వైశ్రాయ్ హోటల్ వ్యవహారం.. రాష్ట్రం కోసం.. తెలుగుజాతి కోసమని నమ్మా..

ABN , First Publish Date - 2020-02-07T22:06:18+05:30 IST

ఎన్నో హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించి ఆ రచయితలను తెలుగు ప్రజలకు చేరువ చేశారు. తెలుగు వాళ్లు రాసిన హిందీ కవిత్వం ఉత్తర భారతీయులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

వైశ్రాయ్ హోటల్ వ్యవహారం.. రాష్ట్రం కోసం.. తెలుగుజాతి కోసమని నమ్మా..

ఆ విషయంలో పశ్చాత్తాప పడను.. అదే జరగకుంటే కుక్కలు చింపిన విస్తరయేది

ఆయన చివరి ఏడాదిలో కొన్ని అకృత్యాలు.. జరుగుతోంది తప్పని చెప్పా..

ఏ కోడలు.. కూతురు సేవ చేస్తుంది? అని ఎన్టీఆర్ అడిగారు

హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వమన్నా.. నీకు తెలియదులే అన్నారు..

సభలకు పిలిచా.. చంద్రబాబు రాలేదు.. కనీసం సందేశం కూడా పంపలేదు

తెలుగు భాష విషయంలో ఎన్టీఆర్‌ను మెచ్చుకోవాల్సిందే..

అమెరికాలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడనని చెప్పేశా

హిందీ రాకుండా జాతీయస్థాయిలో ఏ రంగంలోనూ రాణించలేరు

మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటుందని అమితాబ్ అన్నారు

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్


ఎన్నో హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించి ఆ రచయితలను తెలుగు ప్రజలకు చేరువ చేశారు. తెలుగు వాళ్లు రాసిన హిందీ కవిత్వం ఉత్తర భారతీయులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తామరాకు మీద నీటిబొట్టులతా తన జీవనయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆయనే ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. రాజ్యసభ సభ్యునిగా పనిచేసి, ప్రస్తుతం సెంట్రల్ హిందీ కమిటీ నాన్ అఫిషియల్ మెంబర్‌గా కొనసాగుతున్న ఆయనతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. 17-12-2017న నిర్వహించిన ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం కోసం సంభాషించారు.

 

ఆర్కే: చాలాకాలం తరువాత మళ్లీ ఇలా కలిశాం. ఎలా ఉంది?

యార్లగడ్డ: ఆంధ్రజ్యోతి ప్రాంగణంలోకి వస్తే సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది.


ఆర్కే: రకరకాల ప్రయాణాలు చేసి చివరకు సర్వసంగపరిత్యాగి అయిపోదామనే దశకొచ్చారా...?

యార్లగడ్డ: నాలుగైదేళ్లుగా ఏబిఎన్‌ వాళ్లు వెంటపడుతూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించింది ఏమిటంటే ఈ సీట్లో కూర్చోనేందుకు అవసరమైన మానసిక పరిణితి మనకు ఉన్నాయా లేవని ప్రశ్నించుకుంటే నాలో కొంటెతనం, పచ్చిదనం ఇంకా మిగిలే ఉంది. అవన్నీ పోయిన తరువాత మర్యాదగా కూర్చోవాలనే ఉద్దేశంతోనే ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చా.

 

ఆర్కే: ఇప్పుడన్నీ పోగొట్టేశారా?

యార్లగడ్డ: కొన్నేమో సహజంగా వయసుని బట్టి పోయాయు. కొన్నేమో నేను వదిలించుకున్నా. భాషాభిమానం, రాజకీయ జిజ్ఞాస ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ఒక్కటే మాట చెప్పా. ఆరాట రాజకీయాలు లేవు నాకు పోరాట రాజకీయం తప్ప అని. ఒక మంచి విషయంపైనే పోరాటం చేస్తాను. అందుకే 2002 రాజ్యసభ పదవి పూర్తయినా నన్ను ఇంకా గౌరవంగా చూస్తున్నారు.

 

ఆర్కే తెలుగు సాహిత్యం పట్ల అభిమానం ఉన్న వారు ఆ రంగంలో ఎదగాలని చూస్తుంటారు. మీ విషయానికొస్తే తలలో నాలుకలా ఉంటారు. జనరల్‌గా చెప్పాలంటే అంటించుకున్నట్టుగా ఉండరు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. అదెలా వచ్చింది?

యార్లగడ్డ: నేను పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఆంతరంగిక భద్రతా చట్టం కింద ముషీరాబాద్‌ జైలులో రెండు నెలలు ఉన్నా. వెంకయ్యనాయుడుగారు, హరిబాబు, నేను ఒకే సెల్‌లో ఉన్నాం. నాదీ హరిబాబుది ఒకే వయసు. నాయుడుగారు మూడేళ్లు పెద్ద. అప్పటికే ఆ ఉద్యమంలో తెన్నేటి విశ్యనాథంగారు, సర్దార్‌ గౌతులచ్చన్న గారు, సుంకరి సత్యనారాయణగారున్నారు. వాళ్ల సహచర్యం లభించడం వల్ల ఒకవిధమైనటువంటి పరిణితి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి నాయకులందరూ ఒకవైపు, కాంగ్రెసేతర విద్యార్థి నాయకులందరూ ఒక వైపు ఉండేవారు. అదృష్టం కొద్దీ నేను కాంగ్రెసేతర విద్యార్థులవైపు ఉన్నాను. అప్పటికే వెంకయ్యనాయుడు, హరిబాబుగారు యూనివర్సిటీ లీడర్స్‌. నేను గుడివాడ యూనివర్సిటీ సంఘానికి అధ్యక్షున్ని. అలా ఒకవిధమైన ఒరవడిలోకి వెళ్లిపోయా. తరువాత జయప్రకాశ్‌నారాయణ ఉద్యమం రావడం జరిగింది.

 

ఆయన ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన సంఘర్షణ సమితి అని 1974 ఎమర్జెన్సీ సమయంలో ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడుగారు దానికి కన్వీనర్‌. దాంట్లో ఉన్న తొమ్మిది మంది సభ్యుల్లో నేనొకరిని. అప్పటికే ఈ పెద్దలందరితో తిరగడం, నా ఎస్‌ఎస్‌ఎల్‌సి అయిపోయే సమయానికే మా నాన్నగారు బి.ఎతో సమానమైన ‘రాష్ట్ర భాషా ప్రవీణ’ అనే పరీక్షను రాయించారు. దాంతో ఆంధ్రోద్యమం సందర్భంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటువంటి వాజ్‌పేయిగారు, అద్వానీగారు, చరణ్‌సింగ్‌, లాడ్‌లీ మోహన్‌ వంటి నాయకులెవరు వచ్చినా, వాళ్లు చేసే హిందీ ప్రసంగాన్ని నేను తెలుగులో అనువదించే వాణ్ణి. చిన్న వయసులోనే పెద్దల సాంగత్యం లభించడం వల్ల తప్పులు చేయకుండా వ్యవహరం నడిచింది. అప్పుడప్పుడు నేనేమైనా చిలిపి పనులు చేసినా వెంకయ్యనాయుడుగారు ట్రిమ్‌ చేసేవారు. ఆప్యాయంగా మందలించేవారు. వీళ్లందరితో ఉండటం వల్ల చిన్నతనంలోనే పెద్దరికం వచ్చేసింది.

 

1985లో యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే నా జీవితం మలుపు తిరిగింది. క్రమశిక్షణకు పునాది వేసిన వాళ్లు వెంకయ్యనాయుడు, హరిబాబు అయితే నా జీవితం మలుపు తిరగడానికి కారణం ముగ్గురు హిందీ మాస్టర్లు. ఒకరు గుడివాడ ఆంధ్రా నలందలో పనిచేసిన వెంకటసుబ్బారావుగారు, రెండో వ్యక్తి బండ్లమూడి ఆంజనేయులుగారు గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో విభాగ అధ్యక్షునిగా ఉన్నారు. మూడో వ్యక్తి డాక్టర్‌ ఆదేశ్వర్‌రావుగారు. ఆయన భైరాగి గారికి శిష్యుడు. భైరాగి గారు హిందీ చందమామకు ఎడిటర్‌. ఆదేశ్వర్‌రావుగారు నాకు హిందీ లిటరేచర్‌ పట్ల ఉన్న ప్రేమను చూసి సాహిత్యపు రుచి చూపించారు. అప్పటి నుంచి వ్యాసాలు రాయడం, పుస్తకాలు రాయడం మొదలయింది.

 

నేను గమనించింది ఏంటంటే హిందీ రంగంలో ఉండి రచనలు చేసిన వారున్నారు. పుల్లయ్యగారు, ఆదేశ్వర్‌రావుగారు, సుందర్‌రెడ్డిగారు, దుర్గానంద్‌గారు, రాపర్తి సూర్యనారాయణగారు....ఇలా తెలుగు వాళ్లంతా హిందీ అధ్యయనం చేసి హిందీలో రచనలు చేసేవారు. కవిత్వాలు రాసేవారు. అయితే ‘దోభీ కా కుత్తా, నా ఘర్‌ కా నా ఘాట్‌కా’ అన్నట్లుగా రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి ఉండేది. ఇంటి పక్కవాళ్లకు ఏం రాస్తారో తెలియదు. ఎందుకు రాస్తారో తెలియదు. ఉత్తర భారతంలో వీళ్ల సాహిత్యాన్ని నెత్తిన పెట్టుకోవట్లేదు. మరి ఏం చేయాలి వీళ్లు. మనం కూడా ఈ మార్గంలోకి వెళ్లిపోతే మన పని కూడా అలాగే అవుతుందని అనిపించింది. దీంట్లో నుంచి బయటపడటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు మంచి ఆలోచన తట్టింది. మనం అవసరానికి తగినటువంటి సాహిత్యాన్ని సృష్టించాలి. అదే విధంగా ‘ఆదాన్‌ ప్రదాన్‌’ అనే కార్యక్రమాన్ని కొద్ది కొద్దిగా మోటూరి సత్యనారాయణగారు మొదలుపెట్టారు. దాన్ని నేను మాస్టర్‌ చేశాను. ‘ఆదాన్‌ ప్రదాన్‌’ అంటే ఇచ్చి పుచ్చుకోవడం. తెలుగువాళ్లకు అవసరమైనటువంటి హిందీ సాహిత్యాన్ని ఇటు తీసుకురావడం, అదే విధంగా తెలుగు వాళ్లు రాసిన పుస్తకాలను అటు తీసుకెళ్లడం.


ఆర్కే: లౌక్యంగా వెళ్లారన్నమాట?

యార్లగడ్డ: అంతే. తరువాత ఎంత బాధేస్తుంది అంటే... భైరాగి, ఆదేశ్వర్‌రావుగారు రాసిన అద్భుతమైన హిందీ కవిత్వం రాశారు. అది ఉత్తర భారతంలో వినిపిస్తే చాలా బాగుంది అంటారు. రాసిన వాళ్ల పేరు చెప్తే తెలుగు వాళ్లు రాసిందా! అని నిట్టూరుస్త్తారు. మా గురువుగారు ఆదేశ్వర్‌రావుగారు బెల్జియంలో ఉన్న సమయంలో వాజ్‌పేయి గారు పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా రెండు రోజులు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. పార్లమెంటులో విపక్ష నాయకుడు, మంచి కవి. ఆయనను ఎంటర్‌టైన్‌ చేయాలంటే ఎవరిని తీసుకురావాలని ఆలోచిస్తున్న సమయంలో అక్కడే కవిగారున్నారని తెలిసి మా గురువుగారిని పిలిపించడం జరిగింది. ఆయన కవిత్వం విని వాజ్‌పేయి చాలా మెచ్చుకున్నారు. తరువాత గురువుగారు నన్ను వాజ్‌పేయికి పరిచయం చేశారు.

