అగాథంలో ఆంధ్ర ఆర్థికం

ABN , First Publish Date - 2021-01-08T06:41:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1956 నుంచి అన్ని ప్రభుత్వాలూ అప్పులు చేస్తూనే వచ్చాయి. కానీ వైసీపీ ఈ అయిదేళ్ళలో చేసిన అప్పు అరవై ఏడేళ్ళ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పుకు సమానం. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్...

అగాథంలో ఆంధ్ర ఆర్థికం

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1956 నుంచి అన్ని ప్రభుత్వాలూ అప్పులు చేస్తూనే వచ్చాయి. కానీ వైసీపీ ఈ అయిదేళ్ళలో చేసిన అప్పు అరవై ఏడేళ్ళ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పుకు సమానం. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోబోతోందనడానికి ఇదే సంకేతం. 2020 నవంబర్ నాటికి ఏపీ స్థూల అప్పు రూ.3,73,140 కోట్లకు చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.


నాగజెముడు వలె నవ్యాంధ్రను నాశనం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తుకి శరాఘాతంగా మారాయి. వైసీపీ పాలనలో ఏడాదిన్నరగా అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి రూ.30 వేలకోట్ల చొప్పున ఐదేళ్లలో లక్షా రూ.50 వేల కోట్ల అప్పులు చెయ్యగా, వైసీపీ ప్రభుత్వం మొదటి ఏడాది రూ.80 వేల కోట్లు, రెండవ ఏడాది నవంబర్ వరకు రూ.73,812 కోట్లు అప్పు చేశారు. అంటే 18 నెలల్లో లక్షా 50 వేల కోట్ల అప్పులు చేశారన్నమాట! తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నదని వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున విమర్శించారు. మరి ఏడాదిన్నరలోనే చేసిన లక్షన్నర కోట్ల అప్పు మాటేమిటి?


అప్పు చేసి తెస్తున్న నిధులను పందారాలు చెయ్యడానికి, పాత అప్పులు తీర్చడానికి, వడ్డీలు చెల్లించడానికి మళ్లిస్తున్నారు తప్ప, వాటిలో సగమైనా మౌలిక వసతుల, స్థిరాస్థుల కల్పనకు వినియోగించడం లేదు. అప్పులు దూసి తేవడమే తప్ప ఆదాయం పెంచే ప్రణాళిక ఒక్కటీ లేదు. చేసిన అప్పులు తీర్చడం కోసమే మళ్ళీ అప్పులు చేస్తున్నారని కాగ్ కూడా వెల్లడించింది. దశా దిశా లేని జగన్ పాలన రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తుంది. చరిత్రలో తుగ్లక్ కూడా రాజధాని మార్చడంతో సహా తాను అనుకున్నదల్లా చేసి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాడు. జగన్ అదే బాటలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. మేడిపండ్ల వంటి నవరత్నాలతో ఉద్ధరిస్తున్నామని ప్రచారం చేసుకొంటున్న పాలకులు పెరుగుతున్న అప్పుల భారాన్ని, ఫలితంగా ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారాన్ని పట్టించుకోవడం లేదు. 


ఫిజికల్ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిని గాలికొదిలేశారు. ఉద్యోగులకు టిఏలు, డిఏలు లేవు. మునుపెన్నడూ లేనివిధంగా ఆరు డీఏలు బకాయిలు పెట్టారు. చివరికి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో పింఛన్లు కూడా లేవు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగ్ పెడుతున్నారు. ఈ వ్యవహార శైలితో ఉద్యోగుల శక్తి సామర్థ్యాలనే కుంగదీస్తున్నారు. ఆర్థిక లోటు రూ.1,10,320 కోట్లకు చేరుతోంది. అప్పులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర రియల్ జిఎస్‍డిపి 7.6% పడిపోయిందని జాతీయ సగటు లెక్కలు చెప్పాయి. జిఎస్‍డిపిలో అప్పుల నిష్పత్తి 37% పెరిగింది. అంటే గతం కన్నా 10% పెరిగింది (బిఈ ప్రకారం ఉండాల్సింది 27%). జిఎస్‍డిపిలో ద్రవ్యలోటు 13%కు పెరిగింది. ఎఫ్‍డి 8% అధికం అయ్యింది (బిఈ ప్రకారం ఉండాల్సింది మైనస్ 5%). జిఎస్‍డిపిలో రెవిన్యూ లోటు (ఆర్‍డి) మైనస్ 3-4%కు చేరింది. గత ఏడాది తొలి ఆరు నెలల్లో కన్నా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెవిన్యూ వసూళ్లు 6% పెరిగాయి. అప్పులు తీసుకోవటం రెట్టింపు చేశారు. ఖర్చులు 23% అదనంగా చేశారు. కేంద్ర సాయం రూ.7,700కోట్లు అదనంగా అందింది. కరోనా నివారణకు అదనపు సాయం అందింది. వాటినీ దుర్వినియోగం చేశారు. 


ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1956 నుంచి అన్ని ప్రభుత్వాలూ అప్పులు చేస్తూనే వచ్చాయి. కానీ వైసీపీ ఈ అయిదేళ్ళలో చేసిన అప్పు అరవై ఏడేళ్ళ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పుకు సమానం. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోబోతుంది అనడానికి ఇదే సంకేతం. 2020 నవంబర్ నాటికి ఏపీ స్థూల అప్పు రూ.3,73,140 కోట్లకు చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది . వైసీపీ ఐదేళ్ల పరిపాలనలోనే రాష్ట్ర అప్పు రూ.5లక్షల కోట్లు దాటనుంది. వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లించాల్సినవి రెండూ కలిపితే ఏడాదికి రూ.50వేల కోట్ల వరకు ఉంటుంది. వైసీపీ చివరి ఏడాదిలో వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుంది.


