యాసంగి ధాన్యం కొనం

ABN , First Publish Date - 2021-11-30T07:57:28+05:30 IST

‘‘యాసంగిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

యాసంగి ధాన్యం కొనం

  • కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయం.. 
  • పండిస్తే ప్రభుత్వానికి సంబంధం లేదు
  • కేంద్రం చేతులెత్తేయడంతోనే ఈ నిర్ణయం.. 
  • వానాకాలం సేకరణకూ హామీ ఇవ్వట్లేదు
  • తీసుకోకపోతే, ప్రధాని ఇంటి ముందు పోస్తాం.. 
  • లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడుతోంది
  • ఇంత నీచ సర్కారును ఎప్పుడూ చూడలేదు.. 
  • కేంద్రంలో నరహంతక, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం
  • వీళ్లు ముంచేటోళ్లే తప్ప మంచి చేసేటోళ్లు కాదు.. 
  • వాళ్లవి విభజన రాజకీయాలు: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘యాసంగిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులు ఎత్తేసిందని, యాసంగి ధాన్యం కొనేది లేదని ముందే చెప్పిందని, ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పడంతో రాష్ట్ర మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు వరి పండిస్తే ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని, పండిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘‘రైతులు తమ తిండి గింజల కోసం వరి సాగు చేయవచ్చు. విత్తన కంపెనీలు, ప్రైవేటు వ్యాపారులు కొంటారని భరోసా ఉన్నవాళ్లు సాగు చేయవచ్చు. అది రైతుల రిస్క్‌. ప్రభుత్వ పాత్ర లేకుండానే అమ్ముకోవాలి’’ అని స్పష్టం చేశారు.


ప్రధాని కార్యాలయం ముందు పోస్తాం

వానాకాలం ధాన్యం సేకరణకు కూడా కేంద్రం హామీ ఇవ్వడం లేదని, కేంద్రం సేకరణ 40 లక్షల టన్నులు దాటడం లేదని సీఎం కేసీఆర్‌ తప్పుబట్టారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ‘‘కేంద్రం కొనుగోలు చేయకపోతే 1000 లారీల వడ్లను ఢిల్లీలోని బీజేపీ, ప్రధాన మంత్రి కార్యాలయాల ముందు పోస్తాం. 1000 లారీలు పెట్టి ధాన్యాన్ని తీసుకుని ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద పారపోస్తాం. వర్షాకాలంలో ఎంతైనా కొంటామని కిషన్‌ రెడ్డి చెబుతున్నారు. ఒకవేళ కొనకుంటే ఆయన ఇంట్లో కూడా ధాన్యాన్ని పోస్తాం. రూ.200 కోట్లు ఖర్చయిన సరే ఢిల్లీకి తీసుకెళ్లి పోస్తాం’’ అని వ్యాఖ్యానించారు. వాళ్లు స్పందించకపోతే కోట్లు వెచ్చించి రైతులను ఆదుకునేందుకు తాము సిద్ధమని చెప్పారు. దేశంలో రైతులు బాగుపడాలంటే దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాలని, కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘డీజిల్‌ ధరలు మీరే పెంచుతారు. మళ్లీ రోడ్ల మీదే మీరే గొడవ చేస్తారు. వడ్లు కొనమంటారు. కల్లాల వద్దకెళ్లి గొడవ పెడతారు. ఈ దేశాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు’’ అని మండిపడ్డారు.


చిల్లర కొట్టు షావుకారులా కేంద్రం తీరు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా చిల్లరకొట్టు షావుకారులా, కిరాణా కొట్టులా కేంద్రం మాట్లాడుతోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఇంత నీచమైన, దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం, వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్రం బాధ్యత. ఆహార రంగంలో దేశాన్ని స్వావలంబనగా ఉంచడానికి బఫర్‌ స్టాక్‌ను ఉంచుకోవాలి. ఎఫ్‌సీఐ కోసం ధాన్యాన్ని సేకరించాలని కేంద్రం అనుకుంటే రాష్ట్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సేకరించి అప్పగిస్తాయి. కొన్నేళ్లుగా ఉన్న విధానమిది. కానీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. తన సామాజిక బాధ్యతను విస్మరించి, ధాన్యాన్ని కొనలేమని చెబుతోంది. 