 

ఆర్కే: ఆంధ్రా వాళ్లకు హిందీ మీద అంత ఆసక్తి ఉండేది కాదు కదా!

యార్లగడ్డ: దక్షిణ భారతదేశంలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లే హిందీ ఎక్కువ చదువుకున్నారు. దానికి కారణమేమిటంటే గాంధీ గారు రచనాత్మక కార్యక్రమాల్లో హిందీని ప్రచారం చేయడం ఒక అంశంగా చేర్చారు. అప్పుడు హిందీని వయోజన విద్య ద్వారా నేర్చుకోవడం మొదలయింది.



ఆర్కే: ఎన్టీఆర్‌కు హిందీ ఎంత వరకు నేర్పారు?

యార్లగడ్డ: ఆయనకు నేను నేర్పలేదు. ఆయన హిందీ నేర్చుకోవడంలో సహాయపడ్డాను అంతే. అప్పుడు కూడా కొంత మంది ‘రామారావుగారికి హిందీ నేర్పుతున్నారట కదా’ అని అడిగితే ఇదే మాట చెప్పాను.


ఆర్కే: ఎన్టీఆర్‌ మామూలుగానే ముక్కోపి కదా... మీరు హిందీ గురించి గాంభీర్యంగా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయనెప్పుడన్నా కోప్పడ్డారా?

యార్లగడ్డ: లేదు... లేదు. జస్టిస్‌ చలమేశ్వర్‌గారు రామారావుగారికి అడ్వకేట్‌గా ఉండేవారు. ఆయన తరచూ ఎన్టీఆర్‌ దగ్గరికి వస్తూవుండేవారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన పొజిషన్‌లో ఉన్న నాయకుడు... ‘‘ఏంటీ... మీరిద్దర్నీనేమో ‘కూర్చోండి వెళ్లద్దు వెళ్లద్దు’ అంటారు. మేమెవరన్నా వెళ్లగానే బెల్లు మీద చెయ్యి వేస్తారారేంటి’’ అని అడిగారు. నేను నవ్వేసి ఊరుకున్నా. కానీ జస్టిస్‌ చలమేశ్వర్‌ గారు... ‘ఏమీ లేదు. రామారావుగారు చాలా తెలివైనవారు. మా ఇద్దరి దగ్గరా ఏదో ఉందనుకుని, వీళ్లతో కూర్చొంటే వీళ్ల దగ్గరుంది ఏదో కొంచెం లాగేసుకోవచ్చు అనుకుంటారు. మీరెళితేనేమో ఆయన దగ్గరున్నది లాగేసుకుంటారనుకుని బెల్లు మీద చెయ్యేస్తారు’ అని చెప్పారు.

  

రామారావుగారికి... ‘హిందీ అనర్గళంగా మాట్లాడకుండా మనం ఏమీ చేయలేము. మీరు ఇన్ని పౌరాణిక చిత్రాల్లో నటించినా ఇంత గొప్ప పేరు ఉత్తర భారతదేశంలో తెలియడం లేదు’ అని చెప్పాను. అయితే ‘ఏం చేయాలి’ అని అడిగారు. ‘మీ చిత్రాలు హిందీలోకి డబ్బింగ్‌ చేసి ఉత్తరాదిలో వదిలితే మంచి ఇమేజ్‌ వస్తుంది’ అని సూచించాను. నేనొచ్చిన తరువాత రాజస్థాన్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, పాట్నాల్లో ఎన్నికలొచ్చాయి. అప్పుడు నన్ను స్పీచ్‌లు రాయమన్నారు. పాట్నా వెళ్లినప్పుడు ‘‘ఇసీ పాట్నాకే గాంధీ మైదాన్‌మే 1942మే లోక్‌నాయక్‌ జయ్‌ప్రకాశ్‌జీ నే రామ్‌ధారీ సింగ్‌ దినకర్‌కీ కవితా ‘జనతా ఆతీ హై సింఘాసన్‌ ఖాళీ కరో’ అని రాసిచ్చాను. అది రామారావుగారు మాట్లాడగానే... మైదానంలోని జనమంతా చప్పట్లు కొట్టారు. మరసటి రోజు హిందీలో వచ్చిన పేపర్‌ క్లిప్పింగ్స్‌ అన్నీ చూపించి, వాటేసుకుని ‘చాలా సంతోషంగా ఉంది బ్రదర్‌’ అన్నారు.

 

ఆర్కే: కానీ... ఆయనకు హిందీ చదవడం రాదుగా! మరి పేపర్‌లో క్లిప్పింగ్స్‌ ఎలా చూశారు?

యార్లగడ్డ: లేదు... లేదు... అప్పటికి ఆయనకు హిందీ చదవడం వచ్చేసింది. ఆయనకు అంతులేని ఆత్మవిశ్వాసం కదా! కానీ... హిందీపై ఆయనకు మక్కువ. రాజకీయాల్లోకి రాకముందు కూడా ‘తల్లా పెళ్లామా’ వంటి సినిమాల్లో మహ్మద్‌ రఫీని పిలిపించి హిందీలో పాటలు పాడించడం, డైలాగ్స్‌ చెప్పించడం చేస్తుండేవారు. పొద్దున్నే ఐదు గంటలకు కింద ఫోన్‌ మోగేది. నేను ఫోన్‌ తీయగానే... ‘బ్రదర్‌... పైకి రండి’ అని పిలిచేవారు. అక్కడ కూర్చొని పాఠం చదువుకోవడం... ఆరు గంటలకు ఆయనతో పాటు టిఫిన్‌ చేయడం... అలా 4 సంవత్సరాల 3 నెలలు సాగింది.

