Yadadri: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

ABN , First Publish Date - 2022-08-29T01:12:50+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తుల రాకతో కోలాహలంగా మారింది.

Yadadri: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తుల రాకతో కోలాహలంగా మారింది. వేకువజామునుంచే భక్తులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు.. ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గుండా దేవదేవుడి దర్శనాలకు ఉభయ దర్శన క్యూలైన్లలో బారులుతీరారు. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో పట్టణంలో, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాలతోపాటు ఆలయ తిరువీధుల్లో భక్తుల సందడి కనిపించింది. కొండకింద పట్టణ ప్రధాన వీధులు, కొండపైన పార్కింగ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.


లక్ష్మీనృసింహుడికి సంప్రదాయ పూజలు

స్వయంభు పాంచనారసింహుడికి నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రివేళ మహానివేదన..శయనోత్సవాలతో ఆలయ ద్వార బంధనంచేశారు. గర్భాలయంలోని స్వయంభువులను వేదమంత్రాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు కొనసాగాయి

Updated Date - 2022-08-29T01:12:50+05:30 IST