‘కె.జి.యఫ్’ హీరో సంచలన నిర్ణయం

Jun 1 2021 @ 21:06PM

కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ఎటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్ పెట్టి.. ప్రజలు గుమికూడకుండా చేసి ఈ మహమ్మారి ఉదృతి తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు మానవత్వం ఉన్న మనుషులు ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నందున పేద ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ ప్రభావం గట్టిగానో ఉంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోవడంతో సినీ కార్మికులు ఎందరో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ‘‘కొవిడ్ 19 అనే కనిపించని శత్రువు.. ప్రజల ప్రాణాలను బలిగొంటూ.. వారికి జీవనోపాధి లేకుండా చేస్తుంది. నా సొంత కన్నడ సినీ పరిశ్రమ కూడా ఈ మహమ్మారికి ప్రభావితమైంది. ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీలోని 21 విభాగాలలో ఇబ్బందులు పడుతున్న 3000 మంది సభ్యులకు.. నా సంపాదన నుంచి.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు పంపిస్తున్నాను. ఈ సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు.. కానీ ఎంతో కొంత ఊరటనిస్తుంది. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉందాం..’’ అని యష్ తన ట్వీట్‌లో తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.