ప్రేమించ లేదు.. కామించనూ లేదు

Published: Fri, 07 Feb 2020 16:19:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రేమించ లేదు.. కామించనూ లేదు

నాకు కొద్దిగా ఈగో ఎక్కువ

జ్యోతి విషయంలో నా తప్పు లేదు

ఆమె రాసిన లేఖే నన్ను రక్షించింది

త్వరలో ఒక ఇంగ్లీషు నవల రాస్తాను

9-5-11న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో యండమూరి


మీకు వచ్చిన పాపులారిటీ భిన్నమైనది, ఎక్కువ. అంత పాపులారిటీ కోసం ఎన్ని మెట్లు ఎక్కి వచ్చారు?

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. రైటర్‌గా పాపులారిటీ అనేది బిర్యానీ లాంటిది. కానీ సీఏ..నాకు భోజ నం లాంటిది. పాపులారిటీ రావడానికి ఇష్టంగా పని చేశాను. అదృష్టాన్ని నేను నమ్మను. నేను సీఏ కావడం ప్లానింగ్‌కు తోడ్పడింది.


సినిమా రంగాన్ని ఎందుకు వదిలేశారు?

ఇక్కడ డబ్బున్నా చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ గ్లామరస్‌ రంగమంటే మొదటి నుంచి ఇష్టం లేదు. అక్కడ రైటర్‌కు అంత విలువ ఇవ్వరు. ఒక హీరో విషయంలో ఇబ్బంది పడ్డాను.


చిరంజీవితో మీరు బాగా క్లోజ్‌. మరి ఎక్కడ తేడా వచ్చింది?

అదేం లేదు. మూడేళ్ల క్రితం చివరిగా కలిశాం. రాజకీయాల్లోకి వెళ్లొద్దని అప్పుడే సలహా ఇచ్చాను. చిరంజీవి యువసేన ఏర్పాటు చేసి అన్నా హజారేలాగా నాలుగైదు ఏళ్ల పాటు పనిచేసుకుంటూ వెళ్తే 250 సీట్లు వస్తాయని చెప్పాను. ఆయనకు 20, 30 సీట్ల కన్నా ఎక్కువ రావని ముందే చెప్పాను.


మీరు త్వరగా అభిప్రాయాలు మార్చుకుంటారట

అదేం లేదు. కెరీర్‌కు అనుగుణంగా నేను చేసే పనులను మార్చాను. తులసిదళం రూ.50కు రాశా. డబ్బు తేలిగ్గా వస్తుందనేవిధానమైతే తులసిదళం రాయలేకపోయేవాణ్ని.


కోల్పోయిన వాటిని సాధించాలనుంటుంది. మీరేం చేశారు?

ఎంత ఎదగాలన్న అవగాహన ఉండాలి. కారు, ఇల్లు వంటివి పొందిన తరువాత.. సేవ చేయడంలో ఆనందం పొందుతున్నాను.


గాంధియన్‌, క్యాపిటలిస్ట్‌ ఫిలాసఫీలను కలగలిపి సొంతంగా ఒకదాన్ని మీరు అభివృద్ధి చేసుకున్నట్లుంది?

అవును నిజమే. నాకు అనుకూలంగా నేను అభివృద్ధి చేసుకున్న ఫిలాసఫీ. పని చేస్తున్నప్పుడు సంతోషంగా చేసి ఫలితాన్ని వదిలేయాలన్న భగవద్గీత సూత్రాన్ని పాటిస్తాను.


రచయితగా పాపులర్‌ అయినా, వివాదాస్పదం అయ్యారు?

నేను రాసిన 50 నవలల్లో రెండు మాత్రమే క్షద్ర నవలలు. వాటి కంటే ముందు కూడా ఐదు నవలలు రాశాను. కేవలం ఆ రెంటినే పట్టుకుని క్షద్ర రచయితనని ముద్ర వేశారు. అయితే.. అంతకంటే ఎక్కువ పాపులారిటీ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల తెచ్చింది. ఇప్పుడు మాత్రం కోటి రూపాయలు ఇచ్చినా ‘తులసి దళం’ లాంటివి రాయను. కాలంతో పాటు పరివర్తన చెందుతున్నాను. ఇప్పుడు రాస్తున్నవి యువతీయువకులను కార్యోన్ముఖులను చేయడానికి.


జ్యోతి విషయం మానసిక సంఘర్షణ కలిగించిందా?

నేను బాగా పాపులర్‌ అయినప్పుడు ఆమె ఆరు నెలలపాటు లేఖలు రాసింది. విజయవాడలో నన్ను కలిసినప్పుడు ఆమె నాకు పంపిన ఫొటో వేరేవారిదని తెలిసింది.. ఆమె నన్ను ప్రేమిస్తున్నట్లు తెలిసి, ‘నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఎదుటి వారిని ఎలా ప్రేమిస్తావ’ని కోప్పడ్డాను. ఆ తరువాత ఆమె చనిపోయింది. తప్పుడు ఫొటో పంపిన చిన్నతప్పునకు తిరస్కరిస్తావా? అని ప్రశ్నిస్తూ ఆమె రాసిన లేఖ ఆ కేసు నుంచి నన్ను బయటపడేసింది.