 

ఆర్కే: అందిట్లో ఎన్టీఆర్‌తో సంబంధాలంటే కత్తి మీద సాములాంటిది కదా!

యార్లగడ్డ: అవునవును... ఆయన నన్ను చాలా గౌరవంగా చూసేవారు.


ఆర్కే: కానీ అప్పుడు పదవులేమీ పొందలేకపోయారు ఎందుకని?

యార్లగడ్డ: నేను ఆయన దగ్గరికి పదవి కోసం వెళ్లలేదు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను హిందీ అకాడమీ సభ్యుడిగా నియమించారు. అప్పటికి నేనెవరో ఆయనకు తెలియదు. నార్ల వెంకటేశ్వరరావు కమిటీ ఇచ్చిన రిపోర్టు చూసి నన్ను వేశారు. మళ్లీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ప్రారంభించినప్పుడు నా కోసం కబురు పెట్టారు. నేను రానని చెప్పాను. ఆయన సీఎంగా దిగిపోయిన తరువాత మొట్టమొదటి రోజు ఢిల్లీలో కలిశా. నన్ను చూసి... ‘మేం రమ్మంటే మీరు రాలేదు కదా’ అన్నారు. ‘సార్‌... క్షమించాలి. నందమూరి తారకరామారావు గారు నా అభిమాన నటుడు. అధికారంలో ఉన్న రామారావు నీళ్లల్లో ఉన్న మొసలి లాంటి వాడు. అడవిలో ఉన్న సింహం లాంటివాడు. అప్పుడు మీకు ఏది చెప్పినా ఇబ్బంది అవుతుంది. నాకేమో నోటి దురద ఎక్కువ. అందుకనే ఇప్పుడు వచ్చాను సార్‌’ అన్నాను. ఆయన పకపకా నవ్వారు.

 

నాలుగున్నర సంవత్సరాలు ఒక్క శని, ఆదివారాలు తప్ప మిగతా రోజులన్నీ ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన పక్కనే ఉండేవాడిని. ఆ చివరి సంవత్సరంలో కొన్ని అకృత్యాలు జరిగిపోయాయి. అప్పుడొక మాటన్నాను... ‘జరుగుతోంది తప్పండీ’ అన్నాను. సహించారు. మోహన్‌రెడ్డి ఉండగా కూడా ఇదే రిపీట్‌ చేశాను. అందుకాయన... ‘ఏం బ్రదర్‌ ఏం చెబుతారు మీరు! యూ ఆర్‌ మై ఫ్రెండ్‌. అన్నం తినలేను. వీపు తోముకోలేను. ఏ కోడలు చేస్తుంది? ఏ కూతురు చేస్తుంది? ఎవరు చేస్తారు? కానీ... యూ ఆర్‌ మై ఫ్రెండ్‌’ అన్నారు. అలా లక్ష్మణ రేఖ దాటి వెళ్లాను.


ఆర్కే: నాతో కూడా ఎగ్జాక్ట్‌గా అవే పదాలు వాడారు.

యార్లగడ్డ: అది తిరుగులేని మాట కదా! ఇంక మనమేమంటాం!


ఆర్కే: ఆ క్రైసిస్‌లో ఆయన్ని వదిలి రావడానికి మీ మనసు బాధ పడలేదా?

యార్లగడ్డ: రామారావు గారిని 1993లో అమెరికాలో జరిగిన కాన్ఫరెన్స్‌కు నల్లమోతు సత్యనారాయణ గారు తీసుకెళ్లారు. అప్పుడు అక్కడికి చిరంజీవి గారు కూడా వచ్చారు. 13 రోజులు ఆయన్ని అమెరికాలోని కాజా రామారావు ఇంట్లో ఉంచి, రోజూ సెయింట్‌ లూక్స్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లి అన్ని టెస్టులూ చేయించారు.


 ఇప్పటికి కూడా ఆ మెడికల్‌ రిపోర్టు కాజా రామారావు ఇంట్లో భద్రంగా ఉంది. అప్పుడు ఆయన ఆరోగ్యం గురించి వాళ్లు చెప్పింది... ‘వచ్చే మనిషిని సరిగ్గా చూడలేరు. హేజ్‌గా ఉంటుంది. ఆయన పక్కన ఎప్పుడూ ఒకళ్లు ఉండి జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు.

అందుకే వైశ్రాయ్‌ హోటల్‌ వ్యవహారమంతా రాష్ట్ర కోసం, తెలుగు జాతి కోసం చేశారనే నమ్మకం నాకప్పుడుంది. ఆ విషయంలో పశ్చాత్తాప పడను. ‘కుక్కలు చింపిన విస్తరి’లా పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో చేశాను.ఎవర్నయితే చేద్దామనుకున్నానో ఆయనే సమర్థుడు, యోగ్యుడని నమ్మి చేశాను. అతన్ని ఎందుకు చేయాలని చాలా మంది నన్ను తిట్టారు కూడా. ఏది ఏమైనా నేను ఆ రోజు అనుకున్నది కరెక్ట్‌.

 

ఆర్కే: అందుకు చంద్రబాబు మీకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు కదా? మరి ఎందుకు మీ ఇద్దరి మధ్యా తగాదా వచ్చింది? మిస్టరీ ఏంటి?

