సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో గుంజుకుంటున్నారు: యనమల

ABN , First Publish Date - 2022-04-03T21:36:43+05:30 IST

సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని టీడీపీ నేత యనమల విమర్శించారు.

సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో గుంజుకుంటున్నారు: యనమల

విజయవాడ: శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజా పంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని విమర్శించారు. కరోనాతో ఆర్ధికంగా కుదేలైన ప్రజానీకాన్ని జగన్ రెడ్డి ఆస్తిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీల బాదుడుతో దివాలా తీయించారని విమర్శించారు. జే-బ్రాండ్లతో జనం జేబులకు చిల్లు పెట్టారని, లూఠీ కోసం చేసిన అప్పులతో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పంచాయతీల నిధులు దారిమళ్లిస్తోందని ఆరోపించారు. పంచాయతీ నిధులు పీడీ ఖాతాలకు మళ్లించి ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుందన్నారు. అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలను ఉంచడమే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమా? అని ప్రశ్నించారు.


ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులను అధికార పార్టీ పెద్దలపై ఆధారపడేలా చేయడం, సర్పంచులపై సొంత పార్టీ వారిని వాలంటీర్లుగా నియమించి పెత్తనం చెలాయిస్తున్నారని యనమల విమర్శించారు. గ్రామ స్వరాజ్యం గురించి గాంధీజీ చెప్పిన సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా జగన్ రెడ్డి వ్యవరిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీల అధికారాలను సర్పంచుల చేతిలో నుంచి లాగేయటం రాజ్యాంగంలోని  ఆర్టికల్ 73, 74కు వ్యతిరేకమన్నారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అధికారాన్ని, పరిపాలన స్వేచ్చను కోల్పోయిన సర్పంచులు ఇకనైనా మేలుకోవాలని, గ్రామ స్వరాజ్యాన్ని కాపాడేందుకు, దాన్ని పునర్నింమించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాజధానిలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించేందుకు ఐదేళ్లు కావాలని ప్రభుత్వం అఫిడవిట్ వేయడం దుర్మార్గమన్నారు. అమరావతిలో మౌళిక సదుపాయాలకు సంబంధించి 90 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాయని, మిగిలినవి పూర్తి చేసి రైతులకు అప్పగించేందుకు 6 నెలలు సరిపోతుందని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-03T21:36:43+05:30 IST