
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం వారాంతపు రద్దీ కొనసాగింది. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తజనులు, ఉచిత దర్శన టోకెన్లు పొంది కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో వేదాశీర్వచనాల సేవలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు ప్రధానాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. దర్శన క్యూకాంప్లెక్స్, ప్రసాదాల విక్రయశాల, కొండకింద కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో భక్తుల సంచారంతో సందడి వాతావరణం నెలకొంది. కాగా, వివిధ విభాగాల ద్వారా రూ.21,80,066 ఆలయ ఖజానాకు ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.