యార్లగడ్డ: లేదు... లేదు... చంద్రబాబునాయుడు గారు చాలా తెలివిగలవారు. రాజ్యసభ సీటు ఆయన నాకు ఇవ్వలేదు. ‘వీడు మనకు సేవ చేసున్నాడు. వీడికిస్తే మనకి, పార్టీకీ మంచిదని’ హరికృష్ణ పట్టుబడితే చంద్రబాబు ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు నాకు అన్యాయం చేశాడని నేనెప్పుడూ మాట్లాడలేదు. ఎంతో నిజాయితీగా పని చేసి... ఆయనకు లాయల్‌గా ఉన్నాను. అయితే హరికృష్ణ గారికి రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వమని అడిగాను. ‘నీకు తెలియదులే.. చాలా ఉన్నాయి. అయినా నీకు దగ్గరా... నాకు దగ్గరా మా బావమరిది’ అంటూ ఏవో ఆర్గ్యుమెంట్లు జరిగాయి. ‘అయ్యా నేను ఆయన కృతజ్ఞుడిని. ఆయన మంత్రి పదవి లేకుండా ఖాళీగా కూర్చొని నేను కొనసాగడం మర్యాదగా లేదు’ అన్నాను. ‘లేదు లేదు మీకు హిందీ వచ్చు. పది మందితో పరిచయాలున్నాయి. నిన్ను రాజ్యసభలో లీడర్‌ని చేస్తాను’ అని చెప్పారు. ‘సార్‌... మీరు హరికృష్ణను మంత్రిని చేయండి. నేనొచ్చి పార్టీ ఆఫీసు ఊడవమన్నా ఊడుస్తా. లేదంటే నాకేమొద్దు. నేనిట్టా ఉంటా’ అన్నాను. అలా ఇద్దరి మధ్యా గ్యాప్‌ వచ్చేసింది. నేను ఆయన్ని నమ్మను. నన్ను ఆయన నమ్మడు! (నవ్వుతూ)

 

ఆర్కే: నమ్మనంత ఏం చేశారు?

యార్లగడ్డ: ఆయనకి అభద్రదతా భావం ఎక్కువ. వీడు ఎక్కడి నుంచైనా ఏదైనా చేసేస్తాడని భయం. ఏదేమైనా నేనెప్పుడూ నేల విడిచి సాము చేయలేదు.

 

ఆర్కే: సో... మీ ఇద్దరి మధ్యా ఆ గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోంది!

యార్లగడ్డ: నాకూ... ఆయనకూ చెట్టు కాడ.. పుట్ట కాడ తగాదేం లేదు.

 

ఆర్కే: ఏం లేదు కానీ... మధ్యలో కొంచెం మీరు రాజకీయాల వైపు ఊగారు కదా!

యార్లగడ్డ: లేదు లేదు. నా పార్లమెంటు సభ్యత్వం అయిపోయిన తరువాత నేరుగా యూనివర్సిటీకి వెళ్లి పాఠాలు చెప్పాను. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తరువాత నన్ను పిలిచి ‘హిందీ అకాడమీ చైర్మన్‌గా ఉండు’ అన్నారు. ‘సార్‌... నన్ను రాజకీయంగా చూడకూడదు’ అని చెప్పాను. ‘నో క్వశ్చన్‌... యూ ఆర్‌ మై ఫ్రెండ్‌’ అన్నారు. ఏడాదిన్నర తరువాత బైఎలక్షన్‌ వచ్చి ద్రోణంరాజు శ్రీనివాస్‌ నిలబడ్డారు. ఆయన నన్ను అక్కడ ప్రచారం చేయమని వైఎస్‌ని అడిగితే... ‘తనను రాజకీయంగా చూడొద్దని అతను నాకు చెప్పాడు. మీరు కావాలంటే మాట్లాడుకోండి’ అన్నారు. అట్లా నా పని నేను చేసుకున్నాను తప్ప ఏ రాజకీయ పార్టీ వైపు వెళ్లలేదు.

 

అయితే 2014లో ఎన్నికలప్పుడు... ఒక మంత్రి, నాకు సన్నిహితుడు, స్వర్గీయుడైన నాయకుడి కొడుకు పోటీ చేస్తుంటే నన్ను అప్రోచ్‌ అయ్యారు. చెయ్యాల్సింది చేసి పెట్టాను. మళ్లీ ఈయన (చంద్రబాబునాయుడు)తో నాకు ఎక్కడ తగాదా వచ్చిందంటే... ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ బెజవాడలో పెట్టినప్పుడు నేను ఈయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చాను. వస్తానన్నారు. ఢిల్లీలో ఓ మ్యారేజ్‌ రిసెప్షన్‌లో కలిసినప్పుడు మళ్లీ ఇచ్చి, దాని గురించి వివరంగా చెప్పా. కానీ... ఈయన రాలేదు. కనీసం సందేశం కూడా పంపలేదు.

 

ఆర్కే: సమాజంలో తెలుగు భాషపై చిన్న చూపు కనిపిస్తోంది. దాన్లోనే పరివర్తన తీసుకురావడానికి ముందు ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం!

యార్లగడ్డ: నూటికి నూట యాభై శాతం కరెక్టు. నేనదే చెబుతుంటాను... ‘ప్రభుత్వానిదే బాధ్యత కాదు... ప్రజలది కూడా’ అని! తమిళనాడు, కర్ణాటకల్లో వాళ్ల వాళ్ల మాధ్యమాల్లో చదివిన వారికి 20 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. నాలుగు వేల మున్సిపల్‌ పాఠశాలలను ఒక్క కలం పోటుతో ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నారు. నేను చెప్పేదొక్కటే... ‘మా పిల్లలకు తెలుగు కూడా నేర్చుకొనే అవకాశం కల్పించండి. నేను ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదు’ అని. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా పెడితే అప్పుడు చదువుకొంటారు.

