యక్షగానం... నవచైతన్యం

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

నాట్యం, నాటకం, సంగీతం, సంభాషణ, ఆహార్యం, అలంకరణల కలబోత యక్షగానం. కర్ణాటక శాస్త్రీయ శైలి అయిన ఈ కళలో ఓ ఇరవై ఏళ్ల వనిత... అదీ ఓ ముస్లిం యువతి అదరగొడుతోంది.

యక్షగానం... నవచైతన్యం

నాట్యం, నాటకం, సంగీతం, సంభాషణ, ఆహార్యం, అలంకరణల కలబోత యక్షగానం. కర్ణాటక శాస్త్రీయ శైలి అయిన ఈ కళలో ఓ ఇరవై ఏళ్ల వనిత... అదీ ఓ ముస్లిం యువతి అదరగొడుతోంది. సామాజిక కట్టుబాట్లను కాదని... మతాల అడ్డుగోడలను దాటుకుని... పదేళ్లుగా కళాభిమానుల అభినందనలు అందుకొంటోంది. కొడిగట్టిపోతున్న సంప్రదాయ శైలికి దివిటీగా మారిన ఆ యువతి ఎవరు? 


ర్షియా తను విట్ల... ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ‘తను విట్ల’ అంటే చాలు... కన్నడ నాట ఎందరికో సుపరిచితం. ఎందుకంటే అక్కడ యక్షగానం ప్రదర్శించే ఏకైక మహిళ తను. కళలను ఇష్టపడేవారుంటారు... అందులో ప్రవేశించేవారూ ఉంటారు. కానీ నచ్చిన కళను ప్రేమిస్తూ... ఆరాధిస్తూ... అందులోనే జీవితాన్ని వెతుక్కొనే కళాకారులు చాలా అరుదుగా కనిపిస్తారు. అర్షియా అలాంటి అరుదైన రకమే! కళపై ఆమెకు ఉన్న మమకారం, నేర్చుకోవాలన్న బలమైన ఆకాంక్షల ముందు లింగ అసమానతలు, మతాలు, ఆచారాలు... ఏవీ అడ్డుగా నిలవలేకపోయాయి. వివక్షను ప్రశ్నించి... అంధవిశ్వాసాలను ఎదురించి యక్షగానాన్ని సాధన చేశారు అర్షియా. 


పదేళ్లప్పుడే ప్రేమ పుట్టింది... 

కళలను అందరూ ఆస్వాదిస్తారు. కానీ దక్షిణ కర్ణాటక జిల్లా, విట్టల్‌ (విట్ల అనీ పిలుస్తారు) పట్టణానికి చెందిన అర్షియా ఆ కళలను కలకాలం బతికించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సంప్రదాయ రంగస్థల రీతిని పూర్తిస్థాయి వ్యాపకంగా మలుచుకుని పునర్‌వైభవం కోసం పరితపిస్తున్నారు. పడిల్‌లోని ఓ ఆటోమొబైల్‌ షాప్‌లో పనిచేస్తున్న ఆమె పదేళ్ల ప్రాయంలోనే యక్షగానంపై ప్రేమలో పడ్డారు. ‘‘ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి. జేసీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదువుతున్న సమయం. పాఠశాల వార్షికోత్సవం కోసం మా టీచర్‌ ఒకరు నాతో యక్షగానం సాధన చేయించారు. నాకప్పుడు పదేళ్లు. అప్పటివరకు అసలు ఆ కళ గురించే తెలియదు. ఆ టీచరే మేకప్‌ వేసి, నేర్పించారు. అయితే ఆ అభినయం, ఆహార్యం, అలంకరణ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. యక్షగానంపై ఇష్టాన్ని పెంచాయి. అప్పుడే నిర్ణయించుకున్నా... పూర్తి స్థాయిలో ఈ కళను అభ్యాసం చేయాలని! దీనికి తోడు నాడు బడిలో ప్రదర్శించిన ‘శ్రీ దేవి మహత్మే యక్షగాన ప్రసంగ’లో మహిషాసుర పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. అమ్మవారి కంటే ఆ పాత్ర నాకు విపరీతంగా నచ్చింది. తొలి రోజుల్లో ప్రదర్శనకు ముందు రోజుకు నాలుగైదు గంటలు సాధన చేసేదాన్ని. ఒక్కసారి అన్ని అంశాలపై పట్టు వచ్చాక ఒక వెనక్కి తిరిగి చూసకోలేదు’’ అంటూ అర్షియా నాటి జ్ఞాపకాన్ని నెమరేసుకున్నారు. 


సవాళ్లు ఎదురైనా... 

యక్షగానం నేర్చుకోవాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి అర్షియా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సొంత కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ‘‘ముస్లిం మతానికి చెందిన మహిళగా యక్షగానం నేర్చుకోవడం గానీ, ప్రదర్శించడం గానీ చేయడానికి వీలు లేదని కొందరు పెద్దలు హెచ్చరించారు. కానీ ఆ క్లిష్ట సమయంలో నా కుటుంబం అండగా నిలిచింది. వారి మద్దతు, ప్రోత్సాహం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నాను’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నారు ఆమె. 


ప్రతినాయకుల పాత్రలే... 

రంగస్థలం ఎక్కితే కథానాయిక, నాయకుల పాత్రలు పోషించాలని కలలు కంటారు ఎవరైనా! కానీ యక్షగానం మొదలుపెట్టిన నాటి నుంచి అర్షియా ప్రతినాయకుల పాత్రలనే అత్యధికంగా పోషిస్తున్నారు. చిన్ననాడు తన మదిలో పడిన ముద్ర, వాటిపైనున్న మక్కువ ఇన్నేళ్లయినా ఇసుమంతైనా తరగలేదు. ప్రతినాయకుడనగానే, అందులోనూ మహిషాసురమర్దిని వంటి రాక్షస పాత్రలు రక్తి కట్టించాలంటే ఆహార్యం ఒక్కటే సరిపోదు. ముఖంలో గాంభీర్యం కనిపించాలి. హావభావాలతో భయం పుట్టించగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి‘నాయకుడి’ పాత్రను ఒక మగువ పోషించి మెప్పించడమంటే సామాన్యం కాదు. అందుకే అర్షియా కళాకారుల్లో ప్రత్యేకం. 


‘‘నిషంబాసుర, రక్తబీజాసుర, మహిషాసుర తదితర పాత్రలెన్నో చేశాను. వాటితోపాటు శ్రీనివాస కల్యాణం, సుదర్శనోపాఖ్యాన, శాంభవి విజయలో దేవతలగానూ కనిపించాను. అయితే ఎక్కువగా రాక్షసులు, విలన్ల పాత్రలే ఉన్నాయి’’ అంటున్న అర్షియాకు స్పష్టమైన ఉచ్ఛారణ మరో ప్రత్యేకత. ఇప్పటికీ యక్షగానంలో శిక్షణ తీసుకొంటున్న ఆమె చందే వాయిద్యం కూడా నేర్చుకొంటున్నారు. యక్షగానంలో ఈ వాయిద్యం కీలకమైనది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని తపిస్తున్న అర్షియా కళలకు హద్దులు, అంతరాలు ఉండవని నిరూపిస్తున్నారు. 

Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST