ఎన్టీఆర్‌ పేరు మార్పు అనైతికం

ABN , First Publish Date - 2022-09-29T06:09:34+05:30 IST

హెల్త్‌ యూనివర్సీటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును మార్పు చేయడం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

ఎన్టీఆర్‌ పేరు మార్పు అనైతికం
ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు

సీఎం జగన్‌ మూర్ఖత్వానికి ఇది నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్లలో ర్యాలీ, నిరాహార దీక్ష 


పిడుగురాళ్ల, సెప్టెంబరు28: హెల్త్‌ యూనివర్సీటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును మార్పు చేయడం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా బుధవారం పిడుగురాళ్లలో, భారీ ర్యాలీ అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రాబ్యాంకు సెంటర్‌మీదుగా తిరిగి పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఐలాండ్‌సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కొందరు మహనీయుల పేర్లను వారి సేవలకు గుర్తుగా సంస్థలకు పెట్టడం సంప్రదాయంగా వస్తుందని  అన్నారు. జగన్‌ ప్రభుత్వం ఉన్న పేర్లు తొలగించి తండ్రిపేరు పెట్టుకోవటం సంప్రదాయ విలువలు దిగజారిపోయేలా చేశాడన్నారు. మూడేళ్లలో ఒక్క పరిశ్రమ రాకపోగా రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరుద్యోగ యువత జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని యరపతినేని తెలిపారు. 

జానపాడు రోడ్డులో తలపెట్టిన నిరాహారదీక్షకు పోలీసులు  తొలుత అనుమతి నిరాకరించారు. ర్యాలీకి కూడా పోలీసులు పలు ఆంక్షలు విధించినా పల్నాడు నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులతో కలసి యరపతినేని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిరాహార దీక్ష సాయంత్రం వరకు సాగింది. దీక్ష శిబిరంలో యరపతినేనితో పాటు పాండురంగ శ్రీను, పణితి రవి, సయ్యద్‌ అమీర్‌ఆలి, వేముల వినోద్‌రెడ్డి, వడ్డవల్లి సర్వేశ్వరరావు, యడ్లపల్లి నారాయణ, వడ్డవల్లి సాంబశివరావు, బద్రి, తంగెళ్ల శ్రీను, జొన్నలగడ్డ శ్రీను, పిల్లి చెన్నారావు, ఎల్‌వీఆర్‌, పాదర్తి రాజేశ్వరి, వెంకటరమణ, నర్రా పుల్లయ్య, తిరుమలకుమార్‌, మందా డేవిడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T06:09:34+05:30 IST