 

ఆర్కే: రెండు రాష్ట్రాల్లో జీవోలిచ్చారు. అమలు చేస్తారో లేదో చూద్దాం..!

యార్లగడ్డ: ఏపీలో చెయ్యరు. ఎందుకంటే... ‘కాపురం చేసే కళ కాళగులనాడే కనపడుతుందని’ ఆ జీవోలు ఇష్యూ చేయమని గంభీరోపన్యాసం చేసిన ముఖ్యమంత్రిగారు... ఆ తరువాత తట్టుకోలేకపోయారు. ‘వాళ్లేమో అక్కడ నిరాహార దీక్షకు కూర్చున్నారు.. వీళ్లేమో ఇక్కడ పిచ్చి కేకలేస్తున్నారు... ఒక పక్కనేమో తెలుగు మహాసభలంటున్నారు... మెడలొంచి నాతో జీవోలు ఇప్పిస్తారా’ అని! ఎందుకు అమలు చేయరని చెబుతున్నానంటే... నామ, శిలా ఫలకాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో ఉండాలని 9 నెలల కిందట ఆ జీవో ఇచ్చారు. కానీ, అధికారులు... జీవో ఇచ్చిన ముఖ్యమంత్రినే తీసుకువెళ్లి ఇంగ్లిష్‌లో ఉన్న శిలాఫలకాలను ఆవిష్కరింపజేసేస్తున్నారు. అన్నింటినీ మించి ఏపీలో కనక దుర్గమ్మ వారధి నుంచి అమరావతికి వెళ్లే ప్రధాన రోడ్డులో చూస్తే ఒకవైపు ‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌’ అని పెద్ద పెద్ద ఇంగ్లిష్‌ అక్షరాల్లో ఉంటుంది. ఇటు తిరిగితే... ‘వేటూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ... వేటూ ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌’ అని రాసి ఉంది.


ఆర్కే: ఆ విషయంలో ఒక్క ఎన్టీఆర్‌నే మెచ్చుకోవాలి. ఆయన అన్నీ తెలుగు పదాలే పెట్టేవారు.

యార్లగడ్డ: ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలకు ‘తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం’ అని పెట్టారు ఆయన.


ఆర్కే: మీ పెన్ను నుంచి వచ్చిన ‘ద్రౌపది’ నవల చాలా వివాదాస్పదమైంది కదా! కొంత మంది ఆడవాళ్లయితే తిట్టేశారు కూడా!

యార్లగడ్డ: వాళ్లందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఆ దెబ్బతో నేను ఇప్పుడు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌లు వెళుతుంటే... ‘ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత’ అని బ్యానర్లు కడుతున్నారు. ఈ నవలను విమర్శించిన వారిలో సగం మంది దాన్ని చదవనే లేదు. ముందు మాటలో చాలా స్పష్టంగా ‘‘వీఎస్‌ ఖేండేకర్‌ మరాఠీలో ‘యయాతి’ నవల రాశారు. పాత్రలో ఆత్మాభివ్యక్తి ద్వారా కథ నడిపేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియను అప్లై చేస్తే ద్రౌపది ఒక్కతే దీనికి సరిపోతుంది. మహోన్నతమైన ఆమె గుణశీలాలను తెలియజెప్పడానికి ఈ నవల రాశాను’ అని చెప్పాను. జస్టిస్‌ చలమేశ్వర్‌, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి గార్లు ముందు మాట రాశారు. ఆ పుస్తకాన్ని రష్యన్‌ భాషలోకి అనువదించుకుని, నన్ను ఆహ్వానించి, ‘పుస్కిన్‌’ పురస్కారంతో సత్కరించారు. ‘సార్క్‌ రైటర్స్‌ అసోసియేషన్‌’ ప్రెసిడెంట్‌, ప్రముఖ రచయిత అజిత్‌ కౌర్‌... ‘అలాంటి పుస్తకం నేను కదా రాయాల్సింది! నువ్వెలా రాశావ్‌’ అన్నారు. ‘పరకాయ ప్రవేశం చేశా’నంటూ బదులిచ్చాను. అన్ని భాషల్లోకి అనువాదమై చాలా డబ్బులు కూడా వచ్చాయి. ఆ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద, సృజన పురస్కారాలు వచ్చాయి. అలా రెండూ దక్కించుకున్న ఏకైక భారతీయుడిని నేనే!

 

ఆర్కే: మీ పిల్లలిద్దరూ అమెరికా. అల్లుడు ఏకంగా అమెరికన్‌! మరి భాషలో మీ మనవళ్ల పరిస్థితేంటి?

యార్లగడ్డ: ఇక్కడ లేని తెలుగు అక్కడుంది. అక్కడ ‘మన బడి, మన పాఠశాల’ ఉన్నాయి. మా మనవరాలు తెలుగు పాఠశాలకు వెళుతుంది. నా భార్యతో ఫోన్‌లో తెలుగులో మాట్లాడి... ‘నానీ నీ కోసం నేను తెలుగు స్కూలుకు వెళుతున్నా’ అంటుంది. మా అల్లుడు అత్తగారితో మాట్లాడటానికి తెలుగు నేర్చుకొంటున్నాడు. వాళ్ల ఇంట్లో బుద్ధ విగ్రహం, భారతీయ సంస్కృతి అంటే ఇష్టం. నేను కోరేదేంటంటే... అందరూ పిల్లలకు తెలుగు నేర్పండి. మన సంస్కృతి గురించి చెప్పండి.