కేవలం అప్పుల మీదే ఆధారపడటం వ్లల రాబోయే రోజుల్లో రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోతుంది. ఇకపై ఏపీకి అప్పు ఎక్కడా దొరకని దుస్థితి ఏర్పడుతుంది. చివరికి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కుంటుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో రాష్ట్రం వుండదు. ఏపీ బడ్జెట్ 2019–-20, 2020-–21ను బట్టే, కేర్ రేటింగ్స్, ఈ గ్యారంటీ లిమిట్స్‌ను కూడా దాటిపోయే ప్రమాదం వుంది. టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో 90శాతం వరకు ఆదాయానికి మించి, చేతికి ఎముక లేనట్లు, ఖర్చు పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రం దివాలా అంచుకు చేరటం ఖాయంగా కనిపిస్తుంది. 


జిఎస్‍డిపి, అప్పుల నిష్పత్తి 37.6%కు పెరిగిపోయింది. 2018–-19లో తెలుగుదేశం హయాంలో ఇది 28% మాత్రమే. ఏడాదిలోనే జిఎస్‌డిపి, అప్పుల అంతరం 6.6% పెరిగిపోయింది. చివరకు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరవ రాష్ట్రంగా నిలిచింది. ఎఫ్ఆర్‍బిఎం పరిమితిని కేంద్రం 3% నుంచి 5%కు పెంచినప్పటికీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తెస్తున్న అప్పులను పరిశీలిస్తే ఆర్థిక లోటు భవిష్యత్తులోనైనా నియంత్రణ చేసే స్థాయిలో లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కేంద్రం పెంచిన 2% కూడా ఏ మాత్రం సరిపోదు. 2020--–-21లో కరోనా తరువాత, రాష్ట్ర రాబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఆ ఉపద్రవం గురించి ఆలోచించే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ డెఫిసిట్ 4% నుంచి 5% పెరిగేలా ఉంది. కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌కు తీవ్ర నిధులు కొరత ఏర్పడింది. 2019–-20లో కేపిటల్ ఎక్స్‌పెండిచర్ పదివేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయిన విషయం తెలిసిందే. 2020–-21లో ఆ మాత్రం కూడా ఖర్చుపెట్టలేరనేది ఇప్పటికే స్పష్టమయింది. రెవెన్యూ లోటు పెరగకపోవడం వల్ల, అప్పు తెచ్చిన డబ్బు కూడా రెవెన్యూ లోటు పూడ్చడానికి, వడ్డీల చెల్లింపునకు, అసలు చెల్లింపునకు సరిపోనున్నాయి. అనుత్పాదక వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి ఇకపై ఉత్పాదక వ్యయానికి నిధులు ఉండవు. ఇప్పటికే రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ రేటు నుంచి సింగిల్ డిజిట్‌కి పడిపోయింది.


మిషన్ బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం మరో దివాలాకోరు చర్యగా చెప్పాలి. చౌకధరకు తన అనుచరులకు భూములను కట్టబెట్టేందుకే ఈ వేలం తప్ప దీనివ్లల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం శూన్యం. భవిష్యత్తులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు, అభివృద్ధి కార్యక్రమాలకు భూములు లేకుండా చెయ్యడం రాష్ట్రానికి అన్నివిధాలా అనర్థదాయకమే. ఇప్పటికే ‘రాష్ట్రం దివాలా తీసిందా భూములు అమ్మేస్తున్నార’ని ప్రజలు నిలదీస్తున్నారు. ‘అవి ప్రభుత్వ భూములు కావు, ప్రజల భూములని తెలుసుకోవాలి’ అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికగా తీసుకోవాలి. భూములు తెగనమ్మగా వచ్చే డబ్బును భావితరాల అభివృద్ధికి తోడ్పడే ఆస్తుల సృష్టికి కాకుండా వడ్డీల చెల్లింపుకు, ప్రభుత్వ నిర్వహణకు వెచ్చించడం రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు. సమాజంలో సంపద సృష్టించడం చేతగాని వాళ్లకు, ఆ సంపదను నాశనం చేసే హక్కు లేదు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు నిర్మాణంగానీ, ఒక్క రోడ్డు నిర్మాణంగానీ చేపట్టలేకపోయారు. ఒక్క వంతెన నిర్మించలేదు. 19 నెలలుగా ఎక్కడా బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. తట్ట మట్టి తియ్యలేదు.


చివరకు ఆంధ్రప్రదేశ్ అంటేనే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడే స్థితికి తెచ్చారు. నవ్యాంధ్రను నేరగాళ్లకు స్వర్గధామంగా మార్చారు. ప్రతిపక్షాలపై దాడులు, ప్రజలపై దౌర్జన్యాలు, ఆలయాలపై దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సాగిస్తున్న ఈ జగన్నాటకాలకు, భ్రష్ట ఏలుబడికి తెరదించాల్సినది జనమే!




యనమల రామకృష్ణుడు

మాజీ ఆర్థిక మంత్రి

Updated Date - 2021-01-08T06:41:59+05:30 IST