ప్రేమించ లేదు.. కామించనూ లేదు

ఆమె అబద్ధం చెప్పకుంటే ఆమెతో తిరిగేవారా?

ఔను. ఇష్టపడి వచ్చినఅమ్మాయితో తిరక్కపోతే లోపంఉన్నట్లే.

మీ జీవితంలో అత్యంత దారుణమైన కాలం ఏమిటి?

రెండు నవలలతో బాగా పాపులర్‌ అయిన తరువాత తక్కువ కాపీలు అమ్ముడయ్యే నవల కోసం కష్టపడి రాయాలా? అన్న భావనతో రాయలేదు. ఆ సమయం అత్యంత దారుణం. తర్వాత పట్టాభిరామ్‌ సలహాతో పర్సనాలిటీ డెవెలెప్‌మెంట్‌ వైపు వచ్చాను.


మీరు బాగా ఆవేదన చెందినదెప్పుడు?

ఎస్‌ఎఫ్‌సీలో పని చేస్తున్నప్పుడు, చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. నా జీవితం రూ.450. పండక్కి మా అమ్మ ఒక వంద ఎక్కువిమ్మని అడిగితే, ఇంట్లో నుంచి పోతానంటే పోనివ్వరని అరిచాను. నాన్న కళ్లలో తడి చూశాను. అదే అత్యంత దారుణమైన సంఘటన.


లంచమంటే మీకెందుకంత విముఖత?

మా నాన్నగారు ఇన్‌కంటాక్స్‌లో పని చేస్తుండగా, ద్రాక్షతోటల దగ్గరకు తనిఖీలకు వెళ్లేవాళ్లం. ఈయన ప్రశ్నలకు తట్టుకోలేక వారు రెండు ద్రాక్షపళ్ల బుట్టలిచ్చే వారు. వెనకాల తిట్టుకునే వారు. బహు శా అప్పుడు కలిగి ఉండవచ్చు.


ప్రాక్టీస్‌ ద్వారా జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చా?

సాధ్యమే. నా తాతగారి గారాబం వలన ఆరు, ఏడు తరగతులు ఒక్కోసారి ఫెయిలయ్యాను. మా నాన్నగారు నాచేత లెక్కలు, ఇంగ్లిష్‌ ప్రాక్టిస్‌ చేయించారు. అప్పుడు మొదలుపెట్టిన సాధన వలన సీఏను మూడేళ్లలోనే పాసయ్యాను.


మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?

నా కథ చందమామలో వచ్చినప్పుడు..ఒకాయన ‘పొట్టివాడివైనా బాగా రాశావు’ అని మెచ్చుకున్నారు. దాంతో పొట్టివాడినన్న న్యూనతా భావం పోయింది.


ఇంగ్లిష్‌ నవలలు తెలుగులో రాస్తున్నారన్న విమర్శ ఉంది?

తులసిదళం, ప్రార్థన వంటి నాలుగైదు పుస్తకాల ఇతివృత్తాలు ఇంగ్లిష్‌ పుస్తకాల నుంచి తీసుకున్నా. మిగిలినవన్నీ సొంత నవలలే.


మీకు ఇష్టమైన పని? తదుపరి లక్ష్యం ? సంతోషం కలిగించిన విషయం?

ఇప్పుడు సరస్వతి విద్యా పీఠాన్ని నడపడమే. పర్సనాలిటీ డెవెలప్‌మెంట్‌ క్లాసులు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అందుకే ఇంగ్లిష్‌ నవలలు రాద్దామనుకుంటున్నాను. చాలెంజ్‌ సినిమా రిలీజయినప్పుడు వైజాగ్‌లో చిరంజీవికంటే నా కటౌట్‌ పెట్టారు. అది చాలా సంతోషం కలిగించింది.


మీ హృదయంలో ఎంత మంది చెలులు ప్రవేశించారు?

నాకు ప్రేమ లేదు. నా భార్య పట్ల కృతజ్ఞతా భావం ఉంది. ప్రేమిస్తే వారిని తప్పితే ఎవరినీ చూడకూడదు. అందుకనే ప్రేమించ లేదు. నేను ఎవరినీ కామించలేదు. సినిమా ఫీల్డ్‌లోనూ అంతే. నాకు ఈగో కొద్దిగా ఎక్కువ. నేను స్ర్తీని ప్రేమించలేదు.. స్ర్తీత్వాన్ని ప్రేమిస్తాను అని అమితాబ్‌ చెప్పిన విషయాన్ని నమ్ముతాను.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.