ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‎ను తీవ్రంగా ఖండించిన యనమల

ABN , First Publish Date - 2021-04-23T18:02:23+05:30 IST

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. నరేంద్రను అరెస్ట్ చేయడం..

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‎ను తీవ్రంగా ఖండించిన యనమల

అమరావతి : పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. నరేంద్రను అరెస్ట్ చేయడం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని యనమల మండిపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయంగా నరేంద్రను ఎదుర్కోలేకనే జగన్ పగబట్టారని ఆరోపించారు. టీడీపీపై కక్షతో సంగం డెయిరీపై ప్రతీకారం తీర్చుకోవడం, అమూల్‎పై ప్రేమతో రాష్ట్రంలో డెయిరీ వ్యవస్థనే జగన్ కాలరాయాలని చూడటం శోచనీయమని విమర్శించారు. మొన్న అచ్చెన్నాయుడి ఇంటిపైకి, నిన్న కొల్లు రవీంద్ర ఇంటిపైకి, అంతకుముందు కూన రవికుమార్ ఇంటిపైకి, ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటిపైకి ఇలా వందలాది మంది పోలీసులను పంపి ఆయా ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టించడం జగన్ పిరికిపంద చర్యేనని ధ్వజమెత్తారు. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత భయోత్పాతం సృష్టించినా తమ పార్టీ నేతల పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలను తొలగించడం అసాధ్యమని యనమల చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-04-23T18:02:23+05:30 IST