 

అలాగే మనం ఇంగ్లండ్‌, అమెరికా వెళ్లినప్పుడు అక్కడ కవులు, రచయితల ఇళ్లు భద్రపరిచి చూపిస్తున్నారు. విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు, గుంటూరులో జాషువా గారి ఇల్లు, విశాఖపట్నంలో శ్రీశ్రీ, రావిశాస్త్రి ఇళ్లు... ఇలా యాభై అరవై మంది కంటే ఉండరు. వీరందరి ఇళ్లను సురక్షితంగా ఉంచి, వాటిని ప్రదర్శన శాలలుగా మార్చాలి. ఎన్టీఆర్‌ గారు ట్యాంక్‌బండ్‌పై చేసినట్టు ‘తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్తం’ పేరుతో ఓ ప్రాజెక్టు చేయాలని కోరుతున్నాను. దీనికి ఎక్కువక్కర్లేదు... వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు.

 

ఆర్కే: తరువాత లక్ష్యం ఏంటి?

యార్లగడ్డ: ఇప్పటికి 64 పుస్తకాలు రాశాను. లోహియా, జైప్రకాశ్‌, కృపలాని గురించి ‘సమాజవాద త్రయం’ అనే పుస్తకం రూపందిస్తున్నా. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న వ్యాసాలు రాస్తున్నా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, నారాయణరెడ్డిగారు, దాసరి నారాయణరావు గారు చనిపోయిన తరువాత పౌరోహిత్యానికి లోటొచ్చేసింది. దేశంలో ఎవరు ఏ మూల తెలుగు, హిందీ భాషా సమావేశాలకు పిలిస్తే... నేను వాళ్లని కారు పంపమనో, భోజనం ఏర్పాటు చేయమనో అడగను. నా ఏర్పాట్లు నేనే చేసుకొంటా.

 

ఆర్కే: ఇప్పుడు హ్యాపీలైఫా! మందు కూడా వదిలేశారా?

యార్లగడ్డ: వయస్సుని బట్టి కొంత, ఆరోగ్యాన్ని బట్టి కొంత... ఇప్పటికే చాలా అరాచకాలు చేశాం ఇక ఎందుకులే అని వదిలేశాను.

 

ఆర్కే: చేయకూడని అరాచకాలు చాలా చేశారా?

యార్లగడ్డ: చేయకుండా ఎలా ఉంటాం. అందుకనే కదా ఓపెన్‌ హార్ట్‌కు రమ్మంటే ఇంత కాలం రానిది. అన్నీ ఉన్నప్పుడు నటించాలి. ఇప్పుడు అన్నీ వదిలేశాం కదా! నటించాల్సిన పనిలేదు. అబద్దం చెప్పాల్సిన పనిలేదు.

 

‘ఆంధ్రజ్యోతి’ నాకు పుట్టినిల్లు లాంటిది. అమెరికా వెళ్లినప్పుడు చుట్టూ అంతా కూర్చుంటారు. అప్పుడు చంద్రబాబునాయుడు గురించి అడిగారు. ‘నేనిప్పుడు విదేశంలో ఉన్నా. ఆయన్ని నేనేదైనా అనదలుచుకొంటే ఏపీ వెళ్లి మాట్లాడతాను తప్ప విదేశీ గడ్డపై నా ముఖ్యమంత్రి గురించి ఒక్క మాట మాట్లాడను. మీరు కూడా అట్లాగే ఉండండి’ అని చెప్పాను.

చిన్నతనంలో తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి ప్రపంచంలో నన్ను ఏ శక్తీ భయపెట్టేది కాదు.

తెలుగు వాడు రాసిన సాహిత్యం వాళ్లు ఎందుకు చదవాలి? ఈ విషయంపై బాగా ఆలోచించాను. అప్పుడు ‘తమస్‌’ అనే టీవీ సీరియల్‌ను గోవింద్‌ నిహలనీ గారు తీశారు. భీషమ్‌ సాహ్ని రాసిన నవల ఆధారంగా తీశారు. అది దూరదర్శన్‌లో ప్రసారమయితే ఒక వర్గానికి చెందిన కొంత మంది దూరదర్శన్‌ స్టేషన్‌ను పగులగొట్టారు. అప్పుడు భీషమ్‌ సాహ్నితో ఫోన్లో మాట్లాడి పుస్తకాన్ని 22 రోజుల్లో ట్రాన్స్‌లేట్‌ చేశాను. ఆ పుస్తకాన్ని చాలా మంది చదివారు. 1980లోనే ఆ పుస్తకానికి లక్ష రూపాయలు వచ్చాయి. అంటే అవసరానికి తగిన పుస్తకం. ఆ సమయంలోనే డా. సి. నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చింది. నారాయణరెడ్డి పేరు విన్నారు. కానీ ఆయన సాహిత్యంలోని లోతులు వాళ్లకు తెలియవు. అప్పుడు జ్ఞానపీఠ్‌ పురస్కార్‌ విజేత నారాయణరెడ్డి అని హిందీలో పుస్తకం రాశాను. అది బాగా అమ్ముడుపోయింది.

మా మాస్టారు ఒక్కటే చెప్పారు. తులసీదాస్‌ గురించి, సూరదాస్‌ గురించి, ప్రేమదాస్‌ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. ఇప్పుడు నువ్వు రాస్తే వచ్చేదేముంది. నువ్వు శాశ్వతంగా నిలబడాలంటే ఒక వర్క్‌ చెబుతాను పరిశోధన చేయగలవా? అని అడిగాడు. ఏంటది? అంటే ‘హిందీ కవితాకో ఆంరధోంకె దేన్‌’. అంటే హిందీ కవిత్వ వికాసంలో తెలుగు వాళ్లు ఏం చేశారు. అప్పుడు హిందీ నేర్చుకోవాలన్న ఆలోచన తెలుగు వాళ్లకు ఎందుకు కలిగింది. అక్కడి నుంచి ఎలా నేర్చుకున్నారు. ఇలాంటి విషయాలపైన పరిశోధన చేశాను.

