ఫలితాన్నిచ్చే యజ్ఞం!

ABN , First Publish Date - 2020-12-25T06:06:15+05:30 IST

రాజ్యంలో కరువు తాండవిస్తే, అనావృష్ఠి దాపురిస్తే యజ్ఞయాగాదులు నిర్వహించాలనే నమ్మకం పూర్వకాలంలో ఉండేది. కోసల రాజ్యం ఒకప్పుడు అలాంటి కరువు కోరల్లోనే పడింది.

ఫలితాన్నిచ్చే యజ్ఞం!

రాజ్యంలో కరువు తాండవిస్తే, అనావృష్ఠి దాపురిస్తే యజ్ఞయాగాదులు నిర్వహించాలనే నమ్మకం పూర్వకాలంలో ఉండేది. కోసల రాజ్యం ఒకప్పుడు అలాంటి కరువు కోరల్లోనే పడింది. రైతులకు చేయడానికి పనులు లేక, గాదెల్లో దాచుకున్న ధాన్యం కూడా అయిపోవడంతో ఆకలి బారిన పడ్డారు. కూలి జనం కూడా పని లేకపోవడంతో పస్తులకు అలవాటు పడిపోయారు. చిన్న చిన్న వ్యాపారులు చితికిపోయాలు. రాజ్య కోశాగారం ఖాళీ అయింది.


‘‘భారీగా యజ్ఞాలు చేయండి మహారాజా! క్షామం అంతరిస్తుంది’’ అని చెప్పారు పురోహితులు. వెంటనే సుదీర్ఘకాలం సాగే క్రతువులను నిర్ణయించి, ప్రకటించాడు మహారాజు. ‘ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ఇవ్వగలిగినన్ని పశువులను పంపాలి’ అని చాటింపు వేయించాడు. వేలాది పశువులు యజ్ఞవాటికల వైపు సాగాయి.

ఒక గ్రామం నుంచి వందల గొర్రెలను తోలుకొని, కోసల రాజధాని శ్రావస్తి వైపు బయలుదేరాడు ఒక రాజ భటుడు. ఆ మందలో ముద్దుగా, బొద్దుగా ఒక గొర్రెపిల్ల ఉంది. కానీ దానికి ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుంటుతోంది. వేగంగా నడవలేకపోతోంది. మందకు కాస్త వెనుకబడిపోయింది. దాని తల్లి మందలోంచీ వెనుకకు పదే పదే చూస్తూ, ఆర్తిగా అరుస్తూ... మందతో పాటే కదిలిపోతోంది. అది వెనుకబడినప్పుడల్లా భటుడు దాన్ని కర్రతో అదిలిస్తున్నాడు. తల్లి వెనుకే ఆ గొర్రె పిల్ల...!

గౌతమ బుద్ధుడు అదే దారిలో వెళ్తున్నాడు. ఆ మంద గౌతముణ్ణి దాటి ముందుకు పోయింది. మంద వెనుక కుంటుతున్న గొర్రె పిల్ల బుద్ధుడికి కనిపించింది. దాని ఆర్తి ఆయన హృదయాన్ని తాకింది. ఆయన వేగంగా మంద వెనుకే నడుస్తూ .


‘‘ఓయీ! ఎక్కడికి ఈ గొర్రెల మంద? ఈ పిల్లను చూసుకోలేదా?’’ అని భటుణ్ణి ప్రశ్నించాడు.


‘‘స్వామీ! మన కోసల రాజుగారు యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో బలికోసం ఈ జీవాలు. ఈ మంద శ్రావస్తికి పోతోంది. ఈ గొర్రె పిల్ల మీద నాకు జాలి లేక కాదు. అయినా దాని చావును నేను ఆపలేను.


 ఈ జీవాల రక్తంతో నేల తడిస్తేగానీ నీటి చుక్క ఆకాశం నుంచి రాలదంట! నేల తడవదంట!’’ అని బుద్ధుడికి నమస్కరించి, మందను గదమాయించి తోలుకు వెళ్ళాడు భటుడు.


బుద్ధునికి విషయం అర్థమయింది. ఆ మంద వెనుకే తానూ శ్రావస్తికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తనూ వేగంగా ఆ మంద వెనుకే కదిలాడు. బుద్ధుడి చేతుల్లో సేద తీరిన గొర్రెపిల్ల ఆర్తనాదాలను ఆపింది. తల్లి గొర్రె కూడా బుద్ధుడి పక్కనే నిబ్బరంగా నడవసాగింది. పొద్దు క్రుంకే వేళకు మంద శ్రావస్తికి చేరింది. ఆ మందతోపాటే యజ్ఞం జరిగే ప్రదేశానికి బుద్ధుడు వెళ్ళాడు.


బుద్ధుడు వచ్చాడనే వార్త రాజుకు చేరింది. వెంటనే అంతఃపురం నుంచి బయలుదేరి వచ్చాడు. బుద్ధుడికి నమస్కరించి నిలబడ్డాడు.

‘‘రాజా! ప్రాణిహింస చేస్తే ప్రకృతి పరవశిస్తుందా? మేఘం కనికరిస్తుందా? నెత్తురుతో నేల పులకరిస్తుందా? రక్తధారలకు రాజనాలు పండుతాయా?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు.

రాజుకు విషయం అర్థమైంది. ‘‘భగవాన్‌! ఇది పండితులు చెప్పారు...’’ అన్నాడు.

‘‘రాజా! రాజ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు రాజు చాలా అప్రమత్తతతో ఉండాలి. చెరువులు, బావులు తవ్వించాలి. నీటిని నిల్వ చేయాలి.  కాలువలు తీయించాలి. రైతులకు ఉచితంగా వ్యవసాయ పనిముట్లు అందించాలి. ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి. చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం చేకూర్చాలి. ఇలా చేయడం వల్ల ప్రజలు కరువు నుంచి తేరుకుంటారు. అప్పుల నుంచి కోలుకుంటారు. రాజ్యం సుభిక్షం అవుతుంది. మీ కోశాగారమూ నిండుతుంది. అంతేతప్ప రాజులు చేయాల్సిన యజ్ఞం పశుబలి కాదు’’ అన్నాడు. దూరంగా చెట్ల కింద మేత మేస్తూ, నింపాదిగా నెమరువేస్తున్న పశువులను చూపించి.


‘‘రాజా! అటు చూడండి. అలా చెట్ల కింద నెమరువేస్తున్న పశువులను చూడండి. మీకు ఆనందాన్ని ఇచ్చేది ఈ దృశ్యమా లేదా వాటి తలలు తెగి, నెత్తురులో పడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడుస్తున్న దృశ్యమా?’’ అని ప్రశ్నించాడు. 


రాజు ఆలోచనలో పడ్డాడు. 

బుద్ధుడి చెయ్యి గొర్రె పిల్ల తలను నిమురుతూనే ఉంది. గొర్రె పిల్ల ఆయన చీవరం అంచును పట్టుకొని ఆడుకుంటోంది. తల్లి గొర్రె బుద్ధుణ్ణి ఆనుకొని నిలబడి, నింపాదిగా నెమరువేస్తోంది. బుద్ధుడి కారుణ్య దృక్కులు రాజుపై పడ్డాయి. అతని హృదయ కాఠిన్యాన్ని కరిగించాయి. యజ్ఞం ఆగిపోయింది. 


ఆ తరువాత బుద్ధుడు చెప్పిన కృషి యజ్ఞం సాగించాడు రాజు. రాజ్యం సుభిక్షమయింది.

 బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-12-25T06:06:15+05:30 IST