యజ్ఞం వీడిన సోమయాజి

ABN , First Publish Date - 2022-06-04T06:14:43+05:30 IST

కాళీపట్నం రామారావు మాష్టారి ప్రథమ వర్ధంతి నేడు. కథలు రాసినవారెవరైనా కథా రచయిత అవుతారు.

యజ్ఞం వీడిన సోమయాజి

కాళీపట్నం రామారావు మాష్టారి ప్రథమ వర్ధంతి నేడు. కథలు రాసినవారెవరైనా కథా రచయిత అవుతారు. కారా మాత్రమే కథల మాష్టారు అయ్యారు. ‘యజ్ఞం’ కథ రాయడమే కాదు, చిత్తశుద్ధితో చేపట్టిన కథా యజ్ఞం కూడా అందుకు ప్రధాన కారణం. ఎక్కడ, ఎవరు, ఎటువంటి కథ రాసినా దాన్ని కథా నిలయానికి చేర్చాలన్న ఆలోచన పుట్టక ముందు నుంచీ కూడా ఆయన ఎంతో మంది కథకులకు వెన్నుదన్నుగా నిలిచారనే విషయం సాహిత్య ప్రపంచానికి తెలియనిదేమీ కాదు. అటువంటి మహారచయిత తొలినాళ్లలో నా భుజం కూడా తట్టారని గుర్తుచేసుకోవడం నా బాధ్యత. 1992లో మొదటిసారి మాష్టార్ని కలిశా. పూర్తి స్థాయిలో రాసిన ఓ కథను జేబులో పెట్టుకుని మిత్రుడు పడాల జోగారావుతో కలిసి విజయనగరం బస్సెక్కేసా. అప్పటికే చాలామంది మిత్రులు చూసి కథ ‘బావుంద’న్నారు. కానీ, ఆయనతో స్టాంపు వేయించుకోవాలనే ఉత్సాహం నాది. ‘కొత్తగా కథలు రాస్తున్నాననీ, ఓ కథ ఉంది. మీకు చూపించాలని’ చెప్పా. కథ ఇమ్మని చేయిసాచారు. పదహారు మడతలు పెట్టిన అరఠావు సైజులోని అయిదు పేజీల కథ ఆయన చేతిలో పెట్టా. పసిపాపను స్పృశించినంత సున్నితంగా ఆ కాగితాల మడతలు విప్పి, జాగ్రత్తగా కథ ఆసాంతం చదివారు. ఆయన చదవడం ముగించగానే ఉత్సుకతగా ముందుకు వంగా. కానీ, ఆయన మాత్రం అదే నిదానంతో మళ్లీ ఆ కాగితాలను అన్ని మడతలూ పెట్టి జాగ్రత్తగా తిరిగిస్తూ, ఆగమని సైగ చేశారు. నోటి నిండా కిళ్లీ వుంది మరి. లోపలికి వెళ్లి కిళ్లీ ఉమ్మేసి, ముఖం కడుక్కుని వచ్చి, ఓసారి నా ముఖంలోకి తేరాపారా చూశారు. ‘ముందు కథ రాయడం తెలుసుకోండి.


తరువాత విప్లవం కథ రాద్దురుగాని’ అన్నారు. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యా. అంత సున్నితమైన మనిషి, అంత మాట అనేస్తారని అనుకోలేదు. ఆయన నా ముఖంలో మారిన రంగులను క్షణంలో పసిగట్టారు. వెంటనే భుజం మీద చేయి వేసి ‘‘కథ బాగుంది. పేరా విభజన, డైలాగులు రాయడం బాగా వచ్చింది. సబ్జెక్టు కూడా అలాగే ఉండాలి. ఇలాంటి కథలు గతంలో చాలామంది రాశారు’’ అన్నారు. నేను ‘హమ్మయ్య’ అనుకునే లోపు, నన్ను తీసుకెళ్లిన జోగారావుగారి వైపు తిరిగి ‘‘కుర్రాళ్లు విప్లవం కథలు రాసి, ఏదో గొప్ప పని చేసేస్తున్నామనుకుంటూ మూస కథలు రాస్తున్నారు’’ అన్నారు. తర్వాత నేను కథలు రాసి పంపితే, అభిప్రాయాలు చెప్పడంతోపాటు, కలిసినప్పుడు పత్రికల్లో వచ్చిన వివిధ కథల గురించి అడిగితే విడమరిచి చెబుతూ వుండేవారు. మామూలుగా ఆయన మౌనమునే కానీ, ఒక్కరమే వుంటే ఎన్నో విషయాలు నిర్దిష్టంగా మాట్లాడేవారు. తన కిళ్లీ అలవాటు గురించి చాలా మురిపెంగా చెప్పేవారు. ఎన్నోసార్లు ఆయనను కలిసినా, ఎన్నో విలువైన సమయాలను గడిపినా ఆ తొలి అనుభవం ఎంతో బలాన్నిచ్చినమాట నిజం. ‘యజ్ఞం’కు రెండో భాగం రాస్తానని ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ కథలోని గ్రామంలో వచ్చిన మార్పులు, ఆ కథలోని పాత్రలు ఇప్పుడు రూపు మార్చుకున్న వైనం కూడా వివరించారు. ఆ కొత్త ‘యజ్ఞం’ ప్రారంభించకుండానే 97ఏళ్ల వయసులో వెళ్లిపోయారు. తెలుగు కథకులంతా కలిసి ఆయన వదిలిన యజ్ఞాన్ని కొనసాగించడమే కారా మాష్టారికి నిజమైన నివాళి.


– దేశరాజు

Updated Date - 2022-06-04T06:14:43+05:30 IST