
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులకు తోడు వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విక్రయశాల క్యూలైన్లలో భక్తుల కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. దేవదేవుడిని దర్శించుకున్న భక్తజనులు ఆర్జిత సేవత్సోవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీవీఐపీ దర్శన క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దేవస్థానంలో వీల్‌చైర్ సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు. వీవీఐపీ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు దర్శన క్యూ కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తు గుండా పైకి వచ్చిన భక్తులు ఆలయ తిరువీధిలోని గేటు వద్ద దర్శనాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న సమయంలోనూ సౌకర్యాల లేమి ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు వాపోయారు.