యాదాద్రి టూ భద్రకాళి..!

ABN , First Publish Date - 2022-05-21T08:29:27+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

యాదాద్రి టూ భద్రకాళి..!

వచ్చే నెలలో సంజయ్‌ మూడో దశ పాదయాత్ర.. 

ప్రజలపై రూ.25 వేల కోట్ల భారం: ఈటల 


హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అమ్మవారి ఆలయం ఉండే చోట పాదయాత్ర ప్రారంభం లేదా ముగింపు అయ్యే సెంటిమెంటుకు అనుగుణంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. యాదాద్రి దేవస్థానం నుంచి వరంగల్‌లోని భద్రకాళి ఆల యం వరకూ కొనసాగే యాత్ర జూన్‌ 20-23 మధ్య లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీజే పీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 రోజుల పాటు కొనసాగే పాదయాత్ర రూట్‌మ్యా్‌పను పార్టీ ముఖ్యనేతలు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా, అన్ని జిల్లాల్లో ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాగా, పాదయాత్ర ప్రారంభానికి ముందే అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలకు సంజయ్‌ హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటుపై సమీక్షించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక నేతలు మరింత విస్తృతంగా ప్రచారం చేసే అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34వేల పోలింగ్‌ బూత్‌లు ఉండగా, పార్టీ ఇప్పటివరకు 26వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకుంది. మిగతా 8వేల బూత్‌ కమిటీలను ఒకటి, రెండు నెలల్లో పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నాం. మొత్తం ప్రక్రియ ముగిశాక, కమిటీ సభ్యులతో భారీ సభ ఏర్పాటు చేసి.. ప్రధాని మోదీని ఆహ్వానించాలని సంజయ్‌ యోచిస్తున్నారని సమాచారం.


పాలన చేతగాకనే.. సీఎం పర్యటనలు..

రాష్ట్రంలో మద్యం, భూముల రిజిస్ట్రేషన్‌, కరెం టు, బస్సు టికెట్ల ధరలు పెంచి ప్రజలపై సంవత్సరానికి రూ.25వేల కోట్ల భారం మోపారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణను అప్పులమయం చేసి, ప్రజల మీద విపరీతంగా పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పెన్షన్లు రెండు, మూడు నెలలకోసారి వస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు లేవని, పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం వండేవారికి డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇక్కడ పరిపాలన చేతగాకనే సీఎం కేసీఆర్‌ ఏదో వెలగబెడతా అంటూ బెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్నారని విమర్శించారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా ఆయన వైఖరి ఉందని నేడొక ప్రకటనలో మండిపడ్డారు.


మోదీకి ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు 

ఈ నెల 26న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు న పెద్దఎత్తున హైదరాబాద్‌ తరలిరావాలని పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం మోదీ అధికారిక కార్యక్రమానికి(ఐఎ్‌సబీ స్నాతకోత్సవం) హాజరవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు. అయితే, బేగంపేట విమానాశ్రయం లో ప్రధానికి ఘన స్వాగతం పలకాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 


జైపూర్‌ సమావేశానికి తెలంగాణ నేతలు

జైపూర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్టీ తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T08:29:27+05:30 IST