రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది..!

ABN , First Publish Date - 2021-05-09T05:45:36+05:30 IST

రాష్ట్రంలో నియంత పాలన సోగుతోందని టీడీపీ సీనియర్‌ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది..!

యరపతినేని శ్రీనివాసరావు


గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నియంత పాలన సోగుతోందని టీడీపీ సీనియర్‌ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. సీఎం జగన్‌రెడ్డి పాలన హిట్లర్‌ పాలన మరిపించేటట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారికి ఆక్సిజన్‌, కనీసం బెడ్లు కూడా దొరకడం లేదన్నారు. మృత్యువాత పడితే శ్మశానంలో స్థలం కూడా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతిపక్షనేతగా చంద్రబాబు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ఉదహరిస్తూ సూచనలిస్తే ఆయనపై కేసులు పెట్టడం దారుణమన్నారు.  చంద్రబాబును మొదలుకొని మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులపై అందరి మీద ఇష్టానుసారం కేసులు పెట్టి జైలుకు పంపటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆయన శాశ్వత ముఖ్యమంత్రి కాదన్న సంగతి జగన్‌ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న సంస్థలు అమరాజా బ్యాటరీస్‌, జువారి సిమెంట్‌ ప్యాక్టరీలపై కక్షసాధింపు చర్యలు దిగటమేమిటని నిలదీశారు. 40సంవత్సరాల చరిత్ర ఉన్న సంగం డెయిరీని, దాని చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను వేధించటం వేనుక కుట్ర లేదా అని ప్రశ్నించారు. అమూల్‌ సంస్థకి సంఘంను అప్పజెప్పాలన్న మీ ప్రయత్నాని ఏమనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే రూ.16వందల కోట్లతో టీకాలు కొని ప్రజలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం జగన్‌దన్నారు. భవనాలకు పార్టీ రంగులు వేయటానికి మాత్రం రూ.3వేల కోట్ల ఖర్చు చేస్తారా అంటూ నిలదీశారు.  అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ ఎప్పుడూ ప్రజల ప్రక్షణ ఉంటుందని... పోరాటం కొనసాగిస్తుందని యరపతినేని స్పష్టం చేశారు.  

Updated Date - 2021-05-09T05:45:36+05:30 IST