అశోక్‌బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: యనమల

ABN , First Publish Date - 2022-02-11T17:22:38+05:30 IST

కక్షసాధింపులో భాగంగా అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

అశోక్‌బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: యనమల

అమరావతి: ఉద్యోగుల పీఆర్సీపై ప్రశ్నించినందుకే కక్షసాధింపులో భాగంగా టీడీపీ నేత అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అశోక్‌బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన సమయంలోనే ఆయనపై అక్రమ కేసు నమోదు చేయడం కుట్రపూరితం కాదా? అని ప్రశ్నించారు.


టైపో గ్రాఫిక్ తప్పిదం వల్లే పొరపాటు జరిగిందని, ఇందులో తన తప్పు లేదని అశోక్ బాబు స్పష్టంగా చెప్పడం జరిగిందని యనమల అన్నారు. ఈ అంశంపై గత ప్రభుత్వాలు విచారణ జరిపి ఎలాంటి నేరపూరితం లేదని, ఎలాంటి బెనిఫిట్స్ పొందలేదని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందన్నారు. ముగిసిపోయిన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సొంత మనిషి సూర్యనారాయణను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం రాక్షసత్వమని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ అశోక్ బాబు ఎక్కడా తన విద్యార్హత డిగ్రీ అని చెప్పలేదన్నారు. అర్థరాత్రి అరెస్టుల ద్వారా ప్రశ్నించకుండా ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని, తక్షణమే కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-11T17:22:38+05:30 IST