శివ శివా..!

ABN , First Publish Date - 2021-01-24T05:59:52+05:30 IST

శివ శివా..!

శివ శివా..!

ఆక్రమణల చెరలో రామలింగేశ్వరస్వామి కొండ ప్రాంతం

వైసీపీ నేతల అండతో వెలుస్తున్న నిర్మాణాలు

సరిహద్దులు లేవంటున్న ఆలయ ఈవో

వైసీపీ అధికారంలోకి వచ్చాక వందకు చేరిన ఆక్రమణలు

ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో కొందరు కొండ దిగువన ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో వెలుస్తున్న ఈ ఆక్రమణలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదు. 

పెనమలూరు : యనమలకుదురు రామలింగేశ్వర స్వామి కొండ దిగువన శివపార్వతి నగర్‌వైపు.. రహదారికి, కొండకు మధ్యలో ఉన్న దేవస్థానానికి చెందిన భూమిలో వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. కొండను తొలుచుకుంటూ ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలు విరుద్ధంగా ఏకంగా దేవస్థాన భూముల్లో మాంసపు షాపులు నిర్మించారు. వీటితోపాటు కిరాణా, మెకానిక్‌, ఫుడ్‌ సెంటర్లు వందల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. స్థానిక వైసీపీ నేతల ప్రోద్బలంతో బహిరంగంగా పట్టపగలే నిర్మాణాలు చేపడుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అధికార పార్టీ నేతల అండతో..

ఆర్‌ఎస్‌ నెంబరు 14లో రామలింగేశ్వరస్వామి కొండ దిగువన ఉన్న (కొండ పోరంబోకు) ఈ భూమిలో అధికార పార్టీని అడ్డుపెట్టుకుని ఆక్రమణలకు తెగబడుతున్నారు. తొలుత వైసీపీకి చెందిన ఓ ఎంపీటీసీ, ప్రస్తుత బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భర్త ఈ భూమిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఖరీదైన కారులో తిరుగుతూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. గత ఏడాది యనమలకుదురు కరకట్ట దిగువన భారీస్థాయిలో కోడిపందేలు, పేకాట శిబిరాలను ఏర్పాటుచేసిన మరో వైసీపీ నేత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని దేవస్థాన భూములను ఆక్రమించి సుమారు పది ఇళ్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కేకే చికెన్‌ సెంటర్‌ పేరుతో కొండ కింద మాంసపు దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. వీరిద్దరి అండతో మరికొంతమంది ఇష్టానుసారం సుమారు 300 మీటర్ల విస్తీర్ణంలో దేవస్థాన భూమిని ఆక్రమించి నిర్మాణాలను చేపడుతూనే ఉన్నారు. కొంతమంది ఆక్రమణదారులు నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించి ఇతరులకు విక్రయించి నట్లు, అద్దెకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

25 నుంచి వందల సంఖ్యలో..

2006లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ ధనేకుల వెంకటరత్నం ఆదేశానుసారం దేవస్థాన భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగించడానికి అధికారులు యత్నించారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆక్రమణలను కూల్చడానికి అధికారులు యత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికి సుమారు 25 నిర్మాణాలు ఉండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నేతల అండతో ఆక్రమణలు ఊపందుకున్నాయి. ఇప్పుడు దాదాపు 100కు పైగా నిర్మాణాలు వెలిశాయి. నూతనంగా మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇటీవల బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్‌ ధర్నా నిర్వహించారు. సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అయినా అధికారుల్లో స్పందన లేదు. 

సరిహద్దులు తేలాల్సి ఉంది

రామలింగేశ్వరస్వామి కొండ దిగువన ఆర్‌ఎస్‌ నెంబరు 14 కింద 33.46 ఎకరాలు ఉంది. దీనికి నలువైపులా రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంది. హద్దులు నిర్ణయించమని తహసీల్దారుకు వినతిపత్రం అందజేశాం. హద్దులు నిర్ణయించగానే ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగిస్తాం. 

- బి.గంగాధరరావు, ఈవో, రామలింగేశ్వరస్వామి దేవస్థానం


ఆలయ అధికారులే కాపాడుకోవాలి

రామలింగేశ్వరస్వామి కొండ దిగువన ఉన్న పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆలయానికి సంబంధించిన భూమికి గతంలో సర్వేయర్లు హద్దులను తేల్చారు. ఆలయ అధికారులు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దేవస్థాన, పంచాయతీ అధికారులు బాధ్యత తీసుకుని కాపాడుకోవాలి. ఆక్రమణల తొలగింపులో మా సాయం కోరితే తప్పకుండా సహకరిస్తాం.

- భద్రునాయక్‌, తహసీల్దార్‌, పెనమలూరు

Updated Date - 2021-01-24T05:59:52+05:30 IST