AP News: జగన్‌ సర్కార్‌పై యనమల సెటైర్లు

ABN , First Publish Date - 2022-08-19T21:51:48+05:30 IST

జగన్‌ సర్కార్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) సెటైర్లు విసిరారు.

AP News: జగన్‌ సర్కార్‌పై యనమల సెటైర్లు

అమరావతి: జగన్‌ సర్కార్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) సెటైర్లు విసిరారు. అడ్డగోలు అప్పులతో ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. లెక్కాజమా లేని అప్పులే ఏపీలో అగ్నికి ఆజ్యం అయ్యాయని తెలిపారు. పథకాల అమలుకన్నా సాక్షి (Sakshi) దినపత్రికలో వాటి ప్రకటనలకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని తప్పుబట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చేదిలేదనే.. జగన్‌ (Jagan) ఏపీని కోలుకోలేని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పనా శూన్యమన్నారు. బాధితవర్గాల ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.


భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా గురువారం జగన్‌ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇందులో రూ.500 కోట్లపై 7.74 శాతం వడ్డీ అమలు కాగా, మరో రూ.500 కోట్ల అప్పుపై 7.72 శాతం వడ్డీ పడింది. ఈ మొత్తంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు.. 5 నెలల్లో తెచ్చిన అప్పులు రూ.44,604 కోట్లకు చేరాయి. ఇందులో ఒక్క ఆర్‌బీఐ నుంచే 34 వేల కోట్లు తేవడం గమనార్హం. ఇవి గాక నాబార్డు నుంచి రూ.40 కోట్లు, కేంద్రం నుంచి రూ.1,373 కోట్లు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.8,300 కోట్లు తీసుకొచ్చారు. 


నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 9నెలలకుగాను రూ.43,803 కోట్ల అప్పు లు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. కానీ జగన్‌ ప్రభుత్వం దీనిని కేవలం నాలుగున్నర నెలల్లోనే దాటేసింది. ఇక సీపీఎస్‌ రద్దు చేయకుండా ఉంటే రూ.4,203 కోట్ల అప్పు అదనంగా తెచ్చుకోవచ్చు. దీనికి అదనంగా పొలాల్లో బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడం ద్వారా రూ.2,000 కోట్లు రుణం తెచ్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. జగన్‌ ప్రభుత్వం పరిమితికి మించి, కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తేవడం మూడున్నరేళ్లుగా సాగుతూనే ఉంది.


Updated Date - 2022-08-19T21:51:48+05:30 IST