పట్టణాభివృద్ధి.. సంక్షేమానికి మొండిచేయి

ABN , First Publish Date - 2021-03-01T09:36:15+05:30 IST

జగన్‌ పాలనలో పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మొండిచేయి చూపించారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు

పట్టణాభివృద్ధి.. సంక్షేమానికి మొండిచేయి

20 నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెరిగాయి

పుర ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలి: యనమల


అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మొండిచేయి చూపించారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. అభివృద్ధి కుంటుపడింది. పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. పారిశ్రామికీకరణ కుంటుపడి ప్రజల ఆదాయాలు క్షీణించాయి. ఈ 20 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకుల ఆస్తులు మాత్రం పెరిగాయి. ప్రజల ఆస్తులు మాత్రం తరిగిపోయాయి. పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి చేయని జగన్‌ పాలనపై పట్టణ ఓటర్లు ఆలోచన చేయాలి.


మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలి. 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం పట్టణాల్లో రూ.6,562 కోట్లు ఖర్చుపెడితే, అందులో మూలధన వ్యయం రూ.1391 కోట్లు. అదే 2019-20లో జగన్‌ ప్రభు త్వం రూ.4,801 కోట్లు ఖర్చుపెడితే, అందులో మూలధన వ్యయం రూ.673 కోట్లు మాత్రమే. మూలధన వ్యయాన్ని సగానికి పైగా తగ్గించేశారు. తొలి ఏడాది రూ.673కోట్లు ఖర్చుపెట్టలేని వారు ఇక రెండో ఏడాది ఏం ఖర్చుపెడతారు? పట్టణాభివృద్ధికి ఏం చేస్తారు? ఓట్లు అడిగే నైతిక హక్కు వీరికి ఎక్కడిది? పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గృహనిర్మాణ బడ్జెట్‌లో ఖర్చుపెట్టింది శూన్యం’ అని యనమల విమర్శించారు.

Updated Date - 2021-03-01T09:36:15+05:30 IST