పెద్ద రాద్ధాంతాన్ని సృష్టించి దేశ రైతాంగం మొత్తాన్ని గందరగోళపరుస్తోంది. చిల్లర కొట్టు షావుకారులా మాట్లాడుతోంది. ప్రతి విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడతావా? అలాంటప్పుడు నువ్వు ప్రభుత్వం ఎలా అవుతావు?’’ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలని, నిల్వలు పెరిగితే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించే శక్తి కూడా కేంద్రానికే ఉండాలని చెప్పారు. ఆ ప్రక్రియలో వేల కోట్లో, లక్ష కోట్లో నష్టం వస్తే కేంద్రమే భరించాలని తెలిపారు. కానీ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకొంటూ నెపాలను ఘోరాతిఘోరంగా రాష్ట్రాలపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.


మెడ మీద కత్తి పెట్టి అండర్‌టేకింగ్‌

గత యాసంగిలో రాష్ట్రం ఇచ్చిన ధాన్యాన్నే కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని, తాము రైతుల నుంచి సేకరించిన ధాన్యం తీసుకోవాలని, వాటికి డబ్బులు ఇవ్వాలని అడిగితే సమాధానం లేదని కేసీఆర్‌ తప్పుబట్టారు. గత యాసంగి ఉప్పుడు బియ్యం తీసుకోవాలని డిమాండ్‌ చేశామని, దాంతో, భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వమంటూ అండర్‌ టేకింగ్‌ ఇస్తేనే ఇప్పుడు తీసుకుంటామని స్పష్టం చేశారని, మెడ మీద కత్తి పెట్టి మరీ అండర్‌ టేకింగ్‌ రాయించుకున్నారని తెలిపారు. లేకపోతే, 25 లక్షల టన్నుల బియ్యం మీద పడతాయని చెప్పారు. ఇక, బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే, ముడి బియ్యం ఏడాదికి ఎంత తీసుకుంటారో చెప్పాలని అడిగామని, అంత మేరకే పండిస్తామని కోరామని, ఆ విషయం కూడా చెప్పడం లేదని తప్పుబట్టారు. ‘‘వానాకాలం పంట టార్గెట్‌కే దిక్కు లేదు. 


యాసంగిలో పంట ఎక్కువ పండినా... 35 డిగ్రీల ఎండ ఉంటుంది. నూక శాతం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం పండే వడ్లకు క్వింటాకు 67 కిలోల బియ్యం వస్తే, యాసంగి వడ్లకు 35 కిలోలే వస్తాయి. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి?’’ అని ప్రశ్నించారు. అసలు, గతంలో ఎఫ్‌సీఐ చెబితేనే మిల్లర్లు బాయిల్డ్‌ చేసి బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. ‘‘మన ఎంపీలు వెళితే మీకు పని లేదా? అని కేంద్ర మంత్రి అన్నాడు. పైగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ‘‘మీ వద్ద పంట అంత లేదు. శాటిలైట్‌ చూపడం లేదని అంటున్నారు. శాటిలైట్‌ చూపడం లేదా? నీ మెదడు చూపడం లేదా? నువ్వు మంత్రివా!? మొత్తం లెక్కలు తీసుకెళ్లి ఆయన మొహం మీద కొట్టిన. అప్పుడు 58.66 లక్షల ఎకరాల్లో ఉన్నది కరెక్టే అని అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతి ఇదేనా?’’ అని మండిపడ్డారు.


చేతగాని దద్దమ్మ కిషన్‌రెడ్డి

రైతుల నుంచి ధాన్యాన్ని తాము కొనమన్నామా? అని కిషన్‌ రెడ్డి అంటున్నారని, ఇది దుర్మార్గమని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘ఒక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నాడంటే ఆ రాష్ట్ర ప్రజలు సంతోషపడ్తారు. మా రాష్ట్రం నుంచి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని కేంద్రానికి చెబితే ఆయన సిపాయు అవుతాడు. ఎలాగైనా కొనిపిస్తానని చెబితే సిపాయి. కొనమని చెప్పే రండ కేంద్ర మంత్రి కావాలా తెలంగాణకు? చేతగాని దద్దమ్మ. ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. నీకు దమ్ముంటే బాయిల్డ్‌ రైస్‌ను కొనిపించు’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావాలా? కిషన్‌ రెడ్డి భరించరాని మాటలు మాట్లాడిండు. అగ్రికల్చర్‌ పాలసీ నీకు తెలుసా తోక? పాలసీ లేకుండానే 1.41 కోట్ల టన్నుల బియ్యాన్ని ఇచ్చామా? ఉప్పుడు బియ్యం కొంటవా కొనవా చెప్పురా బై అంటే చెప్పడట. 


ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనేసింది. కానీ, కల్లాలకాడ డ్రామా పెడతున్నారు’’ అని కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌పై మండిపడ్డారు. పనికిమాలిన, అవగాహన లేని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ మెడలు వంచి కొనిపిస్తామని రైతులకు హామీ ఇచ్చాడని, ఇదే విషయాన్ని తాను కేంద్ర మంత్రిని అడిగితే, సంజయ్‌, కిషన్‌ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడారని తనతో అన్నారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని కిషన్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ‘‘ఒకటి రెండు స్థానాల్లో గెలవగానే ఆగుతలేరు. కేసీఆర్‌ దెబ్బకు నువ్వు అంబర్‌పేటలో ఎగిరిపోలేదా? గెలుపోటములు సహజం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ బతుకు ఎక్కడైనా ఉందా? 13 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచాం. ఇంకో ఆరు నడుస్తున్నాయి. పోతే ఒకటో రెండో పోతాయి. అది పెద్ద సమస్యా?’’ అని అన్నారు.


కేంద్రంలో రైతు హంతక ప్రభుత్వం

కేంద్రంలో రైతు హంతక ప్రభుత్వం ఉందని, దిక్కుమాలిన చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ‘‘750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది. రైతు రాబంధు పార్టీ మీది. మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము రైతు బంధువులం. పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచింది ఎవరు? మోదీ ప్రభుత్వం కాదా? క్రూడాయిల్‌ ధర అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? క్రూడాయిల్‌ ధర తగ్గిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పి డీజిల్‌ ధర పెంచలేదా? తర్వాత రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలంటూ ధర్నాలు చేస్తారు. సిగ్గుందా? వీళ్లు ముంచెటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు కాదు’’ అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ, అంబానీలకు అప్పజెప్పేందుకే సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, రైతులు గట్టిగా ఉద్యమించగానే ఉపసంహరించుకుందని అన్నారు. 116 దేశాల్లో సర్వే చేస్తే ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్‌ 92వ స్థానంలో ఉంటే, భారతదేశం 101వ స్థానంలో ఉందని, బంగ్లాదేశ్‌, నేపాల్‌ ర్యాంకులు 76 అని, ఇదీ మన బతుకని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 


బీజేపీ పాలనలో ఆకలి కేకలు పెరిగాయని, అయినా, బియ్యం కొనేది లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సిగ్గు లేకుండా అంటున్నారని విమర్శించారు. రైతుల మెడపై కత్తి పెట్టి ప్రతి బోరు వద్ద మీటరు బిగించాలని కేంద్రం చూస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించి.. పెత్తనం చేయాలనుకుంటోందని, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు దేశంలో మత పిచ్చి లేపి విభజన రాజకీయాలు చేస్తారని, దేశాన్ని రావణ కాష్టం చేస్తారని ఆరోపించారు. ‘‘మతాల మధ్య పంచాయతీ పెట్టి.. కల్లోలాలు సృష్టించి.. కర్ప్యూలు, లాఠీచార్జీలు పెట్టాలని చూస్తున్నారు. మేధావులారా.. బీజేపీని మీరు అంగీకరిస్తారా? వాళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతాం. దుర్మార్గులు.. రాబంధుల్లాగా పడి రైతులను నాశనం చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. కాగా, బీజేపీ ప్రభుత్వం చంపిన 750 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం ఇచ్చేందుకు కేబినెట్‌ రూ.22.50 కోట్లు మంజూరు చేసిందని, తాను, మంత్రులూ వెళ్లి వాటిని ఇస్తామని చెప్పారు.


‘‘బీజేపీ పాలనలో రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారు. దేశంలో ప్రస్తుతం 1.30 లక్షల కోట్ల అప్పు ఉంది. మీపాలనలో ఏం ఉద్ధరించారు? ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంది? దేశానికి ఒరగబెట్టింది ఏంది? గత రెండేళ్లలో దేశంలో పేదరికం పెంచారు. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారు’’


మేం బాజాప్తా బీజేపీతో పోరాటానికి దిగినం.. ఢిల్లీలో, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తాం. అన్ని అంశాల మీద కొట్లాడతం. పవర్‌ బిల్లుకు వ్యతిరేకంగా కొట్లాడతాం. ఎస్సీ రిజర్వేషన్‌, గిరిజన రిజర్వేషన్‌ పెంచమని కోరినం.. వాళ్లు కింద పెట్టుకొని కూసున్నరు.

- సీఎం కేసీఆర్‌

Updated Date - 2021-11-30T07:57:28+05:30 IST