ఇక్కడ హిందీ నేర్చుకోవడం మొదలయింది గాంధీ గారి వల్లే. గాంధీ గారు వాళ్లబ్బాయి దేవదాసు గాంధీని తమిళ, తెలుగు రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవాలనే కుతూహులం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి హిందీ నేర్పి రమ్మని పంపించారు. ఆయన ఒక బ్యాచ్‌కు హిందీ నేర్పి వెళ్లిపోయారు. తరువాత ఆ బ్యాచ్‌, మరొక బ్యాచ్‌కి, ఆ బ్యాచ్‌, ఇంకో బ్యాచ్‌కి హిందీ నేర్పుతూ వెళ్లింది. అలా హిందీ బాగా చేరువయింది.

మొదటి హిందీ అధ్యాపకునిగా వచ్చిన దేవదాసు గాంధీ మద్రాసులో ఎక్కడుంటారు. రాజగోపాలచారి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఖాళీగా ఉన్నాడా అంటే రాజగోపాలచారి కూతురు లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే హిందీ మాస్టార్లతో జాగ్రత్త అని చెబుతుంటాను.

నా బాధేమిటంటే జ్ఞానపీఠ్‌ పురస్కారం మనలో ఎంతమందికొచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు, డా. సి. నారాయణరెడ్డిగారు, రావూరి భరద్వాజగారికొచ్చింది. ఎన్నేళ్లకు ఎంతమందికొచ్చింది. పక్కరాష్ట్రాల్లో ఎంత మందికొచ్చింది. ఎవరిని నిందించాలి. వాళ్లను నిందించడానికి లేదు.

తెలంగాణ ప్రాంతంలో ఉన్న హిందీని దక్కిని హింది అంటారు. దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ వాళ్లకు హిందీ రావడంతో ఇతర రాష్ట్రాల్లో పరిశీలకులుగా వెళ్లగలిగారు. కేంద్రమంత్రులు కాగలిగారు. ఆంధ్ర ప్రాంతంలో అది లేదు. రెండు, మూడు జిల్లాలను శాసించే వాళ్లు కూడా కమ్యునికేషన్‌ లేక ఢిల్లీ వరకు వెళ్లలేకపోయారు. హిందీ రాకుండా ఏ ఒక్కరూ కూడా జాతీయస్థాయిలో ఏ రంగంలోనూ రాణించలేరు.

అమితాబచ్చన్‌ తండ్రిగారి ఆత్మకథను నేను తెలుగులోకి అనువదించాను. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం అమితాబచ్చన్‌ గారు వాళ్ల నాన్న ఫస్ట్‌ యానివర్సరీ రోజున కుటుంబంతో సహా వచ్చారు. అప్పుడాయన మాట్లాడుతూ మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే మా నాన్నగారిని ఒక ప్రాంతంలో ఉన్న కొన్ని కోట్ల మందికి పరిచయం చేశారని చెప్పారు. ఇది చాలా సంతోషాన్నిచ్చింది.

నా 50వ యేట లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. నారాయణరెడ్డిగారు, వి.ఎస్‌ రమాదేవి, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌... ఈ ముగ్గురు మాకు న్యాయ నిర్ణేతలు. రాష్ట్రంలో అందరినీ తెలుసుకుని ఒక ఏడెనిమిది పేర్లు తీసుకెళ్లి వాళ్లకిస్తా. వాళ్లు ఒకరిని ఎంపిక చేస్తారు. ఈ ఏడాది మీగడ రామలింగస్వామికి ఇచ్చాం.

నాకు మిత్రసంపద, శిష్యసంపద ఉంది. సొంతిల్లు లేదు. సొంత కారు లేదు. అద్దె ఇంట్లో ఉంటాను. పెన్షన్‌, పుస్తకాల మీద వచ్చిన డబ్బుతో గడిపేస్తుంటాను. పుస్తకాల మీద నెలకు లక్షా, లక్షన్నర వరకు వస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా చెప్పండి. అక్కడ నాకో శిష్యుడు ఉంటాడు. వాళ్లు నాకు ఓ రూమ్‌ బుక్‌ చేస్తారు. భోజనం ఏర్పాట్లు చేస్తారు. నాకు ఖర్చంటే పొద్దున ఆరేడు పేపర్లు కొనుకున్నదే.

సెంట్రల్‌ హిందీ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్నారు. హోం మినిస్టర్‌ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఆరుగురు కేంద్రమంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు సభ్యులు. నేను నాన్‌ ఆఫిషియల్‌ మెంబర్‌ని. నేను గట్టిగా పట్టుకున్న పట్టేమిటంటే గత 25 ఏళ్లుగా ప్రధానమంత్రులు మారుతున్నారు. ముఖ్యమంత్రులు మారుతున్నారు. నా సభ్యత్వం మారట్లేదు. ఎందుకంటే ఆఫిషియల్‌ లాంగ్వేజ్‌ యాక్ట్‌. భారతదేశ అధికార భాషా చట్టంలో దక్షిణ భారతీయుడిగా నాకు అధికారం ఉంది. రాబోయే పదేళ్లలో కూడా దీన్ని ఎవ్వడూ సంపాదించలేడు.

నాకున్న కేంద్రీయ హిందీ సమితి సభ్యత్వం ద్వారా మూడు సింహాలున్న ఏ కార్యాలయంలోకి వెళ్లి నా కార్డు ఇచ్చినా బైఠీయే అని, ఛాయ్‌ పీతే అని గౌరవ మర్యాదలు ఇస్తారు.


ఆర్కే: మీ సాహిత్య సేవను నిరంతరం కొనసాగించాలని కోరుకొంటూ ధన్యవాదాలు..!

Updated Date - 2020-02-07T22:06:18+05:30 IST