హోమం, మహాపూర్ణాహుతి పర్వాలు కొనసాగాయి. రాత్రి దేవతోద్వాసన, పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకలను దేవస్థాన ప్రధానర్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, ఉపప్రధానార్చకుడు చించాపట్టణం రంగాచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకుడు కొండకండ్ల మాధవాచార్యులు నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రీశుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజా కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులను హారతితో కొలిచారు. నిజాభిషే కం, అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. కొండపైన చరమూర్తుల ఆలయంలో నిత్యారాధనలు శైవాగమ సంప్రదాయరీతిలో కొనసాగాయి.


విష్ణుపుష్కరిణికి చేరిన నీరు

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పురాణ ప్రాశస్త్యమై న విష్ణుపుష్కరిణి నిర్మాణం తుది దశకు చేరగా, అధికార యంత్రాంగం శనివారం నీటిని విడుదల చేసింది. ఈ పుష్కరిణిని కొండపై స్వామివారి పూజా, తీర్థ కైంకర్యాలకు, విశేష ఉత్సవాలకు మాత్రమే వినియోగించనున్నారు. రూ.3.5కోట్ల అంచనా వ్యయంతో లక్ష లీటర్ల నీటి సామర్ధ్యంతో ఈ పుష్కరిణికి మూడు వైపుల రాతి శిల్పాలతో స్నానఘట్టాలు నిర్మించారు.


4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌?

యాదాద్రి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ మార్చి 4వ తేదీన సందర్శించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలుత సీఎం కేసీఆర్‌ ఆదివారం పర్యటిస్తారని అంతా భావించినప్పటికీ ఈ కార్యక్రమం రద్దయింది. కాగా, సీఎం మార్చి 4న రానుండటంతో ఈమేరకు ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యం త్రాంగం సన్నద్ధమైంది. సీఎంవో నుంచి అందిన మౌఖిక ఆదేశా ల మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం, పది రోజులుగా సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రధానాలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తికావస్తుండటం, మరో మూడు మాసాల్లో ఉద్ఘాటనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 4న రానున్నట్టు తెలిసింది. అయితే శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారికంగా ధ్రువీకరించడం లేదు. అధికారులతో సమీక్ష నిర్వహించకుండానే ఉద్ఘాటనకు ఆలయాన్ని ఏమేరకు సంసిద్ధం చేశారనే దానిపై సీఎం దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-02-28T05:39:33+05:30 IST