కుమ్ములాటపై వైసీపీ అధిష్ఠానం సీరియస్‌

ABN , First Publish Date - 2020-11-27T07:48:09+05:30 IST

పిఠాపురం వైసీపీలో కుమ్ములాటపై..

కుమ్ములాటపై వైసీపీ అధిష్ఠానం సీరియస్‌

  • విచారణకు ఆదేశించిన వైవీ సుబ్బారెడ్డి 
  • క్రమశిక్షణా సంఘం సభ్యుడు మొగలి బాబ్జికి బాధ్యతలు

పిఠాపురం(తూర్పు గోదావరి): పిఠాపురం వైసీపీలో కుమ్ములాటపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జగనన్న తోడు కార్యక్రమంలో వైసీపీ నాయకుల్లో ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. దీనిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కుమ్ములాటకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు వెళ్లిన నేపథ్యంలో స్థానికంగా నాయకులు తగాదాలకు దిగారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతుందని భావించిన సుబ్బారెడ్డి వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.


ఈ నేపథ్యంలో గొల్లప్రోలుకు చెందిన వైసీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు మొగలి బాబ్జికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఘటనపై విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని ఆయనను ఆదేశించారు. పార్టీలో ఆధిపత్య పోరు, కుమ్ములాటలపై విచారణ తర్వాత ఇచ్చే నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారో, అధిష్ఠానం వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. క్రమశిక్షణ చర్యల తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని పార్టీ సీనియర్‌ నాయకులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-11-27T07:48:09+05:30 IST